కావలి మండలం ముసునూరులోని జెడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతున్న అదనపు గదుల నిర్మాణం
నెల్లూరు(టౌన్): ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజలకు చిన్నచూపు ఉండేది. అక్కడ సౌకర్యాలు ఉండవని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు పంపేవారు. నేడు పరిస్థితి మారింది. కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనబడి నాడు – నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో తొలివిడతలో 1,059 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.232 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడత పనులు ప్రస్తుతం శరవేగంగా నాణ్యతగా జరుగుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే 15 శాతం నిధులు విడుదల చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తి చేసి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కార్పొరేట్ లుక్‌లో విద్యార్థులకు స్వాగతం చెప్పనున్నాయి.
ఏం చేస్తారంటే..
ఎంపికైన పాఠశాలలు, అంగన్‌వాడీలు, బీఈడీ, డైట్ కళాశాలల్లో మొత్తం పది రకాల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్ షెడ్‌ల నిర్మాణాలు చేస్తున్నారు. పెయింట్ వేయిస్తారు. లైట్లు, ఫ్యాన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం కుర్చీలు, బెంచీలు, ఇంగ్లిష్ ల్యాబ్, గ్రీన్ చాక్‌బోర్డు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. మేజర్, మైనర్ రిపేర్లు చేపడతారు.
ఎక్కడంటే..
కొత్త నెల్లూరు జిల్లాలో రెండో విడత నాడు – నేడులో భాగంగా 1,357 పాఠశాలలు, అంగన్‌వాడీలు తదితరాలను ఎంపిక చేశారు. మొత్తం 531 పాఠశాలల్లో 1,841 అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. రెండో విడత పనుల కోసం ప్రభుత్వం రూ.466.40 కోట్లను కేటాయించింది. దీనికి సంబంధించి తొలిదశలో రూ.79.67 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను నేరుగా ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ సభ్యుల అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటికే రూ.72.10 కోట్లు ఖర్చు చేసి పనులు చేశారు. మిగిలిన నిధులను దశల వారీగా ప్రభుత్వం ఆయా అకౌంట్లలో జమ చేయనుంది.
పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు
నాడు–నేడు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాయిలో హెడ్‌మాస్టర్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, మండల స్థాయిలో ఎంఈఓ, ఏపీఎం, డివిజన్ స్థాయిలో డిప్యూటీ డీఈఓ, జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ ఎస్‌ఈ, సమగ్రశిక్ష ఈఈ కమిటీల్లో ఉన్నారు. సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ రోజూ తమ బడులకు వెళ్లి పనులను ఫొటో తీసి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
త్వరగా పూర్తి చేయాలి
నాడు–నేడు పనుల కోసం రూ.4 కోట్ల మేర సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ (ఫర్నీచర్, శానిటరీ, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రికల్స్, సిరామిక్ టైల్స్ తదితరాలు) జిల్లాకు వచ్చింది. వీటితోపాటు సిమెంట్ కూడా వచ్చింది. పనులను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి. పనులు జరుగుతున్న పాఠశాలల్లో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
– ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్ష
జూనియర్ కళాశాలల్లోనూ..
జిల్లాలోని 22 జూనియర్ కళాశాలలను నాడు–నేడుకు ఎంపిక చేశారు. వాటిల్లో పలు రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించడం, కళాశాల భవవాలకు మరమ్మతులు, పెయింట్ వేయించడం, గ్రీన్ చాక్‌బోర్డు, కుర్చీలు, బల్లలు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.13.44 కోట్లను మంజూరు చేశారు. తొలివిడతలో భాగంగా రూ.2.42 కోట్లను తల్లిదండ్రుల కమిటీ అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటివరకు రూ.1.62 కోట్లను ఆయా పనుల కోసం ఖర్చు చేశారు. కళాశాలల్లో నాడు–నేడు పనులను కూడా మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment