ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మనబడి నాడు–నేడుతో ఎన్నో బడుల రూపురేఖలు మారిపోయాయి. మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తెచ్చారు. రోజుకో మెనూతో పౌష్టికాహారం అందిస్తున్నారు. విద్యాకానుక అందజేస్తున్నారు. బోధనపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు స్కూల్ అటెండెన్స్ యాప్‌ను తెచ్చారు. దీంతో పిల్లలు సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లి చదువుకునే అవకాశం ఉండడంతో వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు(టౌన్): పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు రిజిస్టర్‌లో నమోదు చేస్తుంటారు. కొంతమంది పిల్లలు బడికి వెళ్లకుండా క్లాసులకు డుమ్మా కొట్టేవారు. దీంతో వారు చదువులో వెనుకంజలో ఉండేవారు. ఈ విషయంలో విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉండేది. విద్యార్థుల హాజరు పక్కాగా ఉండాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అటెండెన్స్ యాప్‌ను కొంతకాలం క్రితం ప్రారంభించింది. సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతితోపాటు ఆన్‌లైన్ ద్వారా కూడా నమోదు చేస్తున్నారు. యాప్‌లో రోజూ ఉదయం 10 గంటల్లోపే వివరాలు నమోదు చేస్తున్నారు. వీరు భోజనం కూడా చేస్తారా లేదా అనే విషయాన్ని మరో విండోలో ఉంచుతారు. ఈ ప్రక్రియను ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి హెచ్‌ఎం లాగిన్ ద్వారా ఆన్‌లైన్ చేయనున్నారు.
ఏమి చేస్తారంటే..
రోజూ అటెండెన్స్ యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. విద్యార్థి గైర్హాజరైన సమాచారాన్ని హెచ్‌ఎం లాగిన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ విషయం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వెళ్తుంది. అనంతరం హాజరు కాని విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వెళ్తుంది. ఆ పాఠశాల ఉపాధ్యాయులతోపాటు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు సైతం గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడతారు. అలాగే విద్యార్థి వరుసగా మూడు రోజులు గైర్హాజరైతే సంబంధిత సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వలంటీర్‌కు సమాచారం పంపుతారు. దీంతో వారు స్వయంగా విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు ఎందుకు గైర్హాజరయ్యారన్న కారణం తెలుసుకుంటారు. రోజూ బడికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు. దీంతో పిల్లలు చదువుపై దృష్టి సారిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
రాణించాలంటే..
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించి పని ఉన్న సమయంలో తమ వెంట తీసుకెళ్తుంటారు. దీని వల్ల వాళ్లకి చాలా పాఠాలపై అవగాహన ఉండదు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అందుతుందని నిబంధన విధించింది. ఈ విధంగానైనా తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపిస్తారని భావించింది. కాగా విద్యార్థి బడికి వచ్చే బాధ్యతను తల్లిదండ్రులకే వదిలేయకుండా ప్రభుత్వం అటెండెన్స్ యాప్‌ను తెచ్చింది. దీంతోపాటు రోజూ క్రమం తప్పకుండా స్కూల్‌కి వస్తేనే చదువు మెరుగుపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉంది. వీరు ఉన్నత విద్యలో రాణించాలంటే బేసిక్ లెవల్ గట్టిగా ఉండాలని ప్రభుత్వం భావించింది. పిల్లలు సక్రమంగా బడికి వచ్చే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్)
బడికి రావాలన్నదే లక్ష్యం
ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా బడికి వచ్చి చదువులో రాణించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే కార్పొరేట్ పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏర్పాటు చేశారు. పిల్లలపై పర్యవేక్షణకు కొత్తగా అటెండెన్స్ యాప్‌ను అమల్లోకి తెచ్చారు. ఆయా తరగతి టీచర్ హాజరును యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు కూడా బడికి రెగ్యులర్‌గా వస్తారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – పి.రమేష్, నెల్లూరు డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment