vidya volunteers
-
విద్యా వలంటీర్లతో నెట్టుకొద్దాం! 12 వేల మందిని తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరంలో మళ్లీ విద్యా వలంటీర్లను నియమించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి విద్యా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే విద్యా వలంటీర్ల నియామక ప్రక్రియ చేపట్టే వీలుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టెట్ ఉత్తీర్ణులైన వారిని సబ్జెక్టుల అవసరాన్ని బట్టి నియమించే అవకాశముందని తెలుస్తోంది. రెండేళ్లుగా కరోనా వెంటాడటంతో స్కూళ్లు సరిగా నడవలేదు. దీంతో విద్యా వలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేదు. గత సంవత్సరం పాఠశాలలు తెరిచినా, వలంటీర్ల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. జీపీఏ తగ్గడం వల్లే.. ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల జీపీఏ తగ్గింది. దీనిపై ఇటీవల అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల వరకూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. ముఖ్యంగా సబ్జెక్టు టీచర్ల కొరత విపరీతంగా ఉంది. కొన్ని స్కూళ్లలో ఉన్న వాళ్లే మిగతా సబ్జెక్టులు బోధించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలు విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపాయి. దీనికి తోడు కరోనా కారణంగా అభ్యసన నష్టాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపడుతున్నారు. ఈ దృష్ట్యా ఉపాధ్యాయుల కొరత ఉంటే మరిన్ని సమస్యలు తలెత్తే వీలుంది. ఈ ఏడాది ప్రభుత్వం టీచర్ల నియామకం చేపడుతుందని భావించారు. కానీ పదోన్నతుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో తాత్కాలికంగా విద్యా వలంటీర్లలతో ఈ ఏడాది నెట్టుకురావాలని అధికారులు భావిస్తున్నారు. 2019లో 16 వేల మంది వలంటీర్లను తీసుకున్నా, ఆ తర్వాత ఈ సంఖ్య 12 వేలకు తగ్గింది. ఇప్పుడు కూడా ఇంతే మొత్తంలో వలంటీర్లను తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
TS Schools:ఈ ఏడాదీ విద్యావలంటీర్లు లేనట్టే..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల మంది కొత్తగా చేరారు. అయితే ఉపాధ్యాయుల కేటాయింపులో ఈ లెక్కను కొలమానంగా తీసుకోలేమని పాఠశాల విద్యాశాఖ నిక్కచ్చిగా చెబుతోంది. విద్యార్థుల పెరుగుదలపై ఆ శాఖ ఇటీవల ప్రభుత్వానికి ఓ నివేదిక అంద జేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని నివేదికలో పేర్కొంది. తెలంగాణవ్యాప్తంగా 42,575 స్కూళ్లుం టే, ఇందులో 30,001 ప్రభుత్వ, 702 ప్రభుత్వ ఎయిడెడ్, 11,688 ప్రైవేటు, 184 ఇతర యాజ మాన్యాల స్కూళ్లున్నాయి. వాస్తవానికి గతేడాది ప్రభుత్వ స్కూళ్లలో 28,37,635 మంది విద్యార్థులు ఉండగా, ఈ సంవత్సరం 22,26,329 మంది హాజరవుతున్నట్టు తెలిసింది. మిగిలిన ఆరు లక్షల మంది విద్యార్థులు ఇంకా పాఠశాలలకు, వసతి గృహాలకు రావాల్సి ఉంది. ప్రస్తుతం పాఠశాలకు వస్తున్న వారిలో కొత్తగా చేరిన వారి సంఖ్య దాదాపు 2.5 లక్షలు. వీళ్లంతా ప్రైవేటు స్కూళ్ల నుంచే వచ్చి నట్టు అధికారులు చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు, విద్యా ప్రమాణాలు పెరగడం వల్లే విద్యార్థులు ఆకర్షితులయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులనూ పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీసం విద్యా వలంటీర్లనైనా నియమించాలనే డిమాండ్ తెరమీదకొచ్చింది. వాళ్లుంటారా..? ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. కరోనా వల్ల అక్టోబర్ చివరి వరకూ ప్రైవేటు స్కూళ్లలో ప్రత్యక్ష తరగతులు సరిగా జరగలేదు. స్కూళ్లు తెరిచినా ఊళ్లకెళ్లిన పేద, మధ్య తరగతి వర్గాలు తిరిగి పట్టణాలకు రాలేదు. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఫీజులు కట్టేందుకు వెనకాడుతున్నాయి. ఈ కారణాల వల్ల ఎక్కువ మంది అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించారు. దీనివల్లే సర్కారీ స్కూళ్లలో చేరికలు పెరిగాయని అంటు న్నారు. ప్రతీ ఏడాది మాదిరే ఈసారీ కొంతమంది ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటుకు వెళ్లారని అధికా రులు తెలిపారు. కొత్తగా చేరిన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలోనూ తమ వద్దే ఉంటారన్న నమ్మకం ఏమిటనే సందేహం విద్యాశాఖ వ్యక్తం చేస్తోంది. అందువల్లనే హేతుబద్ధీకరణ ప్రక్రియను వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ఏడాదంతా ఇంతేనా? రేషనలైజేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ గత ఆగస్టులోనే విడుదల చేసింది. వాస్తవ సంఖ్య తెలిస్తేనే ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల హేతుబద్ధీకరణ సాధ్యమంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిపైనా స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా 1 నుంచి 5 తరగతుల విషయంలో ఉపాధ్యాయుల కొరతను తీర్చేలా మార్గదర్శకాల్లో పేర్కొంది. పెరిగిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఈ తరగతుల మధ్యే ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు రేషనలైజేషన్ సాధ్యం కాదని చెప్పింది. దీన్నిబట్టి విద్యా వలంటీర్ల నియామకం కూడా సరైంది కాదంది. ఈ ఏడాది మొత్తం స్థానిక సర్దుబాటు ద్వారానే ఉపాధ్యాయుల సేవలు వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీన్నిబట్టి ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు ఉపాధ్యాయుల సర్దుబాటే తప్ప, ఎలాంటి మార్పునకు అవకాశం లేదని విద్యాశాఖ తన నివేదికలో స్పష్టంచేసింది. -
అగమ్యగోచరంగా విద్యావలంటీర్ల పరిస్థితి
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తు న్న విద్యావలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నూతనంగా విధుల్లో చేరుతున్న ఉపాధ్యాయుల రాకతో వీవీలకు సంకటంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న వీవీల పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైంది. ప్రభుత్వం నిర్వహించిన టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోకి రెగ్యులర్ ఉపాధ్యాయులు వస్తున్నారు. దీంతో ఇప్పటివరకు పని చేసిన వీవీలు వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల గడిచిపోవడంతో ప్రైవేటు పాఠశాలల్లో చేరే పరిస్థితి కూడా లేదు. దీంతో అయోమయంలో వీవీలు పడ్డారు సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో 144 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారుగా 30వేల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యా బోధనకై గతేడాది 780మంది వీవీలను తీసుకున్నారు. మెదక్ జిల్లాలో 89మంది ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. 89మంది విధుల్లో చేరారు. అయితే వీరి స్థానంలో పని చేస్తున్న వీవీలను ఇంటికి పంపనున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా విద్యా వలంటీర్లను నియమించారు. మరో వైపు టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్తులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం వెంటనే టీఆర్టీ నియామకాలను చేపట్టింది. ఆ స్థానంలో ఉన్న విద్యా వలంటీర్లను వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నో ఆశలతో విధుల్లో చేరిన విద్యా వలంటర్లను తొలగించడం అనివార్యం కావడంతో వీవీలు అయోమయంలో పడ్డారు. ప్రైవేటులోనూ కష్టమే.. టీఆర్టీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వటంలో ఆలస్యం అవుతుందని గతేడాది విధులు నిర్వహించిన వీవీలను విధుల్లోకి తీసుకోవాలని పాఠశాలల పునఃప్రారంభానికి ముందే వారు ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఈ ఎడాది పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యా వలంటీర్లను విధుల్లోకి చేర్చుకున్నారు. పాఠశాలల ప్రారంభంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యా వలంటీర్లంతా చురుగ్గా పాల్గొని గ్రామాల్లోని విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారు. అంతా బాగానే ఉందని సంతోషంతో వీవీలు విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులను భర్తీ చేయడంతో వీరి తొలగింపు అనివార్యమైంది. దీంతో వీవీలు ఆందోళన చెందుతున్నారు. విధుల్లో చేరి నెల కాకముందే తప్పుకోవాల్సి వస్తుండడంతో వారంతా ఆందోళనలో పడ్డారు. ఇటు ప్రైవేటు పాఠశాలల్లోను చేరే అవకాశం లేక పోవడంతో ఏం చేసేది అని చింతిస్తున్నారు. ఈ విషయమై డీఈఓ రవికాంత్రావ్ను వివరణ కొరగా వీవీలను తొలగిస్తామని సమాధానమిచ్చారు. యథావిధిగా కొనసాగించాలి మధ్యలో మమ్మల్ని తొలగిస్తే మేం ఏం కావాలి. వీవీ నమ్ముకొని ప్రైవేటు ఉద్యోగాలు వదులుకున్నాం. రెగ్యూలర్ ఉపాధ్యాయులు రాగానే మమ్మల్ని తొలగించడం సరైన పద్ధతి కాదు. ఈ ఏడాది కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. వేరే ప్రాంతాల్లో సర్దుబాటు చేసి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఉపాధిని కోల్పోతాం. కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారుతది. – నర్సింలు, వీవీల సంఘం మండల అధ్యక్షుడు, టేక్మాల్ యథావిధిగా కొనసాగించాలి మధ్యలో మమ్మల్ని తొలగిస్తే మేం ఏం కావాలి. వీవీ నమ్ముకొని ప్రైవేటు ఉద్యోగాలు వదులుకున్నాం. రెగ్యూలర్ ఉపాధ్యాయులు రాగానే మమ్మల్ని తొలగించడం సరైన పద్ధతి కాదు. ఈ ఏడాది కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. వేరే ప్రాంతాల్లో సర్దుబాటు చేసి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఉపాధిని కోల్పోతాం. కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారుతది. – నర్సింలు, వీవీల సంఘం మండల అధ్యక్షుడు, టేక్మాల్ -
ఈసారీ విద్యా వలంటీర్లే
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో విద్యా వలంటీర్ల (వీవీ) నియామకానికి సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం, భర్తీ ప్రక్రియ ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడంతో.. 16,781 మంది వీవీలను నియమించుకోవాలని ఆదేశించింది. తక్షణమే వీవీల నియామకాలను పూర్తిచేసి, విధుల్లో చేరేలా చూడాలని విద్యా శాఖను.. వారికి జూన్ నెలకు సంబంధించిన వేతనాలు ఇవ్వాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 15,473 చోట్ల ఖాళీ పోస్టులు, సెలవులతో ఏర్పడిన ఖాళీలుకాగా.. మరో 1,308 మంది వీవీలను తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలు మినహా మిగతా మాధ్యమాల్లో కొనసాగుతున్న స్కూళ్లలో తెలుగు భాష సబ్జెక్టు బోధించేందుకు నియమిస్తారు. విద్యా వలంటీర్లకు నెలకు రూ.12 వేల చొప్పున గౌరవ వేతనంగా ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మెరిట్ ఆధారంగానే.. విద్యా వలంటీర్ల ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారంగా సాగనుంది. మండలాల వారీగా ఖాళీలను ప్రదర్శించిన అనంతరం.. మండల విద్యాశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిలో మెరిట్ ఆధారంగా జాబితా రూపొందిస్తారు. జిల్లావిద్యాధికారి (డీఈవో) ఆమోదంతో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. వీవీల ఎంపిక ప్రక్రియలో రోస్టర్ పాయింట్లను సైతం అనుసరించనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. తాజాగా నియమించే వీవీలు రెగ్యులర్ టీచర్లు వచ్చే వరకు కొనసాగుతారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి డీఈవోలకు ఆదేశాలు అందాయి. -
వేతనజీవుల వెతలు
జీతాల కోసం విద్యావలంటీర్ల ఎదురుచూపులు పట్టించుకోని ప్రభుత్వం.. తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి న్యాల్కల్: చాలీ చాలనీ వేతనాలు, అవి కూడా సమయానికి రాకపోవడంతో విద్యావలంటీర్ల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు నెలలుగా వేతనాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. వచ్చే కొద్ది జీతం కూడా సమయానికి రావడం లేదని ఫలితంగా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. కుటుంబ పోషణ కోసం ఇతరుల వద్ద అప్పులు చేయవలసి వస్తుందని కన్నీంటి పర్యంతమవుతున్నారు. తమ వేతనాలు ఎప్పడు వస్తాయని అధికారులను అడిగితే త్వరలో వస్తాయని చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఇవ్వలేదని విద్యావలంటీర్లు చెబుతున్నారు. మండలంలో 62 మంది టీచర్లు మాత్రమే.. మండలంలో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం చెందిన ఎనిమిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు,, 44 ప్రాథమిక పాఠశాలలు పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 5950 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 155 మంది ఉపాధ్యాయులు ఉండాలి కానీ, 62 మంది మాత్రమే ఉన్నారు. 93కు పైగా ఖాళీలు ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. ఖాళీలలను విద్యావలంటీర్లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం గత జూన్‌లో తొలి విడతగా 30 మందిని, 63 మందిని జూలైలో నియమించింది. దీంతో ఆయా పాఠశాలల్లో బోధన సమస్య తొలగిపోయింది. అయితే విద్యావలంటీర్ల నియామకం జరిగి ఆరు నెలలు గడిచినా వారికి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యావలంటీర్లుగా ప్రభుత్వం ఉపాధి మార్గంచూపిందని సంతోషపడిన వీరికి వేతనాల రూపంలో కొత్త సమస్య వెటాండుతోందని వాపోతున్నారు. కుటుంబానికి ఆర్థికంగా కొంత అండగా ఉంటామనుకున్నవారికి నిరాశే ఎదురవుతోంది. అంతేకాకుండా మరింత భారంగా మారామని కన్నీటి పర్యంత మవుతున్నారు. ఇచ్చేకొద్ది జీతం కూడా సమయానికి ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలతో బోధనపై దృష్టిపెట్టలేకపోతున్నారని విద్యావేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన ఎంత అవసరమో విద్యావలంటీర్ల సంక్షమం కూడా అంతేఅవసరమని గుర్తించాలంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు వేతనం రాలేదు పాఠశాలలో పని చేస్తున్నప్పటి నుంచి ఇంత వరకు ఒక నెల జీతం కూడా రాలేదు. ఎప్పుడొస్తాయనే విషయం కూడా సరిగ్గా ఎవరు చెప్పడం లేదు. అందరు వస్తాయనే చెబుతున్నారు కానీ ఎప్పుడొస్తాయో తెలియదంటున్నారు. ఇచ్చే కొద్ది జీతం కూడా సమయానికి రాక అవస్థలు పడుతున్నాం. - హంస, విద్యావలంటర్, అత్నూర్ కుటుంబ పోషణ భారంగా మారింది ప్రభుత్వం సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబపోషణ కూడా భారంగా మారింది. ఇచ్చే కొద్ది జీతం కూడా సమయానికి ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని వేతనాలు అందేలా చూడాలి. - నాగేష్, విద్యావలంటర్, టేకూర్ ప్రభుత్వానికి నివేదికలు పంపాం మండలంలో పనిచేస్తున్న విద్యావలంటీర్ల వివరాలను ప్రభుత్వానికి పంపాం. వేతనాలు ఎప్పుడొస్తాయనే విషయం తెలియదు. వారి వేతనాలు నేరుగా వారి ఖాతాలోనే వేస్తారు. నాలుగు నెలల వేతనాలు రావలసి ఉంది. బహుశ ఈనెలఖారుకు రావచ్చు. - మారుతి రాథోడ్, ఎంఈఓ, న్యాల్కల్ -
త్వరలో విద్యావాలెంటీర్ల నియామకం
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల వద్ద 41మంది ఉపాధ్యాయులు పీఏ, పీఎఫ్లుగా ఉన్నారని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ టీచర్లు ప్రజాప్రతినిధుల వద్ల పని చేయకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామన్నారు. ఈ నెలాఖరుకల్లా అన్ని యూనివర్సిటీలకు వైస్ చాన్సులర్ల నియామకం పూర్తవుతుందని కడియం తెలిపారు. తనకున్న సమాచారం ప్రకారం ఎంసెట్ పేపర్ లీక్ అయిందన్న వార్తలు వాస్తవం కాదని ఆయన అన్నారు. ప్రయివేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే ఆయా పాఠశాలలకు నోటీసులు ఇచ్చామన్నారు. కోర్టు ఉత్తర్వుల బట్టి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యా వాలెంటీర్ల నియామకం వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
ప్లీజ్ చేరండి..!
విధుల్లో చేరని ఎంపికైన విద్యావలంటీర్లు పూర్తిస్థాయిలో భర్తీకాని వీవీ పోస్టులు ఈనెల 5 వరకు అవకాశం హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యావలంటీర్ల(వీవీ) నియామక ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టినా.. దాదాపు వంద పోస్టులు ఖాళీగా ఉండడం ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ జిల్లాలో 386 వీవీల నియామకానికి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 111 స్కూల్ అసిస్టెంట్లు, 275 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎన్నడూలేనంతగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 1,800 మంది అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోగా, ఇందులో వెయ్యి మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అయింది. ఉన్న పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అభ్యర్థుల తుది జాబితాను విద్యాశాఖ ప్రకటించింది. వీరి చేరిక ఇక లాంఛనమేనని.. ఇక విద్యాబోధనకు జిల్లాలో ఎటువంటి ఇబ్బంది ఉండబోదని విద్యాశాఖాధికారులు సంబరపడ్డారు. పోస్టులకు సరిపడా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఎంపికైన అభ్యర్థులందరూ ఒకటి రెండు రోజుల్లోగా తమకు కేటాయించిన పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చేరింది 287 మందే... ఎంపికైన జాబితాలో మొత్తం 386 మంది అభ్యర్థులు ఉండగా.. వీరిలో ఇప్పటివరకు 287 మంది మాత్రమే ఆయా పాఠశాలల్లో రిపోర్ట్ చేశారు. తద్వారా 69 ఎస్ఏలు, 218 ఎస్జీటీ పోస్టులు భర్తీ అయ్యాయి. మిగిలిన 99 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చి దాదాపు 10 రోజులవుతోంది. వాస్తవంగా గతనెల 24, 26 తేదీల్లో స్కూళ్లలో రిపోర్ట్ చేస్తారని అధికారులు భావించగా.. రిపోర్ట్ చేసిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో అధికారుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. నగరంలో జీవన వ్యయం అధికంగా ఉండడం, వీవీ పోస్టులకు ప్రభుత్వం ఇస్తున్న వేతనం తక్కువగా ఉండడం, ఇప్పుడిప్పుడే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతుండడం, పోటీ పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధం అవుతుండడం తదితర అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు ఈ నెల 5 వ తేదీ వరకు చూడాలని భావిస్తున్నారు.