స్కూలు సేవలన్నిటికీ ‘క్రెడో’ | Attendance, fees, all by app says Sheshananda Reddy | Sakshi
Sakshi News home page

స్కూలు సేవలన్నిటికీ ‘క్రెడో’

Published Sat, May 18 2019 12:15 AM | Last Updated on Sat, May 18 2019 12:15 AM

Attendance, fees, all by app says Sheshananda Reddy - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విద్యారంగంలో టెక్నాలజీ బాగానే చొచ్చుకొచ్చేసింది. కాకపోతే అటెండెన్స్‌ వంటి విషయాల్లో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయి. అడ్మిషన్లు, స్టాఫ్‌ నిర్వహణ, స్టూడెంట్స్‌ అటెండెన్స్, ప్రోగ్రెస్‌ రిపోర్టులు, ఫీజులు.. ఇలా చాలా అంశాలను ఆన్‌లైన్‌లోకి తేవడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలందిస్తోంది క్రెడో!!. స్కూళ్లు, కాలేజీలతో పాటు మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు ఉపయోగపడే ఎన్నో సేవలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తేవటం, సర్వర్‌ను కూడా భద్రంగా ఉంచడం ‘క్రెడో’ యాప్‌ ప్రత్యేకత. క్రెడో అంటే ఒక యాప్‌ మాత్రమే కాదు. ఇది వివిధ యాప్‌లను పర్యవేక్షిస్తుందని ‘క్రెడోయాప్‌.ఇన్‌’ను ప్రమోట్‌ చేస్తున్న హెచ్‌ఎల్‌ఎం సొల్యూషన్స్‌ వ్యవస్థాపకుడు కె.నాగ శేషానంద రెడ్డి ‘స్టార్టప్‌ డైరీ’ ప్రతినిధితో చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే... 
‘‘స్టూడెంట్, టీచర్, పేరెంట్, స్కూల్‌ అడ్మిన్‌కు ప్రత్యేక యాప్‌లున్నాయి. వీటన్నిటినీ క్రెడో మానిటర్‌ చేస్తుంది. విద్యార్థి తాలూకు సమాచారం ఎప్పటికప్పుడు పేరెంట్స్‌ తెలుసుకునేలా వారి అసైన్‌మెంట్లతో పాటు ఇతర సబ్జెక్టులకు సంబంధించి అన్ని విషయాలూ అప్‌డేట్‌ అవుతాయి. ఏ సమయంలో ఏ సబ్జెక్ట్‌ క్లాసో... సిలబస్‌ ఏంటో... తెలుసుకోవచ్చు. టీచర్లు యాప్‌లోనే అటెండెన్స్‌ తీసుకోవచ్చు. విద్యార్థి తల్లిదండ్రులతో టీచర్లు యాప్‌ ద్వారా అన్ని విషయాలు పంచుకోవచ్చు కూడా. కాలేజీ స్థాయి విద్యార్థులకు క్లాస్‌తో పాటు, ల్యాబ్‌ స్కెడ్యూల్‌ లాంటి విషయాలు యాప్‌లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు.  

ఫీజులు కూడా చెల్లించొచ్చు.. 
స్కూల్‌ టర్మ్‌ ఫీజులు, కాలేజీ సెమిస్టర్‌ ఫీజుల్లాంటివి క్రెడో ఫ్లాట్‌ఫాంపై ఆన్‌లైన్‌లో చెల్లించుకునే వీలుంది. దీంతో పాటు స్కూల్‌ అకౌంటింగ్‌ లాంటివి చేసుకోవచ్చు. స్కూల్‌ నుంచి పేరెంట్స్‌కు, స్టూడెంట్స్‌కు ఉచితంగా అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు పంపవచ్చు. బయోమెట్రిక్‌ / ఆర్‌ఎఫ్‌ఐడీ అటెండెన్స్‌ను యాప్‌కు అనుసంధానించిన ఈ యాప్‌లో అడ్మిషన్‌ ఎంక్వైరీ సిస్టమ్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, లైబ్రరీ మేనేజ్‌మెంట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బుక్స్‌ డొనేట్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లూ ఉన్నాయి. 

స్కూల్‌ బస్‌ ట్రాకింగ్‌.. 
క్రెడో ద్వారా స్కూల్‌ బస్‌ను ట్రాక్‌ చేయొచ్చు. స్కూల్‌ బస్‌ ఎప్పుడు బయలుదేరిందనే సమాచారం పేరెంట్స్‌కి నోటిఫికేషన్‌ ద్వారా చేరుతుంది. దీంతో పాటు కాలేజీ బస్‌ రూట్‌ అప్‌డేట్స్‌ని విద్యార్థులకు చేరవేస్తుంది. ఈ సౌకర్యమంతా స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌లోనే అందించటం క్రెడో ప్రత్యేకత. విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రెడో యాప్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ పోతాం. ఇప్పటి వరకు రూ.25 లక్షలు ఖర్చు చేశాం. ఇన్వెస్టర్లతో చర్చలు పురోగతిలో ఉన్నాయి. రెండు నెలల్లో రూ.10 కోట్లు సమీకరిస్తున్నాం. ప్రస్తుతం 60కి పైగా స్కూళ్లు, కాలేజీలు క్రెడో క్లయింట్లుగా ఉన్నాయి. మరో 30 సంస్థలతో ప్రస్తుతం సంప్రతింపులు జరుగుతున్నాయి’’ అని శేషానంద రెడ్డి వివరించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement