మెడికల్‌ కాలేజీలో ఆధార్‌ ఆధారంగా బయోమెట్రిక్‌ హాజరు | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీలో ఆధార్‌ ఆధారంగా బయోమెట్రిక్‌ హాజరు

Published Wed, Jun 28 2023 12:48 AM | Last Updated on Wed, Jun 28 2023 8:51 AM

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన  బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నైజేషన్‌ మిషన్‌ - Sakshi

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నైజేషన్‌ మిషన్‌

మంచిర్యాలటౌన్‌: ప్రభుత్వ మెడికల్‌ కళాశాలతోపాటు అనుబంధ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సీనియర్‌ రెసిడెంట్లు, ట్యూటర్లు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మంచిర్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో మూడు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మూడు, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో మూడు బయోమెట్రిక్‌ మిషన్లు, ఒక్కొక్క ఫేస్‌ రికగ్నైజేషన్‌ మిషన్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బయోమెట్రిక్‌తోపాటు ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారానే హాజరు నమోదు చేస్తుండగా, వీటిని నేరుగా డీఎంఈకి అనుసంధానం చేయడంతో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు.

ఇకపై వీరి పర్యవేక్షణను జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) కమాండ్‌ కంట్రోల్‌ నుంచే చేసేలా చర్యలు తీసుకుంటోంది. నేరుగా దేశ రాజధాని ఢిల్లీ నుంచే అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లోని వైద్యులు, ఉద్యోగుల హాజరును పరిశీలించనున్నారు. మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రులకు హాజరైనప్పుడు ఒకసారి, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్రలు వేసి, ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా హాజరు నమోదు చేయాల్సిందే. గత నెలలోనే ఇందుకు సంబంధించిన అధునాతన బయోమెట్రిక్‌ పరికరాలను బిగించి, సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. ఉద్యోగుల వివరాలన్నింటినీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి వినియోగిస్తున్నారు. ఏ సమయానికి హాజరు అవుతున్నారు అనే దానితోపాటు పనితీరు పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

గైర్హాజరుకు చెక్‌
మంచిర్యాలకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో గత ఏడాది 100 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించారు. ఇటీవల నీట్‌ పరీక్ష నిర్వహించగా, ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది మరో 100 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీట్లు పొంది చేరనున్నారు. ప్రతియేటా పెరుగుతున్న మెడిసిన్‌ విద్యార్థులకు అనుగుణంగా, అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ట్యూటర్లను నియమిస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రం 130 పడకలతో కొనసాగుతోంది. నె లలో 400కు పైగా ప్రసవాలు జరుగుతుండగా, ప్రతీ రోజు 150 మందికి పైగా గర్భిణులు ఓపీకి వస్తున్నా రు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 280 పడకలతో వైద్య సేవలు అందిస్తుండగా, అన్ని విభాగాల్లో అ సోసియేట్‌ ప్రొఫెసర్లు, వైద్యులను నియమిస్తున్నారు.

ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ప్రస్తుతం ప్రొఫెసర్లు 11 మంది, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఆరుగురు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 49 మంది, సీనియర్‌ రెసిడెంట్లు 44, ట్యూటర్లు 4, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ 16 మంది ఉండగా, ఇతర వైద్య సిబ్బంది 20 మందికి పైగా ఉన్నారు. బయోమెట్రిక్‌ పరికరాలతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హాజరు సరిగ్గా పాటించని ఉద్యోగులపై నేరుగా చర్యలు తీసుకునేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.

సమయపాలన పాటిస్తారు
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఎంసీహెచ్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించేందుకు ఇప్పటికే మూడు చోట్ల బయోమెట్రిక్‌ మిషన్లు ఏర్పాటు చేసి వినియోగిస్తున్నాం. డీఎంఈ నుంచి హాజరును పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌ఎంసీకి అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం లాగిన్‌ఐడీ వస్తే, బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్ర, ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా హాజరు నమోదును డీఎంఈతోపాటు ఢిల్లీలోని ఎన్‌ఎంసీ పరిశీలిస్తారు.

– డాక్టర్‌ ఎండీ సులేమాన్‌, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement