Actor and Actress Playing a Police Officer Role in Movies - Sakshi
Sakshi News home page

ఆఫీసర్స్‌ ఆన్‌ డ్యూటీ.. యూనిఫామ్‌తో వచ్చేస్తున్న స్టార్స్‌

Published Sun, Jul 23 2023 4:10 AM | Last Updated on Sun, Jul 23 2023 3:37 PM

Actor And actress playing a police officer role in movies - Sakshi

బాక్సాఫీస్‌ కలెక్షన్లు దండుకోవడానికి థియేటర్స్‌ స్టేషన్‌లో కొందరు స్టార్స్‌ పోలీసాఫీసర్స్‌గా చార్జ్‌ తీసుకోనున్నారు. కొందరు పోలీస్‌ యూనిఫామ్‌ వేసుకుని, సెట్స్‌లో లాఠీ తిప్పుతున్నారు. మరికొందరు కథలు విన్నారు.. యూనిఫామ్‌తో సెట్స్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆఫీసర్స్‌ ఆన్‌ డ్యూటీ వివరాలు తెలుసుకుందాం.

మళ్లీ డ్యూటీ
‘మూండ్రు ముగమ్‌’ (1982), ‘పాండియన్‌ ’ (1992), హిందీలో ‘హమ్‌’ (1991), ‘దర్బార్‌’ (2020)... ఇలా ఇప్పటివరకూ రజనీకాంత్‌ ఏడెనిమిది చిత్రాల్లో పోలీసాఫీసర్‌గా నటించారు. మళ్లీ రజనీ పోలీస్‌గా చార్జ్‌ తీసుకోనున్నారట. టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ముస్లిమ్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో రజనీ కనిపించనున్నారని టాక్‌. సుభాస్కరన్‌ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. ఇక ఆగస్టు 10న విడుదల కానున్న ‘జైలర్‌’ చిత్రంలో రజనీ జైలర్‌ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.  

పోలీస్‌ స్పిరిట్‌
పోలీసాఫీసర్‌గా ప్రభాస్‌ కటౌట్‌ స్క్రీన్‌పై సూపర్‌గా ఉంటుందని, సిల్వర్‌ స్క్రీన్‌పై ఖాకీ డ్రెస్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో ప్రభాస్‌ను చూడాలని ఆయన ఫ్యాన్స్‌ ఎప్పట్నుంచో ఆశపడుతున్నారు. వీరి ఆశ ‘స్పిరిట్‌’తో తీరనుందనే టాక్‌ వినిపిస్తోంది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘స్పిరిట్‌’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. భూషణ్‌ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషణ్‌ కుమార్‌ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందట.  

పుష్పర కాలం తర్వాత...
‘శౌర్యం (2008)’, ‘గోలీమార్‌ (2010)’ వంటి చిత్రాల్లో గోపీచంద్‌ పోలీస్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై డ్యూటీ చేశారు. పుష్కర కాలం తర్వాత గోపీచంద్‌ మళ్లీ పోలీస్‌గా లాఠీ పట్టారు. హర్ష తెరకెక్కిస్తున్న ‘భీమా’ చిత్రం కోసమే పోలీస్‌గా డ్యూటీ చేస్తున్నారు గోపీచంద్‌. కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.

ఆఫీసర్‌ అర్జున్‌
పోలీసాఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు నాని. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో ‘హిట్‌ 3’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘హిట్‌ 1’లో విశ్వక్‌సేన్, ‘హిట్‌ 2’లో అడివి శేష్‌ పోలీసాఫీసర్స్‌గా నటించారు. ‘హిట్‌ 3’లో పోలీసాఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌గా నాని నటించనున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే ఏడాది ్రపారంభమవుతుందట.

కొన్ని సన్నివేశాల్లో...
హీరో నితిన్‌ పోలీసాఫీసర్‌గా చార్జ్‌ తీసుకున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ట్రా’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). శ్రీలీల హీరోయిన్‌. ఇందులో హీరోగా నటిస్తున్న నితిన్‌ కొన్ని సీన్స్‌లో పోలీస్‌గా కనిపిస్తారట.  

అమరన్‌.. ఇన్‌ ది సిటీ
‘బ్లాక్‌’, ‘సీఎస్‌ఐ: సనాతన్‌’ వంటి చిత్రాల్లో ఆది సాయికుమార్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ క్రైమ్స్‌ను చేధించారు. తాజాగా ‘అమరన్‌: ఇన్‌ ది సిటీ చాఫ్టర్‌ 1’ చిత్రంలో ఆది సాయికుమార్‌ పోలీసాఫీసర్‌గా ఓ కేసును పరిశోధిస్తున్నారు. ఎస్‌. బాలేశ్వర్‌ దర్శకత్వంలో ఎస్‌వీఆర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ది కానిస్టేబుల్‌
‘హ్యాపీ డేస్‌’, ‘కొత్త బంగారు లోకం’, ‘కుర్రాడు’ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్‌ సందేశ్‌ తాజాగా పోలీస్‌ డ్రెస్‌ వేసుకున్నారు. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ది కానిస్టేబుల్‌’. ఈ చిత్రంలో వరుణ్‌ సందేశ్‌ కానిస్టేబుల్‌ పాత్ర చేస్తున్నారు. ‘బలగం’ జగదీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

ఎవరు?
హంతకులు ఎవరు? అనేది కనిపెట్టేందుకు జేడీ చక్రవర్తి ఓ స్కెచ్‌ వేశారు. పోలీసాఫీ సర్‌గా జేడీ చక్రవర్తి వేసిన ఈ స్కెచ్‌ డీటైల్స్‌ ‘హూ’ సినిమాలో తెలుస్తాయి. జేడీ చక్రవర్తి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రెడ్డమ్మ కె. బాలాజీ నిర్మించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తారు.  

పోలీసులే ప్రధాన నిందితులైతే...
దోషులను పట్టుకునే పోలీసులే నిందులైతే ఏం జరుగు తుంది? అనే కథాంశంతో దర్శకుడు తేజా మార్ని ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలోని ముఖ్య తారలంతా పోలీసులుగా నటిస్తున్నారని తెలిసింది. ‘ఖడ్గం’ (2002), ‘ఆపరేషన్‌ దుర్యోధన’ (2007), ‘టెర్రర్‌’ (2016) వంటి సినిమాల్లో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటించిన శ్రీకాంత్‌ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్‌ పోలీస్‌గా కనిపిస్తారు. ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌  కానుంది.

పోలీస్‌ రన్నర్‌
కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘రన్నర్‌’. విజయ్‌ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్‌ భాస్కర్, ఫణీంద్ర, ఎం. శ్రీహరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోలీస్‌ నేపథ్యంలో తండ్రీ కొడుకుల అనుబంధంతో సాగే ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌ పాత్రలో జానీ మాస్టర్‌ నటిస్తున్నారని తెలిసింది.

వీరే కాదు... మరికొందరు కూడా పోలీసాఫీసర్లుగా కనిపించడానికి రెడీ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement