సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు ఊరట లభించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. నూతన జిల్లాల ఆవిర్భావం తర్వాత పాత జిల్లా ప్రాతిపదికనా.. లేక కొత్త జిల్లా ప్రకారం పదోన్నతులు ఇవ్వాలా అనే సందిగ్ధంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఫలితంగా పైస్థాయి పోస్టులు ఖాళీ అవుతున్నప్పటికీ కిందిస్థాయి టీచర్లకు పదోన్నతులు రావ డం లేదు.
ఈ అంశంపై ఉపాధ్యాయ సం ఘాలు ప్రభుత్వానికి పలుమార్లు వినతులు సమర్పించాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మంత్రి సబితా రెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పదోన్నతుల అంశాన్ని సులభంగా పరిష్కరించేలా చూడాలని సూచనలు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పాత పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాన్ని విద్యా శాఖాధికారులు స్పష్టం చేయడంతో ఆ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కోర్టు అనుమతికి చర్యలు...
నూతన జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలని కోర్టు గతంలో స్పష్టం చేసింది. గత విద్యా సంవత్సరం ఉపాధ్యాయ బదిలీల సమయంలో పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. నూతన జిల్లా ప్రాతిపదికన బది లీలు చేపట్టాలని పలు పిటిషన్లు దాఖలు కాగా... వాటిని విచారించిన కోర్టు పాత జిల్లా ప్రాతిపదికన బదిలీలు, కొత్త జిల్లా ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టవచ్చని సూచించింది.
ఈక్రమంలో ఉమ్మడి జిల్లా పరిధిని పరిగణిస్తూ బదిలీల ప్రక్రియ పూర్తి చేయగా, పదోన్నతుల అంశం మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ క్రమంలో టీచర్ల బదిలీలు చేపట్టాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పరిష్కార చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త జిల్లా ప్రకారం పదోన్నతులు ఇవ్వాలంటే ఉద్యోగుల విభజన జరగలేదనే అంశం ఇబ్బందికరంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ప్రమోషన్లు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశిస్తూనే... కోర్టు అనుమతి కోసం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అధికారులకు సూచించింది.
స్కూల్ అసిస్టెంట్ వరకే...
తాజాగా బదిలీల ప్రక్రియ చేపట్టాల్సివస్తే కేవలం ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు మాత్రమే పదోన్నతులు ఇచ్చే వీలుంది. స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్‌ఎం (గెజిటెడ్ హెడ్మాస్టర్) పదోన్నతుల్లో జోనల్ సమస్య ఉంది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టు జోనల్ పరిధిలో ఉండడం, తాజాగా నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఏ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు ఎంఈఓ, డిప్యూటీ ఈవో పదోన్నతులపైనా జోనల్ అంశంతో పాటు సర్వీసు రూల్స్‌తో ముడిపడి ఉంది. దీంతో ఈ పోస్టులకు పదోన్నతులు ఇవ్వడం ప్రస్తుతానికి కష్టమనే చెప్పొచ్చు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులతో రాష్ట్రవ్యాప్తంగా 6,500 పోస్టులు భర్తీ చేసే వీలున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment