పర్యవేక్షణ అధికారుల్లేక పరేషాన్‌  | Telangana Education Department Shortage Of MEOs DEOs | Sakshi
Sakshi News home page

పర్యవేక్షణ అధికారుల్లేక పరేషాన్‌ 

Published Sat, Sep 24 2022 1:26 AM | Last Updated on Sat, Sep 24 2022 1:26 AM

Telangana Education Department Shortage Of MEOs DEOs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పాఠశాల విద్యశాఖలో ఏళ్ల తరబడి పర్యవేక్షక అధికారుల కొరత పీడిస్తోంది. 30 లక్షలమంది విద్యార్థులు, లక్ష మందికిపైగా సిబ్బంది ఉన్న పాఠశాల విద్యా వ్యవస్థలో పలు మండలాలకు ఎంఈవో, కొన్ని జిల్లాలకు డీఈవోలు లేరు. ప్రధానోపాధ్యాయులకే ఎంఈ వో పోస్టులు తాత్కాలికంగా అప్పగిస్తున్నారు. పలువురు ఎంఈవోలను అదనపు మండలాలకు సర్దుబాటు చేస్తున్నారు.

ఈ విద్యాసంవత్సరం స్కూళ్లు మొదలైన నాటి నుంచి ప్రతీ అంశాన్ని పర్యవేక్షించడం, అవసరమైన నివేదికలు తయారు చేసి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మండల, జిల్లాస్థాయి అధికారుల పాత్ర కీలకం. ఇంగ్లిష్‌ మీడియం బోధన మొదలైనా పర్యవేక్షక అధికారుల కొరత వల్ల ఇప్పటివరకూ క్షేత్రస్థాయి నివేదికలు ఉన్నతాధికారులకు అందలేదని తెలుస్తోంది.

317 జీవోకు ముందు జిల్లా, జోన్‌లుగా రెండంచెల వ్యవస్థ ఉండేది. జీవో అమలులోకి వచ్చిన తర్వాత జిల్లా, జోన్, మల్టీజోన్లుగా మూడంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారులు, డైట్‌ లెక్చరర్ల పోస్టులన్నీ మల్టీజోన్‌ క్యాడర్‌ పోస్టులుగా ఉన్నాయి. వీటన్నింటి నిర్వహణకు మల్టీ జోన్‌స్థాయి అధికారి పోస్టులు ఉండాలని టీచర్ల సంఘాలు కోరుతున్నాయి.

రాష్ట్రంలో ఉన్న ఏడు జోన్లకు పాలన వ్యవహారాలు నిర్వహించడానికి ఏడుగురు జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) స్థాయి అధికారులు అవసరం కాగా, ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అత్యంత కీలకమైన పరీక్షల విభాగం, ఎస్‌సీఈఆర్‌టీ, ఓపెన్‌ స్కూల్స్, మోడల్‌ స్కూల్స్, సైట్, కేజీబీవీలు, రెసిడెన్షియల్‌ స్కూల్స్, గ్రంథాలయాలు, పాఠ్యపుస్తకాలు, పబ్లిక్‌ స్కూల్స్, జవహర్‌ బాలభవన్‌ వంటి విభాగాల నిర్వహణకు అధికారులుంటేనే వ్యవస్థలో లోపాలను సరిచేయవచ్చని సూచిస్తున్నారు. కేజీబీవీల్లో ఇద్దరు, మోడల్‌ స్కూల్స్‌ విభాగం, ఓపెన్‌ స్కూల్స్‌లో ఒకరు చొప్పున జాయింట్‌ డైరెక్టర్లున్నారు. మిగిలిన విభాగాల్లో ఏడీ పోస్టు కానీ, పూర్తిస్థాయిలో డీడీ పోస్టులు లేవు.  

ఎంఈవోలు... డీఈవోలు ఎక్కడ? 
ఇప్పటికీ 12 జిల్లాలకే డీఈవోలున్నారు. 21 జిల్లాల్లో డీఈవో పోస్టులు మంజూరు చేసినా భర్తీ చేయలేదు. 602 మండలాలను ఎడ్యుకేషన్‌ బ్లాకులుగా చేశారు. ప్రతీ బ్లాక్‌కు ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌గా ఇప్పుడున్న టీచర్లకు పదోన్నతులు కల్పిస్తే భర్తీ అవుతాయి. స్థానిక సంస్థల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఎక్కువ వున్నారని, కాబట్టి తమకే ఎంఈవోలు కావాలని పంచాయతీరాజ్‌ విభాగం టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వం గతంలో నేరుగా నియమించిన ఉపాధ్యాయులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ పోస్టులు దక్కించుకునే అర్హత తమకే ఉందని చెబుతున్నారు. ఈ కారణంగానే హెచ్‌ఎంల పదోన్నతి ప్రతి ఏటా వాయిదా పడుతూ వస్తోంది. పదోన్నతులు, బదిలీలు లేకపోవడంతో కొంతమంది ఎంఈవోలకు 6 నుంచి 8 మండలాలు ఎంఈవో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో తమ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు దెబ్బతినే వీలుందని ఉపాధ్యాయులు అంటున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement