హాజర్..హడల్
♦ కళాశాలల్లో బయోమెట్రిక్ అమలు కచ్చితం
♦ 75శాతం అటెండెన్స్ లేకుంటే ఫీజురీయింబర్స్‌మెంట్ కట్
♦ పలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల్లో టెన్షన్
ఇకపై హాజరు పక్కా.. కాబోతోంది. రిజిష్టర్లలో తప్పుడు వివరాలు, విద్యార్థుల సంఖ్యను అదనంగా చూపడం సాధ్యం కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బయోమోట్రిక్ యంత్రాల ద్వారా అటెండెన్స్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుడుతుండడంతో..ఇకపై అసలు వ్యవహారం బయటపడనుంది. నిర్దేశించిన అటెండెన్స్ లేకుంటే ప్రభుత్వ ప్రోత్సాహకం నిలిచిపోనుండడంతో ప్రైవేట్ యాజమాన్యాల్లో.. హాజరును బట్టే పోస్టులు ఉంటాయనే ఆదేశాలు ఉండడంతో ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల్లో గుబులు మొదలైంది.
ఖమ్మం : పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించేందుకు అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అర్హులకే దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరును నమోదు చేయబోతున్నారు. విద్యార్థుల హాజరును బట్టే..అసలు ఎందరున్నారనేది తేలనుంది. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇకపై ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఒకేషనల్ కళాశాలల్లో కూడా పూర్తిస్థాయిలో పెట్టాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థుల సంఖ్యను బూచిగా చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కాజేసే పలు కళాశాలల యాజమాన్యాలకు మాత్రం ఇది కొరకరాని కొయ్యగా మారింది. వీటి అమలుపై ప్రభుత్వం కఠినంగానే ఉండడంతో ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు భయం పట్టుకుంది. గవర్నమెంట్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య సక్రమంగా లేకపోవడంతో క్లాసులు చెప్పినా, చెప్పకపోయినా గతంలో నడిచింది.
కానీ..ఇప్పుడు విద్యార్థుల సంఖ్యను పెంచితేనే అక్కడ కళాశాల, అధ్యాపకుల పోస్టులు ఉండే పరిస్థితి నెలకొంది. పోస్టులను కాపాడుకోవాలంటే..విద్యార్థుల సంఖ్యను రిజిస్టర్లకే పరిమితం చేయకుండా హాజరుశాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులు కళాశాలకు హాజరుకాకపోయినా రిజిస్టర్లలో తప్పుడు హాజరును చూపి..ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వసూలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇకపై సక్రమంగా చదవాలనే ఉద్దేశం ఉన్న విద్యార్థులే కళాశాలలో చేరే వీలుంటుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు. డిగ్రీలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాల కోసం చేసిన దరఖాస్తుల్లో కనీసం 20శాతం సీట్లు కూడా భర్తీ కాలేదని, మిగతా కోర్సుల కాలేజీల్లోనూ బయోమెట్రిక్ పెడితే అసలు హాజరుశాతం ఎంతనేది తేలనుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.
విద్యా ప్రమాణాలు పెరుగుతాయి..
ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు అమర్చడం సంతోషకరం. దీంతో చదువుకోవాలనే ఆలోచన ఉన్న విద్యార్థే కళాశాలలో చేరతాడు. అధ్యాపకులకు బాధ్యత పెరుగుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అర్హులైన విద్యార్థులకే అందుతాయి. 75 శాతం హాజరున్న విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించే అవకాశం ఉంది. విద్యాప్రమాణాలు మెరుగుపడతాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలన్నింటిలో బయెమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశాం. - ఆండ్రూస్, డీవీఈఓ