75 శాతం హాజరు ఉంటేనే ఉపకార వేతనాలు
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు
నంద్యాల అర్బన్: బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో 75 శాతం హాజరు ఉంటేనే కళాశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరవుతాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ప్రసాదరావు తెలిపారు. స్థానిక నేషనల్ పీజీ కళాశాలలో బుధవారం ప్రభుత్వం విద్యార్థులకు అందించే పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించిన విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ విద్యాసంస్థల అధినేత ఇంతియాజ్ అహమ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నంద్యాల డివిజన్‌లోని సుమారు 120 జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, వ్యవసాయ, పాలిటెక్నిక్, డైట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపసంచాలకులు ప్రసాదరావు మాట్లాడుతూ కళాశాలలకు ప్రభుత్వం మంజూరు చేసే ఆర్‌టీఎఫ్(రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు)లను ఈ సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేయనున్నట్లు చెప్పారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉపకార వేతనాలు అందించడానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూర్చిందని చెప్పారు. కార్యక్రమంలో నేషనల్ విద్యాసంస్థల ఏఓ రఫీ అహమ్మద్, నంద్యాల ఏఎస్ డబ్ల్యూఓ నాగేంద్రమణి, కోవెలకుంట్ల ఏఎస్‌డబ్ల్యూఓ లక్ష్మయ్య, సాంఘిక సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నేషనల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ప్రసాదరావును సన్మానించారు.