ముంబై: దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు విచారిస్తున్న ముంబై పోలీసులు (mumbai police) దుండగుడు సైఫ్‌పై దాడి చేసిన ప్రదేశం నుంచి ఫింగర్ ప్రింట్స్ (fingerprints) సేకరించారు. ఆ వేలిముద్రలకు.. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్‌ఇస్లాం వేలిముద్రలతో మ్యాచ్ కావడం లేదని తేలింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దొంగతనం చేసే ప్రయత్నంలో నిందితుడు షరీఫుల్‌ఇస్లాం సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడికి యత్నించాడు. అయితే హైప్రొఫైల్ కేసు కావడంతో ముంబై పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటినుంచి 19 సెట్ల వేలిముద్రల్ని సేకరించారు. ఆ వేలి ముద్రలు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని నిర్ధారించారు.
ముంబై పోలీసులు సైఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రలను సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపారు. అక్కడ వేలిముద్రల్ని పరిశీలించగా..షరీఫుల్ ఫింగర్ ప్రింట్‌లతో సరిపోలడం లేదని సిస్టమ్ జనరేటేడ్ రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఫింగర్ ప్రింట్ పరీక్షల్లో ఫలితం నెగిటీవ్‌గా వచ్చింది. ఫలితం నెగిటివ్ అని సీబీఐ అధికారులు ముంబై పోలీసులకు సమాచారం అందించారు. తదుపురి పరీక్షల కోసం సైఫ్ ఇంటినుంచి మరిన్ని వేలిముద్రల నమోనాల్ని సేకరించిన పోలీసులు మరోసారి సీఐడీ విభాగానికి పంపినట్లు సమాచారం.
దాడి జరిగిందిలా.. సైఫ్ వాంగ్మూలం ప్రకారం..
‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్‌ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు.
దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్‌ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.
ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్‌ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్‌ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.
ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment