బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలపై తనను విచారించేందుకు గవర్నర్ అనుమతించడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు దీనిపై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.
సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముడా అధికారులు తన భార్యకు భూమి కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవే ఆరోపణలతో సామాజిక కార్యకర్తలు, తదితరులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై వివరణ ఇచ్చేందుకు విచారణకు హాజరు కావాలని జులై 26న ముఖ్యమంత్రికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ నోటీసులిచ్చారు. ఈ క్రమంలోనే గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం హైకోర్టును ఆశ్రయించారు.
కాగా సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక అదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి..సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అయితే ఆ ఆరోపణలను సిద్దరామయ్య తోసిపుచ్చారు. అతాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. విచారణ కోసం తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment