మంచిర్యాల: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా అధికారుల పర్యవేక్షణ లోపంతో.. కార్మికుడి స్థానంలో మరొకరు విధులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంస్థ వ్యాప్తంగా సంచలనమైంది. సమాచారం అందుకున్న అధికారులు గని అధికారికి చార్జి మెమో జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏరియాలోని కేకే–5 గనిలో టెక్నికల్ ఉద్యోగి విధి నిర్వహణకు 15 రోజుల క్రితం గనిపైకి వచ్చి మస్టర్ పడ్డాడు. ఆరోజు ఆదివారం కావడంతో సహోద్యోగులు దావత్ ఏర్పాటు చేశారు.
ఈమేరకు విధులకు వచ్చిన కార్మికుడికి కూడా సమాచారం అందించారు. దీంతో సదరు కార్మికుడు విధులకు డుమ్మా కొట్టలేక ఆ గనిలోనే విధులు నిర్వహించే మరో టెక్నికల్ ఉద్యోగిని పిలిపించి అతడితో డ్యూటీ చేయించాడు. ఈ విషయం ఇటీవల బయటకు వచ్చింది. విధులు నిర్వహించిన ఉద్యోగికి గని అధికారి నోటీస్ జారీ చేసినట్లు సమాచారం. సింగరేణి చరిత్రలో మస్టర్ ఒకరు పడి విధులు మరొకరు చేయడం ఇంత వరకు ఎరిగి ఉండమని, విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఉండేదని అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment