బెంగళూరు: తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడం చట్టవిరుద్దమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా.. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయంగా ప్రేరేపితమైనవన్నారు. వాటిని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు.
మైసూరు నగర అభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తనను విచారించేందుకు గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గవర్నర్ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని హైకోర్టుకు తెలిపారు.
వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డర్‌ను ఆమోదించారని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలు అమలైతే రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారి తీస్తుందని తెలిపారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారులను నిరోధించేలా ఆదేశించాలని ముఖ్యమంత్రి కోరారు. తనకు మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని తెలిపారు.
సీఎంకు ఊరట
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిస్తూ, ఆరోపించిన ముడా కుంభకోణానికి సంబంధించి ఆయనపై ప్రత్యేక కోర్టులో విచారణను కర్ణాటక హైకోర్టు సోమవారం వాయిదా వేసింది.
సిద్ధరామయ్యపై సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. టీజే అబ్రహం వేసిన మరో పిటిషన్‌పై బుధవారం వాదనలు జరగాల్సి ఉంది. ఇప్పుడు, హైకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 29 వరకు జరగదు.
అంతకముందు సీఎం మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు. భవిష్యత్తులోనూ చేయనని అన్నారు. గవర్నర్ నిర్ణయం తననేమీ ఆశ్చర్యపరచలేదన్న ఆయన.. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు తనలో మరింత జోష్ పెరుగుతుందన్నారు. ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కుట్ర పన్నాయని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment