Nyalkal
-
సోనూసూద్‌పై ప్రేమతో టీవీ పగలగొట్టిన బుడ్డోడు.. నటుడి స్పందన
సాక్షి, న్యాల్కల్(జహీరాబాద్): తన అభిమాన హీరో సోనూసూద్‌ను సినిమాలో కొట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ బుడతడు టీవీని పగుల గొట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. న్యాల్కల్లోని ఎస్సీ కాలనీకి చెందిన పుష్పలతకు సూర్యపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సీహెచ్ ప్రణయ్‌కుమార్‌తో ఎనమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారి కుమారుడు విరాట్ హుజూర్‌నగర్‌లోని శ్రీచైత్య స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా పాఠశాలలు మూత పడడంతో ఇటీవల న్యాల్కల్కు వచ్చాడు. సోమవారం రాత్రి ఇంట్లో మరదలు అద్విన్‌తో కలిసి టీవీలో దూకుడు సినిమా చూస్తున్నాడు. ఈ క్రమంలో హీరో మహేశ్‌బాబుకు విలన్ సోనూసూద్ మధ్య ఫైటింగ్ సీన్ జరుగుతుంది. సోనూసూద్‌ను కొట్టడాన్ని చూసిన బుడతడు విరాట్‌కు కోపం వచ్చింది. కరోనా టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్ అంకుల్ని కొడతావా అంటూ బయటకు వెళ్లి ఓ రాయిని తెచ్చి టీవీపై కోపంతో కొట్టాడు. దీంతో టీవీ పగిలిపోయింది. పక్కనే సినిమా చూస్తున్న మరదలు అద్విన్ టీవీని పగుల గొడతావా? ఇంకో టీవీ తీసుకరా అంటూ ఏడవ సాగింది. గమనించిన కుటుంబ సభ్యులు టీవీని ఎందుకు పగుల గొట్టావురా అంటూ విరాట్‌ను నిలదీశారు. అందరికీ సాయం చేస్తున్న సోనూసూద్ అంకుల్‌ను వేరే వాళ్లు కొడుతుంటే కోపం వచ్చి రాయితో కొట్టాను అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఈ విషయం కాస్తా అందరికి తెలియడంతో వైరల్‌గా మారింది. విరాట్ టీవీ పగలగొట్టిన ఘటన చివరికి సోనూసూద్‌ను చేరడంతో ట్విటర్లో స్పందించాడు. ‘అరేయ్.. మీ టీవీ పగలగొట్టకు.. మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు’ అంటూ ట్వీట్ చేశాడు. -
అదృశ్యమైన విద్యార్థి.. శవమయ్యాడు
సాక్షి, న్యాల్కల్(జహీరాబాద్): అదృశ్యమైన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని మిర్జాపూర్(బి)లో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్సై బాలస్వామి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు కుమారుడు శ్రీనివాస్ (20)జహీరాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 4న (సోమవారం) సెలవురోజు కావడంతో కళాశాలకు వెళ్లలేదు. ఉదయం ఇంటి వద్దే ఉన్న శ్రీనివాస్ మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. చుట్టు పక్కల, బంధువులు, మిత్రులు దగ్గర వెతినా ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనివాస్ తండ్రి రాములు 5న హద్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గ్రామానికి చెందిన అంబిక వ్యవసాయ పొలం వద్ద బావిలో అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ఉదయం అదే గ్రామానికి చెందిన ఆనంద్ పొలానికి వెళ్లగా బావిలో శ్రీనివాస్ శవమై కనిపించాడు. ఈ విషయాన్ని ఆనంద్ మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న హద్నూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బావిలోంచి శ్రీనివాస్ మృతదేహన్ని వెలికి తీసి పంచనామ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి శ్రీనివాస్ మృతికి ప్రేమ వ్యవహరమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై బాలస్వామి వెల్లడించారు. -
వేతనజీవుల వెతలు
జీతాల కోసం విద్యావలంటీర్ల ఎదురుచూపులు పట్టించుకోని ప్రభుత్వం.. తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి న్యాల్కల్: చాలీ చాలనీ వేతనాలు, అవి కూడా సమయానికి రాకపోవడంతో విద్యావలంటీర్ల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు నెలలుగా వేతనాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. వచ్చే కొద్ది జీతం కూడా సమయానికి రావడం లేదని ఫలితంగా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. కుటుంబ పోషణ కోసం ఇతరుల వద్ద అప్పులు చేయవలసి వస్తుందని కన్నీంటి పర్యంతమవుతున్నారు. తమ వేతనాలు ఎప్పడు వస్తాయని అధికారులను అడిగితే త్వరలో వస్తాయని చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఇవ్వలేదని విద్యావలంటీర్లు చెబుతున్నారు. మండలంలో 62 మంది టీచర్లు మాత్రమే.. మండలంలో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం చెందిన ఎనిమిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు,, 44 ప్రాథమిక పాఠశాలలు పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 5950 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 155 మంది ఉపాధ్యాయులు ఉండాలి కానీ, 62 మంది మాత్రమే ఉన్నారు. 93కు పైగా ఖాళీలు ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. ఖాళీలలను విద్యావలంటీర్లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం గత జూన్‌లో తొలి విడతగా 30 మందిని, 63 మందిని జూలైలో నియమించింది. దీంతో ఆయా పాఠశాలల్లో బోధన సమస్య తొలగిపోయింది. అయితే విద్యావలంటీర్ల నియామకం జరిగి ఆరు నెలలు గడిచినా వారికి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యావలంటీర్లుగా ప్రభుత్వం ఉపాధి మార్గంచూపిందని సంతోషపడిన వీరికి వేతనాల రూపంలో కొత్త సమస్య వెటాండుతోందని వాపోతున్నారు. కుటుంబానికి ఆర్థికంగా కొంత అండగా ఉంటామనుకున్నవారికి నిరాశే ఎదురవుతోంది. అంతేకాకుండా మరింత భారంగా మారామని కన్నీటి పర్యంత మవుతున్నారు. ఇచ్చేకొద్ది జీతం కూడా సమయానికి ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలతో బోధనపై దృష్టిపెట్టలేకపోతున్నారని విద్యావేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన ఎంత అవసరమో విద్యావలంటీర్ల సంక్షమం కూడా అంతేఅవసరమని గుర్తించాలంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు వేతనం రాలేదు పాఠశాలలో పని చేస్తున్నప్పటి నుంచి ఇంత వరకు ఒక నెల జీతం కూడా రాలేదు. ఎప్పుడొస్తాయనే విషయం కూడా సరిగ్గా ఎవరు చెప్పడం లేదు. అందరు వస్తాయనే చెబుతున్నారు కానీ ఎప్పుడొస్తాయో తెలియదంటున్నారు. ఇచ్చే కొద్ది జీతం కూడా సమయానికి రాక అవస్థలు పడుతున్నాం. - హంస, విద్యావలంటర్, అత్నూర్ కుటుంబ పోషణ భారంగా మారింది ప్రభుత్వం సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబపోషణ కూడా భారంగా మారింది. ఇచ్చే కొద్ది జీతం కూడా సమయానికి ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని వేతనాలు అందేలా చూడాలి. - నాగేష్, విద్యావలంటర్, టేకూర్ ప్రభుత్వానికి నివేదికలు పంపాం మండలంలో పనిచేస్తున్న విద్యావలంటీర్ల వివరాలను ప్రభుత్వానికి పంపాం. వేతనాలు ఎప్పుడొస్తాయనే విషయం తెలియదు. వారి వేతనాలు నేరుగా వారి ఖాతాలోనే వేస్తారు. నాలుగు నెలల వేతనాలు రావలసి ఉంది. బహుశ ఈనెలఖారుకు రావచ్చు. - మారుతి రాథోడ్, ఎంఈఓ, న్యాల్కల్ -
మంచినీటి కోసం ఆందోళన
న్యాల్కల్ బస్‌స్టాండ్ వద్ద మహిళల బైఠాయింపు న్యాల్కల్: నెలరోజులుగా మంచినీటి సమస్యను పరిష్కరించాలని నాయకులు, అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన న్యాల్కల్ మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం ఖాళీబిందెలతో న్యాల్కల్ ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్న బీసీ కాలనీ మహిళలు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీసీ కాలనీల్లో తాగునీరు లేకపోవడంతో బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నామని, బోర్ల యజమానులు కొన్నిసార్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. గంట పాటు రోడ్డుపై ఆందోళన చేయడంతో నారాయణఖేడ్, జహీరాబాద్, బీదర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నాయకుల హామీతో ఆందోళన విరమించారు. న్యాల్కల్ రోడ్డుపై బైఠాయించిన బీసీ కాలనీ మహిళలు, స్థానికులు -
పెసర రైతును ముంచిన వాన
న్యాల్కల్: ఆరు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు పెసర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి ప్రకోపంతో ప్రతిఏటా రైతులకు నష్టాలు తప్పడం లేదు. అతివృష్టి, అనావృష్టి ఫలితాలతో పంటలు దెబ్బతింటున్నాయి. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు జాడ లేకపోవడం, తీరా పంట చేతి వచ్చే సమయంలో ఏకధాటిగా వానలు కురవడం వల్ల అన్నదాతలు కష్టాల పాలవుతున్నారు. నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలోని రైతులు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న సాయం పెట్టుబడులకు కూడా సరిపోవడం లేదు. మండలంలో ప్రస్తుతం పెసర పంట చేతి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యంగా కురవరడంతో రైతులు విత్తనాలను కూడా ఆలస్యంగా వేశారు. పం టలు వేసుకునే సమయం మించి పోవడంతో పంటలు అవుతాయో లేదోననే సందేహంతో రైతులు కొన్ని రకాల పంటలను తక్కువ విస్తీర్ణంలో విత్తుకున్నారు. మండలంలో ఖరీఫ్‌లో 13వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అధికంగా పత్తి పంటను సాగు చేసుకోగా మిగతాది పెసర, మినుము, సోయా, జొన్న తదితర పంటలను సాగు చేసుకున్నారు. పెరస పంట సాధారణ సాగు విస్తీర్ణం 4వే ల హెక్టార్లు కాగా వర్షాభావ పరిస్థితుల కా రణంగా మండలంలో ఈ సారి 1,850 హెక్టార్లలో మాత్రమే సాగు చేసుకున్నారు. ప్రస్తుతం చేతికి వచ్చిన పెసర పంటను రాసులు చేసుకుం దామనుకుంటే ఆరు రోజులుగా నిత్యం వర్షం పడుతుండడంతో పంట దెబ్బతిం టోంది. ఎంతో కొంత ఏరిన పంట కూడా వర్షానికి తడిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెసర పంటకు మార్కెట్లో మద్దతు ధర క్వింటాలుకు రూ.6వేల పైచిలుకు ఉండడంతో రైతులు పంటపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వీడని వ ర్షం రైతుల పాలిట శాపంగా మారింది. వరు ణుడు శాంతించాలని వీరు కోరుతున్నారు. -
విస్తరిస్తున్న సోయా
న్యాల్కల్: పప్పు ధాన్యాల సాగులో ప్రత్యేకమైనది సోయాబీన్. నల్లరేగడి భూముల్లో ఈ పంట మంచి దిగుబడులు ఇస్తుంది. ఇతర పప్పు ధాన్యాల పంటలతో పోలిస్తే ఎంతో లాభదాయకమైనది. మంచి పోషకాలున్న జె.ఎస్.335 రకం పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో నాలుగేళ్లుగా సోయాబీన్ పంట సాగు విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. ఈ ఏడాది 6,232 హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు రాబట్టవచ్చని బసంత్‌పూర్-మామిడ్గి ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్, సెల్: 9849535756 వివరించారు. ఎకరం పంట సాగు చేయడానికి రూ.15,000నుంచి రూ.20,000 వరకు ఖర్చు వస్తుందన్నారు. 14 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి తీయవచ్చని తెలిపారు. దీని ధర క్వింటాలుకు రూ.3,5000 నుంచి 4,000 వరకు పలుకుతుందని తెలిపారు. సోయా సాగుపై ఆయన అందించిన సలహాలు, సూచనలు... నీటి యాజమాన్య పద్ధతులు సోయా వర్షాధార పంట. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నియోజకవర్గంలోని రైతులు సాగు చేసిన పంటలకు నీటి అవసరం లేదు. పూత దశలో ఉన్న పంటకు సరిపడా వర్షం కురిసింది. కాయ దశలోకి వచ్చిన తర్వాత వర్షం పడితే నీటి తడులు అవసరం లేదు. కలుపు నివారణ... సమస్యాత్మకమైన గడ్డిని నివారించేందుకు 200 లీటర్ల నీటిలో 250 మిల్లీలీటర్ల ఇమేజారియా మందును కలిపి గడ్డి జాతి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పంటకు సోకే తెగుళ్లు... దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు, కాండం తినే పురుగు, కాండం తొలిచే పురుగు దాసరి పురుగు ఈ పురుగులు లేత గోధుమ రంగులో ఉండే ఈ పురుగులు ఆకులపై గుడ్లు పెడతాయి. ఇవి లద్దె పురుగులుగా మారి ఆకులకు రంధ్రాలు చేసి తింటూ పంటను నష్టపరుస్తాయి. నివారణ... మొదటి దశ లార్వాను గుర్తించి 5 మిల్లీలీటర్ల వేప నూనెను లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఎకరాకు 400 గ్రాముల బాక్టీరియా సంబంధిత మందులు వాడాలి ఎకరా పొలంలో 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును కలిపి పంటపై స్ప్రే చేయాలి. పొగాకు లద్దె పురుగు ఇవి ఆకులపై కుప్పలు కుప్పలుగా గుడ్లు పెడతాయి. పొదిగిన పిల్ల పురుగులు పచ్చని ఆకులను తింటాయి. లేత ఆకులను తిగనడంతో పాటు పువ్వులు, కాయలకు కూడా నష్టాన్ని కలుగజేస్తాయి. తెలుపు బూడిద రంగుల్లో ఉండే ఈ పురుగులు రాత్రి వేళ్లలో పంటలను తింటూ పగటి వేళ్లలో మొక్కల మొదళ్ల వద్ద ఉంటాయి. నివారణ... ఆకులపై గుడ్లు కనిపించిన వెంటనే వాటిని నాశనం చేయాలి. లార్వాలు ఉన్న ఆకులను తొలగించి దూరంగా పారేయాలి. పురుగులు తినే పక్షులను ఆకర్షించేందుకు పొలంలో టీ ఆకారంలో కర్రలు ఏర్పాటు చేసుకోవాలి. తొలి, మలి దశలో చేనుల్లో వేప నూనె పిచికారీ చేయాలి. లీటర్ నీటిలో 2.5 క్లోరోఫైరిపాస్ లేదా 1.6 మి.లీ. మోనోక్రొటోఫాస్ లేదా1 గ్రాము ఎసిపేట్ మందును స్ప్రే చేయాలి. కాండం తొలిచే పురుగు ఈ పురుగుకు సంబంధించిన తల్లి ఈగలు నలుపు రంగులో మెరుస్తూ ఆకుల మీద గుడ్లను పెడతాయి. పొదిగిన లార్వాలు ఆకు కాడల ద్వారా కాండంలోకి ప్రవేశించి కాండం లోపలి పదార్థాల నుంచి వేర్ల వరకు తినేస్తాయి. ఈ పురుగుల వలన 25శాతం వరకు పంట నష్టం కలుగుతుంది. నివారణ... రక్షణ కొరకు తొలి దశలో 10 గ్రాము ఫోరేట్ లేదా 3గ్రాముల కార్బోఫ్యురాన్ గుళికలను పొలంలో చల్లుకోవాలి. లీటర్ నీటిలో 1.6మిల్లీ లీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 1.5గ్రాముల ఎసిఫేట్ లేదా 2మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పెంకు పురుగు ఈ పురుగు కాండం మీద అర్ధ చంద్రాకారంలో రంధ్ర చేసి లోపలకు వెళ్తుంది. ఆడ పెంకు పురుగు కాండం మీద చుట్టూ రంధ్రాలు చేస్తుంది. ఫలితంగా చిగురు భాగానికి పోషకాలు అందక మొక్క ఎండిపోతుంది. రంధ్రాల్లో పెట్టిన గుడ్లు పొదగబడి లార్వాగా మారుతుంది. ఈ లార్వా కాండాన్ని తొలిచి తినుకుంటూ మొక్కలకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. నివారణ... చిగురులు ఎండిపోతున్న మొక్కలను పొలంలోంచి పీకేయాలి. ఇలా చేయడం వల్ల పురుగు ఉధృతిని కొంత వరకు అరికట్టవచ్చు. లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ లేదా 1.6మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 2.0మి.లీ ట్రైజోఫౠస్ మందును కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి.