బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital) వైద్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 తర్వాత ఆయన డిశ్చార్జ్ అవుతారని వారు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. దాడిలో భాగంగా సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయం అయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు.
సైఫ్‌పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను విచారించిన పోలీసులు క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. ఫోరెన్సిక్ అధికారులు కూడా సైఫ్ ఇంటికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు గుర్తించారు. ఇదే విషయాన్ని ఒక అధికారి కూడా ప్రకటించారు. ఇంట్లోని కిటికీలతో పాటు లోపలికి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై కూడా నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు.
(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ప్రముఖ దర్శకుడు)
ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రకటించారు. దాడి తర్వాత తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సైఫ్ పూర్తి ఆసుపత్రి బిల్ రూ. 40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల సదరు కంపెనీ వాళ్లు ఇప్పటి వరకు రూ.25 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.
సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో అతన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా ఆ సమయంలో తండ్రితో పాటు ఉన్నాడు. అయితే, ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. కానీ, సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. సైఫ్ నేడు డిశ్చార్జ్ అయిన తర్వాత తనకు ఏమైనా సాయం చేయవచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment