సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరంలో మళ్లీ విద్యా వలంటీర్లను నియమించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి విద్యా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే విద్యా వలంటీర్ల నియామక ప్రక్రియ చేపట్టే వీలుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
టెట్ ఉత్తీర్ణులైన వారిని సబ్జెక్టుల అవసరాన్ని బట్టి నియమించే అవకాశముందని తెలుస్తోంది. రెండేళ్లుగా కరోనా వెంటాడటంతో స్కూళ్లు సరిగా నడవలేదు. దీంతో విద్యా వలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేదు. గత సంవత్సరం పాఠశాలలు తెరిచినా, వలంటీర్ల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు.
జీపీఏ తగ్గడం వల్లే..
ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల జీపీఏ తగ్గింది. దీనిపై ఇటీవల అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల వరకూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. ముఖ్యంగా సబ్జెక్టు టీచర్ల కొరత విపరీతంగా ఉంది. కొన్ని స్కూళ్లలో ఉన్న వాళ్లే మిగతా సబ్జెక్టులు బోధించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలు విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపాయి.
దీనికి తోడు కరోనా కారణంగా అభ్యసన నష్టాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపడుతున్నారు. ఈ దృష్ట్యా ఉపాధ్యాయుల కొరత ఉంటే మరిన్ని సమస్యలు తలెత్తే వీలుంది. ఈ ఏడాది ప్రభుత్వం టీచర్ల నియామకం చేపడుతుందని భావించారు. కానీ పదోన్నతుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో తాత్కాలికంగా విద్యా వలంటీర్లలతో ఈ ఏడాది నెట్టుకురావాలని అధికారులు భావిస్తున్నారు. 2019లో 16 వేల మంది వలంటీర్లను తీసుకున్నా, ఆ తర్వాత ఈ సంఖ్య 12 వేలకు తగ్గింది. ఇప్పుడు కూడా ఇంతే మొత్తంలో వలంటీర్లను తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment