
విధి నిర్వహణలో ఒక ఉద్యోగి నిద్రపోవడం తప్పేలా అవుతుందని, సామర్థ్యానికి మించిన పని అప్పగించినప్పుడు మనిషికి విశ్రాంతి కచ్చితంగా అవసరమని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో డ్యూటీలో నిద్రపోయి సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పు వెల్లడించింది.
‘‘ఇవాళ ఈ కానిస్టేబుల్ కావొచ్చు. రేపు మరొకరు కావొచ్చు. మనిషికి నిద్ర సహజం. అలాంటిది మనిషికి నిద్రను దూరం చేస్తే ఎలా?. ఈరోజుల్లో పని-జీవితం మధ్య సమతుల్యం(Worklife Balance)లో నిద్ర-విశ్రాంతి కీలక అంశం. షిఫ్ట్‌లవారీగా పని చేసినప్పుడు.. ఇలాంటి ఉద్యోగులకు వాటిని దూరం చేస్తే ఎలా?’’ అని జస్టిస్ ఎం నాగప్రసన్న(Justice M Nagaprasanna) ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వైరల్ వీడియోతో మొదలై..
కిందటి ఏడాది మార్చి 23వ తేదీన కల్యాణ్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో పని చేసే చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ నిద్రపోతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై చంద్రశేఖర్‌ను ఉన్నతాధికారులు వివరణ కోరారు. వరుస షిఫ్ట్‌లలో డ్యూటీ చేయడం మూలంగా తన ఆరోగ్యం బాగా దెబ్బతిందని, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నానని, వాటి మూలంగానే నిద్ర ముంచుకొచ్చిందని, అయినా తాను 10 నిమిషాలపాటే విశ్రాంతి తీసుకున్నానని వివరణ ఇచ్చారాయన.
అయితే కానిస్టేబుల్ వివరణతో అధికారులు సంతృప్తి చెందలేదు. డ్యూటీలో ఉండగా పడుకోవడం తప్పేనని, పైగా ఈ చర్యలో డిపార్ట్‌మెంట్ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని చెబుతూ సస్పెండ్ చేశారు. ఆపై ఘటనపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో సస్పెన్షన్‌పై ఆయన హైకోర్టుకు ఆశ్రయించారు.
అయితే.. విజిలెన్స్ నివేదికలో ఆసక్తికర విషయం వెల్లడైంది. సదరు విభాగంలో ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారని, వరుసగా మూడు షిఫ్ట్‌లలో పని చేస్తున్నారని.. కాబట్టి వారిపై పని ఒత్తిడి తగ్గించడానికి మరో ఇద్దరిని నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఇక ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ 24 ప్రకారం.. ప్రతీ ఉద్యోగికి విశ్రాంతి హక్కు ఉంటుంది. అలాగే వేతనంతో కూడిన కాలానుగుణ సెలవులు తీసుకునే హక్కు కూడా ఉంటుంది. అంతర్జాతీయ కార్మిక సంఘ ఒప్పందాల ప్రకారం.. ప్రతీ ఉద్యోగికి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ తప్పనిసరి. షిఫ్ట్‌లవారీగా పని చేసేవాళ్ల విషయంలో ఇది మరీ అవసరం. అసాధారణ సందర్భాలను మినహాయిస్తే.. రోజుకి 8 గంటలు.. వారంలో 48 గంటలకు పని గంటలు మించకూడదు.
ఈ కేసులో పిటిషనర్ విధుల్లో నిద్రపోవడంలో ఎలాంటి తప్పిదం కనిపించడం లేదు. వరుస షిఫ్ట్‌లలో 16 గంటలపాటు పని చేయడం మూలంగా ఆయన అధిక పని ఒత్తిడితో ఇబ్బంది పడ్డారు. అందుకే నిద్రపోయారు.కాబట్టి, సస్పెన్షన్ సరికాదు. తిరిగి ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలి అని జస్టిస్ ఎం నాగప్రసన్న ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment