second phase works
-
మెట్రో రెండో దశకు ఐదేళ్లయినా రెడ్ సిగ్నలే!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ పనులకు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైలుకు రెండోదశ కింద చేపట్టే 26 కి.మీ. కారిడార్‌తోపాటు మరో 5 కి.మీ. పొడిగింపు పనులకే ఇంకా అనుమతి ఇవ్వకుండా కేంద్రం ఐదేళ్లుగా నాన్చు తోంది. కేంద్రం కొర్రీలకు బదులివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అలసత్వం కూడా ఉండటంతో ఈ ప్రాజెక్టు ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో తెలియని పరిస్థితి. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో ఓ వైపు మెట్రో అలైన్‌మెంట్‌ను పొడిగించాలనే డిమాండ్లు పెద్దఎత్తున వస్తుండగా, ప్రతిపాదిత అలైన్‌మెంట్లకే అనుమతి రాకపోవడంతో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ తల పట్టుకుంటోంది. రెండో దశ కింద లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ (26 కి.మీ) వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ (5 కి.మీ)కు ప్రతిపాదించిన పొడిగింపు పనుల డీపీఆర్‌ను 2018 నవంబర్లోనే కేంద్రం ఆమోదానికి పంపగా, ఐదేళ్లయినా అతీగతీ లేదు. దీంతో రూ. 8,453 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టు అంచనా రెండింతలు పెరిగిందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టాలని అప్పట్లో నిర్ణయించారు. రూ. 8,453 కోట్ల ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరిస్తే, 60% మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై ఇటీవల సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచారం కోరితే.. ఇంకా మదింపు దశలోనే ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ వెల్లడించడం గమనార్హం. ఆది నుంచీ కొర్రీలే 2018 నవంబర్‌లో ఈ రెండోదశ పనులకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. 2021 వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ఈ ఫైల్ ఏమాత్రం ముందుకు కదల్లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖ రాయగా.. కేంద్రం ఫీజబిలిటీ, రైడర్‌షిప్‌లను సరిచేసేందుకు 15 అంశాలను ప్రస్తావిస్తూ వాటికి వివరణ ఇవ్వాలంటూ 2022 డిసెంబర్ 1న లేఖ రాసింది. ఈ వివరాలు పంపితేనే డీపీఆర్‌ను ఆమోదిస్తామని తేల్చిచెప్పింది. కేంద్రం అడిగిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2023, ఫిబ్రవరి 28న కేంద్రానికి పంపింది. ఎస్పీవీ ఏర్పాటు, మినిమమ్ లోకల్ కంటెంట్, సమగ్ర రవాణా సర్వే, సవరించిన డీపీఆర్ అంచనాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బెంచ్ మార్క్ ప్రకారం పూర్తి చేసి నివేదించారు. కానీ రాష్ట్ర కేబినెట్ ఆమోదం, దాని తీర్మానం కాపీని మాత్రం ఈ ఏడాది ఆగస్టు 8న అంటే కేంద్రం అడిగిన 9 నెలలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఇప్పటికీ కదలని ఫైలు రెండో ప్రాజెక్టుకు సంబంధించి 2023–24 బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని, 60 శాతం రుణం కోసం ఏజెన్సీని కూడా ఎంపిక చేయలేదని ఆర్టీఐ కింద కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికైనా రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం లభిస్తుందో లేదో తెలియడం లేదని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆమోదం లభించాక టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేందుకు ఇంకెన్నేళ్లు పడుతుందోనని అంటున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో ఇప్పట్లో లేనట్లే.. రెండో దశ డీపీఆర్‌కు ఇప్పటివరకు ఆమోదం లభించకపోవడంతో కొత్త మెట్రో ప్రతిపాదనలు అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రూ. 6,250 కోట్ల నిధులతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదిత అలైన్‌మెంటును మార్చనున్నట్లు ప్రకటించారు. రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్‌సిటీ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఎయిర్‌పోర్టుకు కొత్త అలైన్మెంట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు మొదటిదశలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు పనులు చేపట్టని నేపథ్యంలో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు అలైన్మెంట్ ఎలా రూపొందిస్తారో వేచిచూడాల్సిందే. -
ముమ్మరంగా నాడు – నేడు రెండోదశ పనులు
నెల్లూరు(టౌన్): ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజలకు చిన్నచూపు ఉండేది. అక్కడ సౌకర్యాలు ఉండవని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు పంపేవారు. నేడు పరిస్థితి మారింది. కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మనబడి నాడు – నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో తొలివిడతలో 1,059 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.232 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడత పనులు ప్రస్తుతం శరవేగంగా నాణ్యతగా జరుగుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే 15 శాతం నిధులు విడుదల చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తి చేసి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కార్పొరేట్ లుక్‌లో విద్యార్థులకు స్వాగతం చెప్పనున్నాయి. ఏం చేస్తారంటే.. ఎంపికైన పాఠశాలలు, అంగన్వాడీలు, బీఈడీ, డైట్ కళాశాలల్లో మొత్తం పది రకాల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్ షెడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. పెయింట్ వేయిస్తారు. లైట్లు, ఫ్యాన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం కుర్చీలు, బెంచీలు, ఇంగ్లిష్ ల్యాబ్, గ్రీన్ చాక్బోర్డు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. మేజర్, మైనర్ రిపేర్లు చేపడతారు. ఎక్కడంటే.. కొత్త నెల్లూరు జిల్లాలో రెండో విడత నాడు – నేడులో భాగంగా 1,357 పాఠశాలలు, అంగన్వాడీలు తదితరాలను ఎంపిక చేశారు. మొత్తం 531 పాఠశాలల్లో 1,841 అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. రెండో విడత పనుల కోసం ప్రభుత్వం రూ.466.40 కోట్లను కేటాయించింది. దీనికి సంబంధించి తొలిదశలో రూ.79.67 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను నేరుగా ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ సభ్యుల అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటికే రూ.72.10 కోట్లు ఖర్చు చేసి పనులు చేశారు. మిగిలిన నిధులను దశల వారీగా ప్రభుత్వం ఆయా అకౌంట్లలో జమ చేయనుంది. పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు నాడు–నేడు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాయిలో హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, మండల స్థాయిలో ఎంఈఓ, ఏపీఎం, డివిజన్ స్థాయిలో డిప్యూటీ డీఈఓ, జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ ఎస్ఈ, సమగ్రశిక్ష ఈఈ కమిటీల్లో ఉన్నారు. సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ రోజూ తమ బడులకు వెళ్లి పనులను ఫొటో తీసి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. త్వరగా పూర్తి చేయాలి నాడు–నేడు పనుల కోసం రూ.4 కోట్ల మేర సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ (ఫర్నీచర్, శానిటరీ, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రికల్స్, సిరామిక్ టైల్స్ తదితరాలు) జిల్లాకు వచ్చింది. వీటితోపాటు సిమెంట్ కూడా వచ్చింది. పనులను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి. పనులు జరుగుతున్న పాఠశాలల్లో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. – ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్ష జూనియర్ కళాశాలల్లోనూ.. జిల్లాలోని 22 జూనియర్ కళాశాలలను నాడు–నేడుకు ఎంపిక చేశారు. వాటిల్లో పలు రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించడం, కళాశాల భవవాలకు మరమ్మతులు, పెయింట్ వేయించడం, గ్రీన్ చాక్బోర్డు, కుర్చీలు, బల్లలు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.13.44 కోట్లను మంజూరు చేశారు. తొలివిడతలో భాగంగా రూ.2.42 కోట్లను తల్లిదండ్రుల కమిటీ అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటివరకు రూ.1.62 కోట్లను ఆయా పనుల కోసం ఖర్చు చేశారు. కళాశాలల్లో నాడు–నేడు పనులను కూడా మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
నేడు తూర్పు గోదావరికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడే సామర్థ్యాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర విద్యార్థుల్లో నెలకొల్పుతున్నారు. వారిని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతూ అత్యుత్తమ మానవ వనరుల తయారీయే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వారి భవిష్యత్తుకు పటిష్ట పునాదులు వేస్తూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. తొలివిడత పనులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పూర్తయ్యాయి. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వీటిని విద్యార్థులకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ వేదికగా నిలుస్తోంది. దీంతోపాటు నాడు–నేడు రెండో విడత పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. దీంతోపాటు వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా కానుకను ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఇలా.. ► సీఎం జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. ► 11 గంటలకు పి.గన్నవరం మండలం పోతవరం చేరుకుంటారు. ► అక్కడినుంచి పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌కు చేరుకుంటారు. తొలి విడత పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభించిన అనంతరం.. రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం శ్రీకారం చుడతారు. ► రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా కానుక రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో ప్రారంభిస్తారు. 8 పాఠశాల వద్ద ఉన్న భవిత కేంద్రం, గ్రంథాలయం, లేబొరేటరీలు పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన పలు స్టాళ్లను జగన్ సందర్శిస్తారు. ► విద్యార్థుల కోసం కొత్తగా ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. టాయిలెట్లను పరిశీలిస్తారు. అనంతరం నాడు–నేడు పైలాన్‌ను ఆవిష్కరించి, పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ► మ. 1.30 గంటలకు పోతవరం నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇది తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని శింగంశెట్టి ప్రభావతి జెడ్పీ ఉన్నత పాఠశాల. ‘నాడు–నేడు’ ద్వారా ఆధునికీకరించిన పాఠశాలలను సీఎం వైఎస్ జగన్ నేడు ఈ స్కూలు వేదికగా ప్రారంభిస్తున్నారు. 1970లో ఏర్పాటైన ఈ పాఠశాలలో మొత్తం 25 గదులు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడ మరుగుదొడ్లు ఉండేవి కావు. తాగునీటి సౌకర్యం అంతంత మాత్రమే. పాఠశాల గదుల్లో విద్యుత్ సౌకర్యం మాటేలేదు. పెచ్చులూడిపోయిన ఫ్లోరింగ్‌తో విద్యార్థులు నానా అవస్థలు పడేవారు. నాడు–నేడు కార్యక్రమం వల్ల 749 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రూ.64 లక్షల వ్యయంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రతి తరగతి గదికి నాలుగు లైట్లు, నాలుగు ఫ్యాన్లు, టైల్స్‌తో ఆకర్షణీయంగా ఫ్లోరింగ్‌ను తీర్చిదిద్దారు. మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేశారు.ఆధునిక హంగులతో మరుగుదొడ్లు నిర్మించారు. లైబ్రరీ, ఆధునిక ల్యాబ్ ఏర్పాటు చేశారు. -
టీహబ్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి
హైదరాబాద్: మాదాపూర్‌లో జరుగుతున్న టీ హబ్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. టీ హబ్ రెండో దశ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నోవర్టిస్ సాఫ్ట్వేర్ కంపెనీ సమీపంలో జరుగుతున్న టీ హబ్ నిర్మాణ పనుల్లో సోమవారం రాత్రి సెల్లార్ పునాది గోడ కూలి జియాఉల్ అన్సారీ అలియాస్ సోను(22), దిలీప్‌కుమార్ యాదవ్(40)లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరితోపాటు గాయపడిన ఇతర కార్మికులు చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారు బిహార్‌కు చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.