ఐరిష్‌తో విద్యార్థుల హాజరు నమోదు
Published Sat, Apr 22 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
- డీడీ యూ ప్రసాదరావు
కర్నూలు(అర్బన్): వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల హాజరును ఐరీష్ ద్వారా నమోదు చేయనున్నట్లు ఆ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు చెప్పారు. శుక్రవారం ఉదయం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులకు ఆయన ఐరీష్ మిషన్లు అందించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ గతంలో అన్ని వసతి గృహాల్లోని విద్యార్థుల హాజరు నమోదుకు సంబంధించి ట్యాబ్‌లు అందించామన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ట్యాబ్‌ల ద్వారా హాజరు సక్రమంగా నమోదు కాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు అన్ని జిల్లాలకు సరఫరా చేసిన విధంగానే ఇక్కడకు కూడా ఐరిష్ మిషన్లను పంపించారన్నారు. వీటిలో ప్రీమెట్రిక్ వసతి గృహాలకు 54, పోస్టుమెట్రిక్ వసతి గృహాలకు 21 ప్రకారం కేటాయించామని, వాటిని సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారులకు అందిస్తున్నామన్నారు. జూన్ 12వ తేదీన హాస్టళ్లు పునః ప్రారంభమైన నాటి నుంచే ట్యాబ్‌లు లేక ఐరిష్ మిషన్ల ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. మ్యాన్యువల్‌గా హాజరును నమోదు చేస్తే మెస్ బిల్లులు విడుదల కావన్నారు.
వచ్చే విద్యా సంవత్సరంలో 16 వసతి గృహాలు విలీనమవుతున్నాయని చెప్పిన ఆయన పోస్టింగుల కోసం ఎలాంటి హైరానా చెందాల్సిన అవసరం సంక్షేమాధికారులకు సూచించారు. పలు కళాశాల వసతి గృహాలతో పాటు మూడు ప్రీమెట్రిక్ వసతి గృహాలకు కూడా హెచ్‌డబ్ల్యూఓలు లేరని, ఆయా వసతి గృహాలకు విలీనమయ్యే హాస్టళ్ల సంక్షేమాధికారులను సర్దుబాటు చేస్తామన్నారు. ఇంకా మిగిలితే సహాయ సంక్షేమ శాఖ అధికారుల కార్యాలయాలకు నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సహాయ సంక్షేమాధికారులు ఆర్ రవీంద్రనాథ్‌రెడ్డి, ఈ నాగభూషణం, శ్రీరామచంద్రుడు, వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం అధ్యక్షుడు జెడ్ దొరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement