అత్నూర్ పాఠశాలలో విద్యావలంటీర్ బోధన(ఫైల్)
జీతాల కోసం విద్యావలంటీర్ల ఎదురుచూపులు
పట్టించుకోని ప్రభుత్వం.. తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి
న్యాల్‌కల్: చాలీ చాలనీ వేతనాలు, అవి కూడా సమయానికి రాకపోవడంతో విద్యావలంటీర్ల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు నెలలుగా వేతనాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. వచ్చే కొద్ది జీతం కూడా సమయానికి రావడం లేదని ఫలితంగా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు.
కుటుంబ పోషణ కోసం ఇతరుల వద్ద అప్పులు చేయవలసి వస్తుందని కన్నీంటి పర్యంతమవుతున్నారు. తమ వేతనాలు ఎప్పడు వస్తాయని అధికారులను అడిగితే త్వరలో వస్తాయని చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఇవ్వలేదని విద్యావలంటీర్లు చెబుతున్నారు.
మండలంలో 62 మంది టీచర్లు మాత్రమే..
మండలంలో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం చెందిన ఎనిమిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు,, 44 ప్రాథమిక పాఠశాలలు పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 5950 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 155 మంది ఉపాధ్యాయులు ఉండాలి కానీ, 62 మంది మాత్రమే ఉన్నారు.
93కు పైగా ఖాళీలు ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. ఖాళీలలను విద్యావలంటీర్లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం గత జూన్‌లో తొలి విడతగా 30 మందిని, 63 మందిని జూలైలో నియమించింది. దీంతో ఆయా పాఠశాలల్లో బోధన సమస్య తొలగిపోయింది.
అయితే విద్యావలంటీర్ల నియామకం జరిగి ఆరు నెలలు గడిచినా వారికి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యావలంటీర్లుగా ప్రభుత్వం ఉపాధి మార్గంచూపిందని సంతోషపడిన వీరికి వేతనాల రూపంలో కొత్త సమస్య వెటాండుతోందని వాపోతున్నారు. కుటుంబానికి ఆర్థికంగా కొంత అండగా ఉంటామనుకున్నవారికి నిరాశే ఎదురవుతోంది.
అంతేకాకుండా మరింత భారంగా మారామని కన్నీటి పర్యంత మవుతున్నారు. ఇచ్చేకొద్ది జీతం కూడా సమయానికి ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలతో బోధనపై దృష్టిపెట్టలేకపోతున్నారని విద్యావేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన ఎంత అవసరమో విద్యావలంటీర్ల సంక్షమం కూడా అంతేఅవసరమని గుర్తించాలంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
ఇప్పటి వరకు వేతనం రాలేదు
పాఠశాలలో పని చేస్తున్నప్పటి నుంచి ఇంత వరకు ఒక నెల జీతం కూడా రాలేదు. ఎప్పుడొస్తాయనే విషయం కూడా సరిగ్గా ఎవరు చెప్పడం లేదు. అందరు వస్తాయనే చెబుతున్నారు కానీ ఎప్పుడొస్తాయో తెలియదంటున్నారు. ఇచ్చే కొద్ది జీతం కూడా సమయానికి రాక అవస్థలు పడుతున్నాం. - హంస, విద్యావలంటర్, అత్నూర్
కుటుంబ పోషణ భారంగా మారింది
ప్రభుత్వం సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబపోషణ కూడా భారంగా మారింది. ఇచ్చే కొద్ది జీతం కూడా సమయానికి ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని వేతనాలు అందేలా చూడాలి. - నాగేష్, విద్యావలంటర్, టేకూర్
ప్రభుత్వానికి నివేదికలు పంపాం
మండలంలో పనిచేస్తున్న విద్యావలంటీర్ల వివరాలను ప్రభుత్వానికి పంపాం. వేతనాలు ఎప్పుడొస్తాయనే విషయం తెలియదు. వారి వేతనాలు నేరుగా వారి ఖాతాలోనే వేస్తారు. నాలుగు నెలల వేతనాలు రావలసి ఉంది. బహుశ ఈనెలఖారుకు రావచ్చు. - మారుతి రాథోడ్, ఎంఈఓ, న్యాల్‌కల్