ప్లీజ్ చేరండి..!
విధుల్లో చేరని ఎంపికైన విద్యావలంటీర్లు
పూర్తిస్థాయిలో భర్తీకాని వీవీ పోస్టులు
ఈనెల 5 వరకు అవకాశం
హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యావలంటీర్ల(వీవీ) నియామక ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టినా.. దాదాపు వంద పోస్టులు ఖాళీగా ఉండడం ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ జిల్లాలో 386 వీవీల నియామకానికి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 111 స్కూల్ అసిస్టెంట్లు, 275 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎన్నడూలేనంతగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 1,800 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోగా, ఇందులో వెయ్యి మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అయింది. ఉన్న పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అభ్యర్థుల తుది జాబితాను విద్యాశాఖ ప్రకటించింది. వీరి చేరిక ఇక లాంఛనమేనని.. ఇక విద్యాబోధనకు జిల్లాలో ఎటువంటి ఇబ్బంది ఉండబోదని విద్యాశాఖాధికారులు సంబరపడ్డారు. పోస్టులకు సరిపడా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఎంపికైన అభ్యర్థులందరూ ఒకటి రెండు రోజుల్లోగా తమకు కేటాయించిన పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చేరింది 287 మందే...
ఎంపికైన జాబితాలో మొత్తం 386 మంది అభ్యర్థులు ఉండగా.. వీరిలో ఇప్పటివరకు 287 మంది మాత్రమే ఆయా పాఠశాలల్లో రిపోర్ట్ చేశారు. తద్వారా 69 ఎస్‌ఏలు, 218 ఎస్‌జీటీ పోస్టులు భర్తీ అయ్యాయి. మిగిలిన 99 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చి దాదాపు 10 రోజులవుతోంది. వాస్తవంగా గతనెల 24, 26 తేదీల్లో స్కూళ్లలో రిపోర్ట్ చేస్తారని అధికారులు భావించగా.. రిపోర్ట్ చేసిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో అధికారుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. నగరంలో జీవన వ్యయం అధికంగా ఉండడం, వీవీ పోస్టులకు ప్రభుత్వం ఇస్తున్న వేతనం తక్కువగా ఉండడం, ఇప్పుడిప్పుడే టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతుండడం, పోటీ పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధం అవుతుండడం తదితర అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు ఈ నెల 5 వ తేదీ వరకు చూడాలని భావిస్తున్నారు.