వెండితెరపై కనిపించే ‘సూపర్ హీరో’ తరహా పాత్రల్లో పోలీస్ పాత్ర గురించి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు సమాజం మేలు కోసం ఓ సూపర్ హీరో చేసే అన్ని సాహసాలు పోలీస్ ఆఫీసర్లు చేస్తుంటారు. ఇలా పోలీసాఫీసర్లకు ‘సలామ్’ కొట్టేలా కొందరు హీరోలు వెండితెరపై పోలీసులుగా యాక్షన్ చేస్తున్నారు. ఆ హీరోలపై కథనం.
హుకుమ్...
రజనీకాంత్ కెరీర్‌లో ఈ మధ్యకాలంలో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల్లో ‘జైలర్’ ఒకటి. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2023లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రజనీకాంత్ మేజర్ సీన్స్‌లో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా, కొన్ని సీన్స్‌లో పోలీస్ డ్రెస్ వేసుకున్న జైలర్‌గా స్క్రీన్‌పై కనిపించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కనుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశారు నెల్సన్ దిలీప్ కుమార్. ‘జైలర్ 2’కి సంబంధించి రజనీకాంత్ లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం. డిసెంబరు 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ‘జైలర్’ సీక్వెల్ అప్‌డేట్ ఉండొచ్చనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
అంతేకాదు... ‘జైలర్’ సినిమా సీక్వెల్‌కు ‘హుకుమ్’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ‘జైలర్’లోని ‘హుకుమ్’ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ పాటనే సీక్వెల్‌కు టైటిల్‌గా పెడితే ఆడియన్స్‌కు సినిమా మరింత బాగా రీచ్ అవుతుందని, ‘హుకుమ్’ అనే టైటిల్ అన్ని భాషలకు సరిపోతుందని టీమ్ భావిస్తోందట. కళానిధి మారన్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.
ఫ్యామిలీ పోలీస్
‘సూపర్ పోలీస్, సూర్య ఐపీఎస్, ఘర్షణ’ వంటి సినిమాల్లో సీరియస్ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ మెప్పించారు. ‘బాబు బంగారం’ సినిమాలో కామిక్ టైమ్ ఉన్న పోలీస్‌గా వెంకీ నటించారు. అయితే ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారాయన (‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి చేసిన రోల్ తరహాలో...) ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలో మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ కనిపిస్తారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో వెంకీ ఆన్ డ్యూటీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. మీనాక్షీ చౌదరి కూడా ఈ చిత్రంలో ΄ోలీసాఫీసర్‌గానే కనిపిస్తారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.
ఫస్ట్ టైమ్ పోలీస్‌గా...
ప్రభాస్ వంటి కటౌట్ ఉన్న హీరో పోలీస్ ఆఫీసర్‌గా స్క్రీన్‌పై కనిపిస్తే ఆడియన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. తనను పోలీసాఫీసర్‌గా స్క్రీన్‌పై చూపించే అవకాశాన్ని ‘అర్జున్‌రెడ్డి, యానిమల్’ వంటి సినిమాలు తీసిన సందీప్‌రెడ్డి వంగా చేతుల్లో పెట్టారు ప్రభాస్. ‘స్పిరిట్’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సీరిస్‌లపై భూషణ్ కుమార్ నిర్మించ నున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది.
కేసు నంబరు 3
సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి ‘హిట్: ద థర్డ్ కేస్’ రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. ‘హిట్ 1, హిట్ 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కోలనుయే మూడో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు సినిమాలను నిర్మించిన నాని, ‘హిట్ 3’లో హీరోగా నటిస్తూ, నిర్మిస్తుండటం విశేషం. నాని వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ చిత్రం 2025 మే 1న విడుదల కానుంది.
బంధూక్
హీరో విశ్వక్ సేన్ తుపాకీ పట్టుకుని చాలాసార్లు స్క్రీన్‌పై కనిపించారు. కానీ రియల్ పోలీస్ ఆఫీసర్‌గా కాదు... అయితే ‘బంధూక్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా కోసం విశ్వక్ సేన్ పోలీసాఫీసర్‌గా ఖాకీ డ్రెస్ ధరించి, తుపాకీ పట్టారు. ఈ పోలీస్ యాక్షన్ డ్రామాకు శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంపద హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది.
ఎస్‌ఐ యుగంధర్
ఈ మధ్య కాలంలో పోలీసాఫీసర్ రోల్స్‌కే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లున్నారు హీరో ఆది సాయికుమార్. ఆయన హీరోగా విడుదలైన గత ఐదు సినిమాల్లో రెండు పోలీసాఫీసర్ సినిమాలు ఉన్నాయి. ఈలోపు మరో పోలీసాఫీసర్ మూవీ ‘ఎస్‌ఐ యుగంధర్’కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎస్‌ఐ యుగంధర్‌గా ఓ కొత్త క్యారెక్టరైజేషన్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ కనిపిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో మేఘా లేఖ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యశ్వంత్ దర్శకత్వంలో ప్రదీప్ జూలురు నిర్మిస్తున్న ఈ చిత్రం 2025లో రిలీజ్ కానుంది.
మర్డర్ మిస్టరీ
ఓ మర్డర్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు హీరో త్రిగుణ్ (అరుణ్ అదిత్). స్క్రీన్‌పై ఓ పోలీసాఫీసర్‌గా ఈ కేసును పరిష్కరించే క్రమంలో త్రిగుణ్‌కు ఓ టర్నింగ్ ΄ాయింట్ దొరికింది. ఇది ఏంటీ అంటే...‘టర్నింగ్ ΄ాయింట్’ సినిమా చూడాల్సిందే. హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కుహాన్ నాయుడు దర్శకుడు. సురేష్ దత్తి నిర్మించారు. ఇలా పోలీసాఫీసర్ రోల్స్‌లో నటించే హీరోలు మరికొంతమంది ఉన్నారు. మరికొందరు స్క్రిప్ట్స్ వింటున్నారని తెలిసింది.
– ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment