'పొట్టకూటి కోసం వచ్చిన నా కొడుకు నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి చేయలేదు. కావాలనే అతడ్ని ఈ కేసులో ఇరికించారు' అంటున్నాడు నిందితుడి తండ్రి. సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించిన విషయం తెలిసిందే! నిందితుడిని బంగ్లాదేశ్ వాసిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. జనవరి 29వరకు పోలీసుల కస్టడీకి ముంబై కోర్టు అనుమతిచ్చింది.
తిరిగి వచ్చేయాలనుకున్నాడు
ఈ క్రమంలో నిందితుడి తండ్రి మహ్మద్ రుహుల్ అమీన్ ఫకీర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియాతో ఫోన్‌కాల్‌లో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు బాగోలేనందున నా కుమారుడు మధ్యవర్తి సాయంతో ఇండియాకు వచ్చేశాడు. ఉద్యోగావకాశాల కోసం గతేడాది ఏప్రిల్‌లో భారత్‌లో ప్రవేశించాడు. కావాల్సినంత సంపాదించుకున్నాక తిరిగి బంగ్లాకు వచ్చేయాలనుకున్నాడు.
ముంబైలో ఎందుకంటే?
ముందుగా పశ్చిమ బెంగాల్‌లోని ఓ హోటల్‌లో పని చేశాడు. బెంగాల్ కంటే ముంబై రెస్టారెంట్లలో ఎక్కువ జీతం కావడంతో తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. తరచూ మాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. చివరిసారిగా శుక్రవారం నాతో ఫోన్‌లో మాట్లాడాడు. ప్రతి నెల పదో తారీఖున అతడికి జీతం పడుతుంది. అలా నాకు రూ.10 వేలు పంపాడు. తన ఖర్చుల కోసం రూ.3 వేలు ఉంచుకున్నాడు. మేము పేదవాళ్లమే కానీ నేరస్తులం కాదు. బంగ్లాదేశ్‌లో అతడు బైక్ టాక్సీ నడిపేవాడు.
అన్యాయంగా ఇరికిస్తున్నారు
నా కొడుకును అరెస్ట్ చేశారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది నా కొడుకు కాదు. మీరంతా పొరబడుతున్నారు. అతడెప్పుడూ తన జుట్టు అంత పొడవుగా ఉంచుకునేవాడు కాదు. ఎవరో కావాలనే ఈ కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు. అధికారులు నా కొడుకే నిందితుడు అని పొరబడుతున్నారు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇండియాలో మాకు తెలిసినవారెవరూ లేరు. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. నా కొడుకు నిర్దోషిగా వస్తాడని ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.
సైఫ్‌పై దాడి
కాగా జనవరి 16న ముంబైలోని ఇంట్లో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడిన నిందితుడు సైఫ్ చిన్న కుమారుడు జెహంగీర్ గదిలో చొరబడ్డాడు. అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేయడంతో సైఫ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో అతడు సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.
సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్
తీవ్ర గాయాలతో ఉన్న సైఫ్.. కుమారుడు తైమూర్‌తో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ సైతం రక్తంతో తడిసిన సైఫ్‌ను చూసి రూపాయి కూడా తీసుకోలేదు. తీవ్రగాయాలపాలైన సైఫ్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. వెన్నెముకలో విరిగిన 2.5 అంగుళాల కత్తి మొనను సర్జరీ చేసి తొలగించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్.. బిజోయ్ దాస్‌గా పేరు మార్చుకుని భారత్‌లో అక్రమంగా చొరబడ్డాడని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment