సర్దుబాటు ఇలా.. | 33 days is considered on duty | Sakshi
Sakshi News home page

సర్దుబాటు ఇలా..

Published Sun, Oct 20 2013 1:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

33 days is considered on duty

 

=33 రోజులు ఆన్ డ్యూటీగానే పరిగణన
=ఆదివారాల్లోనూ పాఠశాలల నిర్వహణ
=మధ్యాహ్న భోజనం అమలు
=ఉపాధ్యాయులంతా హాజరుకావాల్సిందే
=విద్యాశాఖ డెరైక్టర్ నుంచి ఉత్తర్వులు

 
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మెలో భాగంగా కోల్పోయిన పనిదినాలను సర్దుబాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వాణి మోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులు సమ్మె చేయగా 33 రోజుల పనిదినాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ 33 రోజులను అక్టోబరు 20 నుంచి మార్చి 23 వరకు సర్దుబాటు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారులతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ నేపథ్యంలో 33 రోజుల పనిదినాలను అక్టోబరు నుంచి మార్చి వరకు వచ్చే ఆదివారాలు, రెండో శనివారం, సంక్రాంతి సెలవుల్లో పనిచేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉపాధ్యాయులు 33 రోజుల పనిదినాల పాటు సమైక్యాంధ్ర సమ్మెలో పాల్గొనగా విద్యాశాఖాధికారులకు, ఉపాధ్యాయులకు కుదిరిన ఒప్పందం నేపథ్యంలో వాటిని ఆన్‌డ్యూటీగానే పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులకు సమ్మె చేసిన రోజులకు సంబంధించి వేతనం విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్న పనిదినాలను ఓడీగా పరిగణిస్తున్నామని, ఈ పని దినాల భర్తీకి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
పాఠశాలలపై నిఘా...

ప్రభుత్వం సూచించిన విధంగా సెలవు రోజుల్లో ప్రత్యేక పనిదినాల్లో ఆయా పాఠశాలలపై నిఘా ఉంచుతారని ఏదైనా పాఠశాల పనిచేయకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లేదని, సమ్మె కాలంలో విధులకు హాజరైన ఉపాధ్యాయులను మళ్లీ పాఠశాలలకు హాజరుకావాలని హుకుం జారీ చేయటం కక్షసాధింపు చర్యేనని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.సత్యనారాయణ విమర్శించారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి నాయకులు ఇచ్చిన జాబితాను కాస్త మార్పుచేసి ప్రభుత్వం ప్రత్యేక పనిదినాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వులపై సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తుండగా సమ్మెలో పాల్గొనని ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారు. సమ్మె కాలంలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని వారు కోరుతున్నారు.
 
ఉత్తర్వులు అమలు చేస్తాం : డీఈవో

 ప్రభుత్వ ఉత్తర్వులను జిల్లాలో అమలు చేస్తామని, పాఠశాలలు పనిచేస్తుంటే వాటిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని డీఈవో డి.దేవానందరెడ్డి తెలిపారు. ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఉత్తర్వులపై కొందరు ఉపాధ్యాయులకు అనుమానాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుతామని చెప్పారు. సమ్మె కాలంలో పనిచేసిన ఉపాధ్యాయులు తాము ఈ నెల 20న పాఠశాలకు హాజరుకాబోమని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌ను శనివారం మధ్యాహ్నం కలిసి చెప్పగా పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుందని చెప్పినట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు.
 
పాఠశాలలు పనిచేసే రోజులివీ...

 ప్రభుత్వం సూచించిన విధంగా ఆయా సెలవు రోజుల్లో పాఠశాలలు జరిగే జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబరులో 20, 27 తేదీల్లోని ఆదివారాల్లో, నవంబరులో 3, 10, 17, 24 తేదీల్లోని ఆదివారాల్లో, 9న రెండో శనివారం పాఠశాలలు పనిచేయాల్సి ఉంటుంది. డిసెంబరులో 1, 8, 15, 22, 29 తేదీల్లోని ఆదివారాలు, 14న రెండో శనివారం, జనవరిలో 5, 19, 26 తేదీల్లోని ఆదివారాల్లో, సంక్రాంతి సెలవు దినాలైన 8 నుంచి 12 వరకు, తిరిగి 16, 17 తేదీల్లో పాఠశాలలు పనిచేస్తాయి. ఫిబ్రవరిలో 2, 9, 16, 23 తేదీల్లోని ఆదివారాలు, 8న రెండో శనివారం, మార్చిలో 2, 9, 16, 23 తేదీల్లోని ఆదివారాల్లో, 8న రెండో శనివారాల్లో పాఠశాలలు పనిచేస్తాయి. ముఖ్యమంత్రితో జరిగిన చర్చల ఫలితంగానే సమైక్యాంధ్ర సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సర్దుబాటు జరిగిందని సమైక్యాంధ్ర పోరాట సమితి రాష్ట్ర కన్వీనరు మత్తి కమలాకరరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.
 
నేడు పనిచేయనున్న పాఠశాలలు

 నూజివీడు : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఈ నెల 20వ తేదీ ఆదివారం కూడా పనిచేయనున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి డి.దేవానందరెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులందరూ సమైక్య ఉద్యమంలో భాగంగా సమ్మెలో పాల్గొన్నందున ఆయా పనివేళల భర్తీ కోసం ఈ మేరకు హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులే పనిచేయాలా, సమ్మెలోకి రాని ఉపాధ్యాయులు కూడా పనిచేయాలా అనే వివరణ ఏమీ రాలేదని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement