సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో బోగస్ కూలీల నమోదును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఉపాధి కూలీలకూ ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను ప్రవేశపెట్ట్టనుంది. ఫీల్డ్‌అసిస్టెంట్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్‌లోని యాప్ ద్వారా కూలీల హాజరును ఈ విధానంలోనే నమోదు చేస్తారు. కేంద్రం ప్రస్తుతం ఈ విధానాన్ని తప్పనిసరి చేయకుండా.. ఇప్పుడు అమల్లో ఉన్న విధానానికి అదనంగా డిసెంబర్ 4 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది.
పనులు కోరిన వారి వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ సేకరించి, వారికి పని కేటాయించే ఒక్క రోజు ముందు వారికి ఎక్కడ, ఎన్ని రోజులు పని కేటాయించారన్న వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ పని జరిగినన్ని రోజులూ ముందుగా నమోదు చేసిన కూలీల్లో రోజూ ఎవరెవరు పనికి వచ్చారో పని జరిగే ప్రదేశంలోనే యాప్‌లో వారి పేర్ల వద్ద హాజరైనట్టు టిక్ చేస్తారు. అంతేకాదు, కూలీలు పనిచేస్తున్నప్పుడు ఒక ఫొటో తీసి దానిని కూడా ఆ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
అయితే, ఆ ఫొటోలో పనిచేస్తున్న కూలీలు ఎవరన్నది వారి ముఖాలు స్పష్టంగా కనిపించినా, కనిపించకపోయినా.. కూలీల సంఖ్య మాత్రం స్పష్టంగా తెలిసేలా ఫొటోను అప్‌లోడ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, కొత్త విధానంలో కూలీల హాజరును ఫీల్డ్ అసిస్టెంట్ మొబైల్ యాప్‌లో టిక్ రూపంలో నమోదు చేసే బదులు.. ఆ కూలీ ముఖాన్ని ఫొటో తీస్తారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్‌లో నమోదైన ఫొటోతో ఈ ఫొటో సరిపోలాకే హాజరు పడేలా మొబైల్ యాప్‌లో సాఫ్ట్‌వేర్‌ను ఆధునికీకరించనున్నారు.
ఇకపై అలా వీలుపడదు..
జియో కోఆర్డినేట్ల(ఆ ప్రాంత వివరాలకు సంబంధిచిన శాటిలైట్ ద్వారా నిర్దేశించిన కొలతలు)ను ఆ పనికి అనుమతి తెలిపే సమయంలో పని ప్రదేశంలోనే ఇప్పటి వరకు నమోదు చేస్తున్నారు. కొత్త విధానంలో పని ప్రాంతంలోనే ఫీల్డ్ అసిస్టెంట్లు ఆయా కూలీల ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరును యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జియో కోఆర్డినేట్లు నమోదు చేసిన ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలో హాజరు నమోదుకు ప్రయత్నించినా వీలుపడదు.
ప్రస్తుతానికి రెండు విధానాల్లోనూనమోదుకు అవకాశం
ఆధార్ ఆధారిత కూలీల ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ అమిత్ కటారియా ఇటీవల అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇప్పటిదాకా కూలీల హాజరు నమోదు ప్రక్రియకు అనుసరించే విధానానికి అదనంగా డిసెంబర్ 4 నుంచి యాప్ ద్వారా కూలీల ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు నమోదు చేసేలా ఆధునికీకరించిన ఎన్‌ఎంఎంఎస్ యాప్ అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి రెండు ప్రక్రియల్లో హాజరు నమోదుకు వీలున్నా.. రానున్న రోజుల్లో ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు నమోదుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment