HIT Movie Review, in Telugu, Rating {3/5} | 2020 | ‘హిట్‌’ మూవీ రివ్యూ | Vishwak sen, Nani - Sakshi
Sakshi News home page

‘హిట్‌’ మూవీ రివ్యూ

Published Fri, Feb 28 2020 12:31 PM | Last Updated on Fri, Feb 28 2020 2:24 PM

Hit Telugu Movie Review And Rating, Nani, Vishwak Sen - Sakshi

టైటిల్‌: హిట్‌
జానర్‌: సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌
నటీనటులు: విశ్వక్‌సేన్‌, రుహానీ శర్మ, బ్రహ్మాజీ, భానుచందర్‌, మురళీశర్మ, తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌
దర్శకత్వం: శైలేష్‌ కొలను
బ్యానర్‌: వాల్‌ పోస్టర్‌ సినిమా
నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపురనేని

విశ్వక్‌ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్‌’. ‘ది ఫస్ట్‌ కేస్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌ . హీరో నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో నాని ప్రొడ్యూసర్‌గా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా? క్రైమ్‌ స్టోరీని దర్శకుడు శైలేష్‌ కొలను తెరపై చక్కగా ప్రజెంట్‌ చేశాడా? విశ్వక్‌ సేన్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేట్‌ ఆఫీసర్‌గా ఏ మేరకు మెప్పించాడు? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం.

కథ: 
క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం(హిట్‌) ఓ విభాగం. హిట్‌కు విశ్వ (భానుచందర్‌) హెడ్‌. విశ్వ టీంలోనే విక్రమ్‌ (విశ్వక్‌ సేన్‌), అభిలాష్ (శ్రీనాథ్‌ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు)లు ఎంతో సిన్సియర్‌ అండ్‌ టాలెంటెడ్‌ ఆఫీసర్స్‌. ప్రతీ క్రైమ్‌ కేసును సులువుగా ఛేదిస్తుంటారు. ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న నేహ(రుహానీ శర్మ), విక్రమ్‌ల మధ్య ఎప్పటినుంచో ప్రేమ కొనసాగుతోంది. ఈ క్రమంలో నగరంలో ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్‌కు గురవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేహ కూడా గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేస్తారు. 
https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif
ఈ కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే బాధ్యతను విక్రమ్‌కు విశ్వ అప్పగిస్తాడు. అయితే కేసుకు సంబంధించి ఎటువైపు వెళ్లినా అన్ని దారులు మూసుకపోతుంటాయి. కేసులో భాగంగా విచారిస్తున్న వారందరూ అనుమానితులుగానే కనిపిస్తారు. అయితే ఈ కేసులోకి షీల(హరితేజ), షిండే (బ్రహ్మాజీ), ఇ​బ్రహీం(మురళీ శర్మ)లు ఎందుకు ఎంటర్‌ అవుతారు? చివరికి ఈ కేసును విక్రమ్‌ ఛేదించాడా? ప్రీతి, నేహాలకు ఏమైంది? వారిని కిడ్నాప్‌ చేసింది ఎవరు? రెండు కిడ్నాప్‌లు చేసింది ఒకరేనా లేక ఇద్దరా? అసలు విక్రమ్‌కు ఉన్న ఆ వింత వ్యాధి ఏంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.  


https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif
నటీనటులు:
తొలి రెండు సినిమాల్లో మన గల్లీలోని కుర్రాడిలా కనిపించిన విశ్వక్‌ సేన్‌ ఈ చిత్రంలో ఓ సీరియస్‌ పోలీస్‌మన్‌ పాత్రలో మెరిశాడు. ఓ క్రైమ్‌ కేసును ఇన్వెస్టిగేషన్‌ చేసే క్రమంలో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పడే ఇబ్బందులు, ఆలోచించే విధానం, టెన్షన్స్‌, ఎమోషన్స్‌, అంతేకాకుండా అతడికున్న వింత వ్యాధితో పాటు, ప్రేమించిన అమ్మాయి దూరం అవడంతో పడే ఆవేదన ఇలా అన్ని భావాలను పండించాడు విశ్వక్‌. ఈ కథ హీరోయిన్‌ మిస్సింగ్‌ చుట్టూ జరిగినా.. రుహానీ శర్మకు నటన పరంగా అంతగా ప్రాధాన్యం దక్కలేదు. లుక్స్‌ పరంగా బాగుంది. హరితేజకు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దక్కింది. ఇప్పటివరకు ఆమె చేయని క్యారెక్టర్‌ అయినప్పటికీ షీలా పాత్రలో ఒదిగిపోయింది. ఇక విక్రమ్‌తోనే ఉండే రోహిత్ (చైతన్య సగిరాజు) కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. భానుచందర్‌, మురళీ శర్మ, బ్రహ్మాజీలు తమ అనుభవంతో వారి పాత్రలను అవలీలగా చేశారు. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
నాని ప్రొడక్షన్‌ హౌజ్‌ నుంచి విశ్వక్‌ సేన్‌ సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ డిఫరెంట్‌ టైటిల్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని చెప్పగానే అందరూ ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల అంచనాలను, నాని నమ్మకాన్ని, విశ్వక సేన్‌ ఆశలను డైరె​క్టర్‌ శైలేష్‌ కొలను వమ్ము చేయలేదు. ఇలాంటి క్రైమ్‌ స్టోరీలపై సినిమాలు చాలానే వచ్చినా.. ఇన్వెస్టిగేషన్‌ చేసే విధానం కొత్తగా అనిపిస్తుంది. కథ మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టకుండా, బలమైన క్రైమ్‌, ఇన్వెస్టిగేషన్‌ సీన్లపైనే దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే అవే సినిమాకు ప్రధాన బలం అవుతాయి. ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌తో పాటు మధ్యమధ్యలో హీరోహీరోయిన్ల లవ్‌ సీన్స్‌, హీరో గతం గురించి చూపించడం వంటివి డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేకు అద్దంపట్టింది. 

సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్‌ కార్డు పడే వరకు కూడా ప్రేక్షకుడు నెక్ట్స్ ఏంటి అని ఆసక్తిగా ఎదురుచూస్తాడు. కొన్ని క్రైమ్‌ సినిమాలలో అసలు దోషి ఎవరో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది అయితే హీరో అతడిని ఎలా పట్టుకుంటాడని ఆసక్తిగా తిలకిస్తారు. కానీ ఈ సినిమాలో హీరోతో పాటు ప్రేక్షకుడు కూడా అసలు ఈ కిడ్నాప్‌ చేసింది ఎవరో అని మదిలో ఇన్వెస్టిగేట్‌ చేయడం ఖాయం. అయితే ప్రీ క్లైమాక్స్‌ వరకు బాగానే ఉన్నా.. క్లైమాక్స్‌తోనే దర్శకుడు కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ క్రైమ్‌ కేసు వెనక బలమైన కారణాన్ని చూపించలేదు. దీంతో సినిమా గ్రాఫ్‌ ఒక్కసారిగ పడిపోయిందన్న భావన కలుగుతుంది. హిట్‌కు సీక్వెల్‌ ఉండటంతో క్లైమాక్స్‌ను సాదాసీదాగా ముగించవచ్చని సగటు అభిమానికి సందేహం కలగక మానదు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలు అంతగా ప్రాధాన్యం లేనప్పటికీ.. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో వివేక్‌ సాగర్‌ మ్యాజిక్‌ చేశాడు. ఇక సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. మణికందన్‌ తన కెమెరా పనితనంతో ప్రేక్షకుడు కూడా పలుమార్లు క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌లో తాను కూడా ఇన్వాల్వ్‌ అవుతాడు. ఇక ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. క్లైమాక్స్‌ ఒక్కటి మినహా సినిమా అంతా చకచకా సాగిపోతుంది.. ఇలాంటి జానర్‌ సినిమాలను ఇష్టపడే వారు ‘హిట్‌’  కథలో తప్పకుండా ఇన్వాల్వ్‌ అయి ఆసక్తిగా చూస్తారు. థ్రిల్‌గా ఫీలవుతారు.
https://cms.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif

ప్లస్‌ పాయింట్స్‌:
విశ్వక్‌ సేన్‌ నటన
కథనం
ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌
బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌

మైనస్‌ పాయింట్స్‌:
స్లో నెరేషన్‌, నిడివి
బలమైన క్లైమాక్స్‌ లేకపోవడం

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement