ఏమనీ చెప్పనూ.. | Bogus Accounts in Employment Scheme | Sakshi
Sakshi News home page

ఏమనీ చెప్పనూ..

Published Tue, Aug 22 2017 2:32 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

ఏమనీ చెప్పనూ.. - Sakshi

ఏమనీ చెప్పనూ..

► ఉపాధి పథకం సస్పెండెడ్‌ ఖాతాల్లో రూ.3.74 కోట్ల నిధులు   
► బోగస్‌ ఖాతాలతో కాజేసేందుకు పథకం
► ఆధార్‌ అనుసంధానంతో అక్రమార్కులకు చెక్‌


సాక్షి, మచిలీపట్నం : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల పేరుతో సొమ్ము స్వాహా చేయాలని క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందిలో కొందరు గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నించారు. ఈ మేరకు పథకం ప్రకారం జిల్లా వ్యాప్తంగా రెండున్నరేళ్ల వ్యవధిలో సస్పెండెడ్‌ అకౌంట్లకు రూ.3.74 కోట్లను మళ్లించారు. ఆ సొమ్మును 51,198 మంది కూలీలకు చెల్లించాలని రికార్డుల్లో చూపించారు. వాస్తవానికి రికార్డుల్లో చెబుతున్న కూలీల్లో 80 శాతం మంది బోగస్‌ అని సమాచారం.

మిగిలిన 20 శాతం మంది ఆధార్‌ సమస్యల వల్ల నగదు తీసుకోలేదని తెలిసింది. అయితే, సస్పెండెడ్‌ అకౌంట్లలో ఉన్న సొమ్మును తమ ఖాతాలకు మళ్లించుకోవాలని అక్రమార్కులు భావించగా, ఎప్పటికప్పుడు ఇబ్బందులు రావడంతో వెనకడుగు వేశారు. గత ఏడాది డిసెంబర్‌లో కూలీల ఖాతాలు, జాబ్‌ కార్డులకు ఆధార్‌ అనుసంధానం చేయడంతో కథ పూర్తిగా అడ్డం తిరిగింది. అప్పటి నుంచి కూలీల ఖాతాల్లోకే నగదు జమ అవుతోంది. దీంతో బోగస్‌ కూలీల పేరుతో సస్పెండెడ్‌ అకౌంట్లలో జమ చేసిన నగదు తీయడం సాధ్యం కాలేదు. అయితే, ఈ ఏడాదికి సంబంధించి ఆధార్‌ సమస్య వల్ల వేతనం తీసుకోలేని వారికి మాత్రం డబ్బులు చెల్లించే అవకాశం ఉంది.

సస్పెండ్‌ ఖాతాల్లో నిధులు ఇలా...
గడిచిన రెండున్నరేళ్లలో జిల్లా వ్యాప్తంగా 51,198 మంది కూలీలకు సంబంధించి రూ.3.74 కోట్ల వేతనం సస్పెండ్‌లో ఉంది. అందులో 30 నుంచి 60 రోజుల్లోపు పని దినాలకు సంబంధించి 2,685 మంది కూలీలకు చెందిన రూ.22.17 లక్షలు సస్పెండ్‌లో ఉంది. 60 నుంచి 90 రోజులకు సంబంధించి 1,751 మందికి రూ.21.97 లక్షలు, 90 రోజులకు పైబడి 36,399 మందికి రూ.44.36 లక్షలు పెండింగ్‌లో ఉంది. ఇందులో 90 రోజులకు పైబడి 36,399 మంది కూలీలకు చెందిన రూ.285.43 లక్షలు సస్పెండ్‌ అయింది. ఈ సొమ్ములో 80 శాతానికి సగానికి పైగా బోగస్‌ అకౌంట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే  సొమ్మును క్లెయిమ్‌ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం.

బోగస్‌ ఖాతాల మాయాజాలం
జిల్లాలో 49 మండలాలు, 970 పంచాయతీలున్నాయి. 1,839 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జిల్లాలో 6,06,583 మందికి ఇప్పటి వరకు ఉపాధి జాబ్‌కార్డులు మంజూరు చేశారు. అందులో 5,95,823 మంది కూలీలు ఉపాధి పనులు సద్వినియోగం చేసకుంటున్నారు. 37,008 మంది శ్రమశక్తి సంఘాల్లో నమోదు చేసుకున్నారు. ప్రతి రోజూ లక్షకు పైగా కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. గతేడాది జూన్‌ వరకు కూడా దాదాపు 500 పంచాయతీల్లో మాత్రమే కూలీలకు బ్యాంక్‌ ఖాతాలుండేవి. మిగిలిన పంచాయతీల్లో పోస్టాఫీసుల ద్వారానే చెల్లింపులు జరిగాయి. ఆ తర్వాత  వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రారంభించారు.

ఈ క్రమంలో ఎక్కడికక్కడ బోగస్‌ ఖాతాలు సృష్టించిన సిబ్బంది... పనులకు రాని కూలీల పేర్లతో సైతం మస్తర్లు సృష్టించి వేతన సొమ్మును ఖాతాల్లోకి వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీకి  శ్రీకారం చుట్టింది. జాబ్‌కార్డు ఉన్న వారందరికీ పీఎంజేడీవై (ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన), వ్యక్తిగత పొదుపు ఖాతా ఏదో ఒకటి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఖాతాలు ప్రారంభించి నేరుగా నగదు జమ చేస్తున్నారు. అప్పటి నుంచి సస్పెండ్‌ ఖాతాల్లో ఉన్న నిధులను ఎలా తీసుకోవాలనే విషయంపై అక్రమార్కులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement