on duty
-
మస్టర్ ఒకరిది! డ్యూటీలో మరొకరు!! అంతలోనే..
మంచిర్యాల: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా అధికారుల పర్యవేక్షణ లోపంతో.. కార్మికుడి స్థానంలో మరొకరు విధులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంస్థ వ్యాప్తంగా సంచలనమైంది. సమాచారం అందుకున్న అధికారులు గని అధికారికి చార్జి మెమో జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏరియాలోని కేకే–5 గనిలో టెక్నికల్ ఉద్యోగి విధి నిర్వహణకు 15 రోజుల క్రితం గనిపైకి వచ్చి మస్టర్ పడ్డాడు. ఆరోజు ఆదివారం కావడంతో సహోద్యోగులు దావత్ ఏర్పాటు చేశారు. ఈమేరకు విధులకు వచ్చిన కార్మికుడికి కూడా సమాచారం అందించారు. దీంతో సదరు కార్మికుడు విధులకు డుమ్మా కొట్టలేక ఆ గనిలోనే విధులు నిర్వహించే మరో టెక్నికల్ ఉద్యోగిని పిలిపించి అతడితో డ్యూటీ చేయించాడు. ఈ విషయం ఇటీవల బయటకు వచ్చింది. విధులు నిర్వహించిన ఉద్యోగికి గని అధికారి నోటీస్ జారీ చేసినట్లు సమాచారం. సింగరేణి చరిత్రలో మస్టర్ ఒకరు పడి విధులు మరొకరు చేయడం ఇంత వరకు ఎరిగి ఉండమని, విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఉండేదని అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. -
ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ.. చూసేందుకు రెడీనా..?
బాక్సాఫీస్ కలెక్షన్లు దండుకోవడానికి థియేటర్స్ స్టేషన్లో కొందరు స్టార్స్ పోలీసాఫీసర్స్‌గా చార్జ్ తీసుకోనున్నారు. కొందరు పోలీస్ యూనిఫామ్ వేసుకుని, సెట్స్‌లో లాఠీ తిప్పుతున్నారు. మరికొందరు కథలు విన్నారు.. యూనిఫామ్‌తో సెట్స్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ వివరాలు తెలుసుకుందాం. మళ్లీ డ్యూటీ ‘మూండ్రు ముగమ్’ (1982), ‘పాండియన్ ’ (1992), హిందీలో ‘హమ్’ (1991), ‘దర్బార్’ (2020)... ఇలా ఇప్పటివరకూ రజనీకాంత్ ఏడెనిమిది చిత్రాల్లో పోలీసాఫీసర్‌గా నటించారు. మళ్లీ రజనీ పోలీస్‌గా చార్జ్ తీసుకోనున్నారట. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ముస్లిమ్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీ కనిపించనున్నారని టాక్. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఆగస్టు 10న విడుదల కానున్న ‘జైలర్’ చిత్రంలో రజనీ జైలర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పోలీస్ స్పిరిట్ పోలీసాఫీసర్‌గా ప్రభాస్ కటౌట్ స్క్రీన్‌పై సూపర్‌గా ఉంటుందని, సిల్వర్ స్క్రీన్‌పై ఖాకీ డ్రెస్ వేసిన ఫుల్ లెంగ్త్ పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్‌ను చూడాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆశపడుతున్నారు. వీరి ఆశ ‘స్పిరిట్’తో తీరనుందనే టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందట. పుష్పర కాలం తర్వాత... ‘శౌర్యం (2008)’, ‘గోలీమార్ (2010)’ వంటి చిత్రాల్లో గోపీచంద్ పోలీస్‌గా సిల్వర్ స్క్రీన్‌పై డ్యూటీ చేశారు. పుష్కర కాలం తర్వాత గోపీచంద్ మళ్లీ పోలీస్‌గా లాఠీ పట్టారు. హర్ష తెరకెక్కిస్తున్న ‘భీమా’ చిత్రం కోసమే పోలీస్‌గా డ్యూటీ చేస్తున్నారు గోపీచంద్. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఆఫీసర్ అర్జున్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు నాని. ‘హిట్’ ఫ్రాంచైజీలో ‘హిట్ 3’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘హిట్ 1’లో విశ్వక్సేన్, ‘హిట్ 2’లో అడివి శేష్ పోలీసాఫీసర్స్‌గా నటించారు. ‘హిట్ 3’లో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ్రపారంభమవుతుందట. కొన్ని సన్నివేశాల్లో... హీరో నితిన్ పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా’ (ప్రచారంలో ఉన్న టైటిల్). శ్రీలీల హీరోయిన్. ఇందులో హీరోగా నటిస్తున్న నితిన్ కొన్ని సీన్స్‌లో పోలీస్‌గా కనిపిస్తారట. అమరన్.. ఇన్ ది సిటీ ‘బ్లాక్’, ‘సీఎస్ఐ: సనాతన్’ వంటి చిత్రాల్లో ఆది సాయికుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్‌గా సిల్వర్ స్క్రీన్ క్రైమ్స్‌ను చేధించారు. తాజాగా ‘అమరన్: ఇన్ ది సిటీ చాఫ్టర్ 1’ చిత్రంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్‌గా ఓ కేసును పరిశోధిస్తున్నారు. ఎస్. బాలేశ్వర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ది కానిస్టేబుల్ ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’, ‘కుర్రాడు’ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ తాజాగా పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ పాత్ర చేస్తున్నారు. ‘బలగం’ జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎవరు? హంతకులు ఎవరు? అనేది కనిపెట్టేందుకు జేడీ చక్రవర్తి ఓ స్కెచ్ వేశారు. పోలీసాఫీ సర్గా జేడీ చక్రవర్తి వేసిన ఈ స్కెచ్ డీటైల్స్ ‘హూ’ సినిమాలో తెలుస్తాయి. జేడీ చక్రవర్తి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రెడ్డమ్మ కె. బాలాజీ నిర్మించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారు. పోలీసులే ప్రధాన నిందితులైతే... దోషులను పట్టుకునే పోలీసులే నిందులైతే ఏం జరుగు తుంది? అనే కథాంశంతో దర్శకుడు తేజా మార్ని ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలోని ముఖ్య తారలంతా పోలీసులుగా నటిస్తున్నారని తెలిసింది. ‘ఖడ్గం’ (2002), ‘ఆపరేషన్ దుర్యోధన’ (2007), ‘టెర్రర్’ (2016) వంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన శ్రీకాంత్ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ పోలీస్‌గా కనిపిస్తారు. ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. పోలీస్ రన్నర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘రన్నర్’. విజయ్ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ భాస్కర్, ఫణీంద్ర, ఎం. శ్రీహరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కొడుకుల అనుబంధంతో సాగే ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో జానీ మాస్టర్ నటిస్తున్నారని తెలిసింది. వీరే కాదు... మరికొందరు కూడా పోలీసాఫీసర్లుగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. -
'రామారావు'గా రవితేజ..ఫోటోలు వైరల్
మాస్ మహారాజా రవితేజ జోరుమీదున్నాడు. ఈ ఏడాది క్రాక్ చిత్రంతో హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత ఖిలాడి అనే సినిమాలో నటించారు. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్ పడింది. ఇటీవలె మరో సినిమాకు సైన్ చేసిన రవితేజ ఇటీవలె షూటింగ్‌ను మొదలు పెట్టారు. రవితేజ కెరీర్లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు రామారావు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్‌తో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో శరత్ మండవ డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందబోతుంది.ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించనుంది. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. -
DSP Shilpa Sahu; ‘అమ్మ’ఆన్ డ్యూటీ
అవసరం అయితే తప్ప ఇళ్లలోంచి కదలవద్దని జనానికి చెప్పడానికి.. ఇంట్లో ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ బయటికి వచ్చి ఎర్రటి ఎండలో డ్యూటీ చేస్తున్నారు ఐదు నెలల గర్భిణీ అయిన దంతెవాడ డీఎస్పీ శిల్పా సాహూ!! ‘సురక్షితంగా ఉండండి, మాస్కులు ధరించండి’ అని చెప్పడానికి, నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని హెచ్చరించడానికి లాఠీ చేతపట్టి.. తన కడుపులోని బిడ్డకు ప్రమాదమేమో అని కూడా తలవకుండా కరోనా సెకండ్ వేవ్ లో, సూర్యుడి భగభగల్లో, మావోయిస్టుల కదలికల నడుమ.. ఆమె తన విధులు నిర్వహిస్తున్నారు! ఎప్పుడూ గుడిలో దర్శనమిచ్చే దంతేశ్వరీ దేవి మంగళవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దంతెవాడ పట్టణ ప్రధాన కూడళ్లలో కర్ర పట్టి తిరుగుతూ, ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు చెబుతూ ఉన్నట్లే అనిపించి ఉండవచ్చు అక్కడి వారికి కొందరికైనా! ఆ ‘దంతేశ్వరీ దేవి’ పేరు శిల్పా సాహూ (29). దంతెవాడ డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్. దంతెవాడ చత్తీస్‌గఢ్ జిల్లాలో ఉంది. సాధారణంగా మావోయిస్టులను గుర్తుకు తెచ్చే ఈ ప్రాంతం.. కరోనా లాక్డౌన్ విధుల నిర్వహణలో డీఎస్పీ శిల్పా సాహూ చూపిన అంకితభావం కారణంగా ఎవరికైనా శక్తిమాతను గుర్తు తెచ్చి ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని మొత్తం యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటైన దంతేశ్వరీదేవి ఆలయం దంతెవాడలో ఉంది. ఆ తల్లి తన బిడ్డల్ని అదిలించి, కదిలించి, సంరక్షించిన విధంగానే ఇప్పుడు శిల్ప తన పౌరుల్ని కరోనా నిర్లక్ష్యం నుంచి అదిలిస్తూ, త్వరగా చేరమని ఇళ్లకు కదిలించే డ్యూటీలో ఉన్నారు. నిజానికైతే ఆమె కూడా ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్థితే. గాలి సోకితే చాలు కరోనా వచ్చేలా ఉంది. ఎండ ఆవిర్లు వదులుతోంది. మావోయిస్టులు ఎక్కడ మాటువేసి ఎటుగా వస్తోరో తెలియదు. అయినా పోలీస్ డ్యూటీ పోలీస్ డ్యూటీనే. అన్నిటినీ తట్టుకోవాలి. పౌరుల్ని కాపాడాలి. డిఎస్పీ శిల్ప కూడా అదే డ్యూటీ ఉన్నారు కానీ, ఆమె కాస్త ప్రత్యేకమైన పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు. ఐదవ నెల గర్భిణి ఆమె. ఇక నుంచి ఆమె మరింతగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఆమెకు చెప్పే ఉంటారు. అయితే సెకండ్ వేవ్ కరోనాలో ప్రజలు మరింతగా భద్రంగా ఉండాలని చెప్పడం కోసం ఆమె బయటికి వచ్చారు. లాఠీ పట్టుకుని దంతెవాడ ప్రధాన రహదారులలో డ్యూటీ చేశారు. మాస్క్ వేసుకోని వాళ్లను, అనవసరంగా బయటికి వచ్చినవాళ్లను ఆపి, మందలించారు. కరోనా బారిన పడకుండా, ఇతరులను పడేయకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పి పంపారు. సాటి మానవులు చెబితే కోపం వస్తుందేమో కానీ, డీఎస్పీ చెబితే వినకుండా ఉంటారా? ఇప్పుడామె చేస్తున్నది బాధ్యతల్ని గుర్తు చేసే డ్యూటీ. ఒకరు గుర్తు చేయాల్సినంతగా నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రదర్శిస్తున్న పౌరులు.. గర్భిణిగా ఉండి కూడా మిట్ట మధ్యాహ్నపు ఎండలో డ్యూటీ చేయడం చూసి సిగ్గుపడే ఉంటారు. తనకు, కడుపులో ఉన్న తన బిడ్డకు కరోనా సోకుతుందేమోనన్న భయం లేకుండా శిల్ప పౌరుల క్షేమం కోసం పాటు పడటం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్నే పెంచింది. గర్భంతో ఉండి కూడా ఆమె డ్యూటీ చేస్తున్నప్పటి ఫొటోను ఐపీఎస్ ఆఫీసర్, చత్తీస్‌గఢ్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దీపాంశు కబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయగానే ‘డ్యూటీ మైండెడ్’ శిల్పపై గత 48 గంటలుగా ట్విట్టర్లో ధారాపాతంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ‘సెల్యూట్ టు డీఎస్పీ శిల్పా సాహూజీ! డీజీపీ శ్రీ అవస్థిగారూ.. ఆమెకు అవార్డు ప్రకటించంది. అలాగే ఆమె కోరుకుంటే కనుక ఆమెను రాయ్‌పుర్ బదలీ చేయండి’ అని ఒకరు, ‘గుడ్ జాబ్ మేమ్, ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ’ అని ఇంకొకరు.. పదులు, వందల్లో ఆమెను అభినందిస్తూ, జాగ్రత్తలు చెబుతున్నారు. రాయ్‌పుర్ చత్తీస్‌గఢ్ రాజధాని. అక్కడికి, దంతెవాడకు ఏడున్నర గంటల ప్రయాణం. రాయ్‌పుర్‌లో అయితే శిల్పకు ఈ సమయంలో సౌకర్యంగా ఉంటుందని కూడా ట్విటిజెన్‌లు ఆలోచిస్తున్నారు. సీఎం ఆమెను ఒక ఆదర్శ మహిళా అధికారిగా కీర్తించారు. ఇంతకంటే కఠిమైన డ్యూటీలనే చేశారు శిల్పి. ఎ.కె.47 ధరించి ‘ఆపరేషన్’లలో పాల్గొన్నారు. దంతేవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘దంతేశ్వరి ఫైటర్స్’ (మహిళా కమాండోలు) కు నాయకత్వం వహించారు. వాటికంటే కష్టమైన పని.. కరోనా లాక్డౌన్ నిబంధనల్ని జనం ఉల్లంఘించకుండా చూడటం అని ఇప్పుడామె గ్రహించే ఉంటారు. ‘‘నేను బయట ఉంటేనే.. వాళ్ల లోపల ఉంటారు’’ రోడ్డు మీద వెళుతూ అధాటున చూసిన వారికి మామూలు దుస్తుల్లో ఉన్న శిల్పా సాహు మొదట సాధారణ మహిళగా అనిపించవచ్చు. కానీ, గర్జించే ఆమె స్వరం.. ఆమె పోలీసు అన్న వాస్తవాన్ని ఆ వెంటనే తెలియజేస్తుంది. ‘వాపస్ జావో, ఘర్ జావో’ (వెనక్కు వెళ్లు.. ఇంటికి వెళ్లు) అని గట్టిగా అరచి చెప్పినా వినని వారికి ఆమె చేతిలోని లాఠీ చక్కగా అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్ధమౌతుంది. ఏప్రిల్ 18 నుంచి దంతెవాడ జిల్లా (దక్షిణ బస్తర్) లాక్డౌన్లో ఉంది. ఆ రోజు నుంచీ శిల్ప లాక్డౌన్ డ్యూటీలో ఉన్నారు. ‘‘గర్భిణిగా ఉండి మీరు బయటికి రావడం ఎందుకు?’’ అనే ప్రశ్నకు.. ‘‘నేను బయట ఉంటేనే వాళ్లు లోపల ఉంటారు’’ అంటున్నారు శిల్ప. -
బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖ ఏడీ
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎస్. మోహన్‌రావును నియమించారు. ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఈయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మోహన్‌రావు 1983లో జూనియర్ అసిస్టెంట్‌గా విద్యాశాఖలో చేరారు. 1987లో డైరెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌గా అక్కడే పదోన్నతి పొందారు. తాజాగా ఏడీగా పదోన్నతి రావడంతో ఇక్కడికు బదిలీ చేశారు. -
నేడు, రేపు విధుల్లో ఉండాల్సిందే
అనంతపురం సిటీ :జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఉద్యోగులు నేడు, రేపు విధుల్లో ఉండాల్సిందేనని, ఆదివారం కూడా సెలవు ఉండదని వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. శనివారం కార్యాలయంలోని ప్రతి విభాగాన్నీ ఆయన పరిశీలించారు. జిల్లాకు రాష్ట్ర ఉన్నతాధికారులు రానున్నారని, అన్ని రికార్డులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ముగిసిన దరఖాస్తు గడువు : వైద్యులు, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సులతో పాటు పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 6 గంటలకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు కావడంతో కార్యాలయం అభ్యర్థులతో కిటకిట లాడింది. ఎన్ని దర ఖాస్తులుఅందాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. -
లుంగీ డాన్స్...తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీశారు
*యూనిఫాంలోనే ఉంటారు .. కానీ డ్యూటీ చేయరు ... *ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్న ఇంగితం కూడా ఉండదు ... *మ్యూజిక్ ఆన్ అయితే చాలు ... అటోమెటిక్‌గా స్టెప్పులేసేస్తారు ... *ఇక అమ్మాయి తోడైతే ... ఒళ్లు మరచిపోతారు ... *ఆ నిషాలో ... ఒక్కోసారి ఎక్స్‌ట్రాలు చేస్తుంటారు, ఆనక ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. * అలాంటి స్పెషల్ డాన్స్ ఛమ్మక్కులే .... ఈ 'ఏసేయ్ రా జజ్జనక జజ్జనక'. యూనిఫాంలో ఉన్న ఓ ఎస్ఐ ... ఆ విషయమే మర్చిపోయాడు. ఎదురుగా ఓ ఛమక్ ఛల్లో కనిపించగానే అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయ్. అంతే ... అక్కడే సెటిలైపోయాడు. లంచాలు వసూలు చేస్తే వచ్చిన డబ్బులో ఏమో .. ఇష్టానుసారంగా డాన్సర్‌పై కరెన్సీ వెదజల్లాడు. ఇక ఆగలేక ఏకంగా అతడు కూడా స్టెప్పులేయడం మొదలెట్టాడు. ఈ సూపర్బ్ సీన్ గుజరాత్లో జరగ్గా ... ఓ పోలీస్ వీరాభిమాని మొబైల్లో రికార్డ్ చేశాడు. *ఈయనే కాదు ఈమధ్య ఇలాంటి పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఉత్తర్ ప్రదేశ్ సుజ్జహాన్ పూర్లో ఓ పోలీస్ ఆఫీసర్ .. రికార్డింగ్ డాన్సర్ డాన్స్ చేస్తుంటే .. ఆమెపై నోట్ల వర్షం కురిపించాడు. యూనిఫాంలో ఉండి ఇలాంటి సిగ్గుమాలిన పనికి పాల్పడినందుకు ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. *ట్రైనింగ్ కోసం వచ్చిన లేడీ కానిస్టేబుల్‌కు రాజస్థాన్ అజ్మీర్‌లోని బేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఎలాంటి శిక్షణ ఇచ్చారో తెల్సుకుంటే ... దిమ్మ తిరగడం ఖాయం. పోలీసింగ్‌పై పాఠాలు నేర్పాల్సిందిపోయి ఏకంగా ఐటమ్ సాంగ్స్‌పై డాన్స్ చేయించారు. సబ్-ఇన్స్పెక్టర్ ఉదయ్ సింగ్ ఈ నిర్వాకాన్ని వెలగబెట్టగా .. మిగిలిన వారు అలా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. *హర్యానాలోనూ సేమ్ సీన్. ఓ పోలీస్ అధికారికి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యినందుకుగానూ ఓ ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేశారు. అక్కడి వరకూ ఓకేగానీ .. ఆ పార్టీలో రికార్డింగ్ డాన్సర్లతో డాన్స్ చేయించడమే అందరికీ పెద్ద ఝలఖ్ ఇచ్చింది. *ఏ మాటకామాటే చెప్పుకోవాలి. అందరి సంగతేమోగానీ .. పోలీస్ స్టేషన్‌ను స్టేజ్ చేసుకుని, హుషారుగా డాన్స్ చేయడంలో ఢిల్లీ పోలీస్ తర్వాతే ఎవ్వరైనా. షారూక్‌ఖాన్‌కు పోటీనిచ్చారు ...లుంగీలు కట్టకపోయినా ఆ రేంజ్లో అదరగొట్టారు ...అవును, పోలీసులు కింగ్ ఖాన్ డాన్స్‌ను కాపీ కొట్టారు. *మహిళల దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పోలీస్ బాసులు, లేడీ కొలీగ్స్‌తో ఇదిగో ఇలా చెలరేగిపోయారు. ఈ డాన్స్ హంగామాలో ... ముంబై రైల్వే పోలీస్, బాంద్రా జోన్ ఏసిపి ఎస్ ఎస్.బిజ్వే స్పెషల్ ఎట్రాక్షన్ కాగా .. ఆయనతో పాటు మరికొందరు లుంగీ డాన్స్ చేశారు. *అసలే హోలీ ... ఆపై తాగిన పోలీస్ బాబాయిలు, ఇంకేముంది పోలీస్ స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి. ఖాకీలు, ఖైదీలు అన్న తేడా లేకుండా అందరూ తీన్ మార్ స్టెప్పులేసేశారు. ఇక మీరట్ పోలీసులు ఏమైనా తక్కువ తిన్నారా? బంగ్ తాగి .. బంగీ జంప్స్ చేశారు. నేరస్థులతో కలిసి నాచ్గానాలో పాల్గొన్నారు. మీడియా ఎంట్రీ ఇవ్వడంతో ... సీన్ లోంచి మెల్లిగా జారుకున్నారు. *అలాని కేవలం మగమహారాజులే ఇలా ఆన్ డ్యూటీలో చిందులేస్తారనుకుంటే పొరపాటే. గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో లేడీ పోలీస్‌లు కాసేపు ఆటపాటలతో రీఛార్జ్ అయ్యారు. అది స్టేషన్ అని, తాము యూనిఫాంలో ఉన్నామని .. అస్సలంటే అస్సలూ పట్టించుకోకుండా ... పండగ చేసుకున్నారు. *డాన్స్ అంటే పంజాబీలు ప్రాణమిస్తారు. ఇది అందరికీ తెల్సిన విషయమే. కానీ ఆఫీసు వేళల్లో డాన్స్ అంటేనే రియాక్షన్ వేరుగా ఉంటుంది. కానీ ఆ పంజాబీ ఖాకీలు రూల్స్‌ని లైట్ తీసుకున్నారు. స్టేషన్లోనే డాన్స్ సెటప్ పెట్టేశారు. అలాని అందరు పోలీసులు ఇలానే ఉంటారని కాదుగానీ .. ఇలాంటి గంజాయి మొక్కలు, తులసి వనంలో ఉంటే మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డపేరు రావడం ఖాయం. -
సర్దుబాటు ఇలా..
=33 రోజులు ఆన్ డ్యూటీగానే పరిగణన =ఆదివారాల్లోనూ పాఠశాలల నిర్వహణ =మధ్యాహ్న భోజనం అమలు =ఉపాధ్యాయులంతా హాజరుకావాల్సిందే =విద్యాశాఖ డెరైక్టర్ నుంచి ఉత్తర్వులు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మెలో భాగంగా కోల్పోయిన పనిదినాలను సర్దుబాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వాణి మోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులు సమ్మె చేయగా 33 రోజుల పనిదినాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ 33 రోజులను అక్టోబరు 20 నుంచి మార్చి 23 వరకు సర్దుబాటు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారులతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో 33 రోజుల పనిదినాలను అక్టోబరు నుంచి మార్చి వరకు వచ్చే ఆదివారాలు, రెండో శనివారం, సంక్రాంతి సెలవుల్లో పనిచేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉపాధ్యాయులు 33 రోజుల పనిదినాల పాటు సమైక్యాంధ్ర సమ్మెలో పాల్గొనగా విద్యాశాఖాధికారులకు, ఉపాధ్యాయులకు కుదిరిన ఒప్పందం నేపథ్యంలో వాటిని ఆన్డ్యూటీగానే పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులకు సమ్మె చేసిన రోజులకు సంబంధించి వేతనం విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్న పనిదినాలను ఓడీగా పరిగణిస్తున్నామని, ఈ పని దినాల భర్తీకి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాలలపై నిఘా... ప్రభుత్వం సూచించిన విధంగా సెలవు రోజుల్లో ప్రత్యేక పనిదినాల్లో ఆయా పాఠశాలలపై నిఘా ఉంచుతారని ఏదైనా పాఠశాల పనిచేయకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లేదని, సమ్మె కాలంలో విధులకు హాజరైన ఉపాధ్యాయులను మళ్లీ పాఠశాలలకు హాజరుకావాలని హుకుం జారీ చేయటం కక్షసాధింపు చర్యేనని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.సత్యనారాయణ విమర్శించారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి నాయకులు ఇచ్చిన జాబితాను కాస్త మార్పుచేసి ప్రభుత్వం ప్రత్యేక పనిదినాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వులపై సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తుండగా సమ్మెలో పాల్గొనని ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారు. సమ్మె కాలంలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని వారు కోరుతున్నారు. ఉత్తర్వులు అమలు చేస్తాం : డీఈవో ప్రభుత్వ ఉత్తర్వులను జిల్లాలో అమలు చేస్తామని, పాఠశాలలు పనిచేస్తుంటే వాటిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని డీఈవో డి.దేవానందరెడ్డి తెలిపారు. ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఉత్తర్వులపై కొందరు ఉపాధ్యాయులకు అనుమానాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుతామని చెప్పారు. సమ్మె కాలంలో పనిచేసిన ఉపాధ్యాయులు తాము ఈ నెల 20న పాఠశాలకు హాజరుకాబోమని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌ను శనివారం మధ్యాహ్నం కలిసి చెప్పగా పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుందని చెప్పినట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు. పాఠశాలలు పనిచేసే రోజులివీ... ప్రభుత్వం సూచించిన విధంగా ఆయా సెలవు రోజుల్లో పాఠశాలలు జరిగే జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబరులో 20, 27 తేదీల్లోని ఆదివారాల్లో, నవంబరులో 3, 10, 17, 24 తేదీల్లోని ఆదివారాల్లో, 9న రెండో శనివారం పాఠశాలలు పనిచేయాల్సి ఉంటుంది. డిసెంబరులో 1, 8, 15, 22, 29 తేదీల్లోని ఆదివారాలు, 14న రెండో శనివారం, జనవరిలో 5, 19, 26 తేదీల్లోని ఆదివారాల్లో, సంక్రాంతి సెలవు దినాలైన 8 నుంచి 12 వరకు, తిరిగి 16, 17 తేదీల్లో పాఠశాలలు పనిచేస్తాయి. ఫిబ్రవరిలో 2, 9, 16, 23 తేదీల్లోని ఆదివారాలు, 8న రెండో శనివారం, మార్చిలో 2, 9, 16, 23 తేదీల్లోని ఆదివారాల్లో, 8న రెండో శనివారాల్లో పాఠశాలలు పనిచేస్తాయి. ముఖ్యమంత్రితో జరిగిన చర్చల ఫలితంగానే సమైక్యాంధ్ర సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సర్దుబాటు జరిగిందని సమైక్యాంధ్ర పోరాట సమితి రాష్ట్ర కన్వీనరు మత్తి కమలాకరరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. నేడు పనిచేయనున్న పాఠశాలలు నూజివీడు : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఈ నెల 20వ తేదీ ఆదివారం కూడా పనిచేయనున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి డి.దేవానందరెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులందరూ సమైక్య ఉద్యమంలో భాగంగా సమ్మెలో పాల్గొన్నందున ఆయా పనివేళల భర్తీ కోసం ఈ మేరకు హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులే పనిచేయాలా, సమ్మెలోకి రాని ఉపాధ్యాయులు కూడా పనిచేయాలా అనే వివరణ ఏమీ రాలేదని ఆయన తెలిపారు.