
యూఎస్‌టీఎం చాన్స్‌లర్ అరెస్ట్
గౌహతి: పరీక్షల్లో అక్రమాలకు ఊతమిచ్చారన్న ఆరోపణలపై యూనివర్సిటీ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మేఘాలయ(యూఎస్‌టీఎం) చాన్స్‌లర్ మహబూబుల్ హక్ అరెస్టయ్యారు. అస్సాంలోని షిభుమి జిల్లాకు చెందిన ఓ కోర్టు శనివారం రాత్రి హక్‌తోపాటు, కరీమ్‌గంజ్ జిల్లా పత్తర్‌కండిలోని ఓ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను కూడా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు పోలీసులు గౌహతిలోని నివాసంలో ఉన్న హక్‌ను శనివారం అదుపులోకి తీసుకుని షిభుమికి తరలించారు. యూఎస్‌టీఎం చాన్స్‌లర్‌గా ఉన్న హక్ ఈఆర్‌డీ అనే ఫౌండేషన్ ద్వారా ఎన్నో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఇందులో పత్తర్‌కండిలోని స్కూలు కూడా ఉంది. ఇతర జిల్లాలకు చెందిన సీబీఎస్‌ఈ విద్యార్థులను ఎక్కువ మార్కులు వచ్చేలా ప్రిపేర్ చేస్తామంటూ ఈ స్కూలుకు తీసుకువచ్చారు. వీరు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు పథకం వేశారంటూ శుక్రవారం నుంచి అక్కడ వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లతోపాటు చాన్స్‌లర్ హక్ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది.
ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ..దీని వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందన్నారు. సీబీఎస్‌ఈలోనే కాకుండా, మెడికల్ ఎంట్రన్స్‌లోనూ ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘యూఎస్‌టీఎం చాన్స్‌లర్ హక్ పెద్ద ఫ్రాడ్, ఆయన జీవితమే ఫ్రాడ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హక్ దొడ్డిదారిన పొందిన ఓబీసీ సరి్టఫికెట్ తర్వాత రద్దయిందని చెప్పారు. అస్సాం–మేఘాలయ సరిహద్దుల్లో ఉన్న యూఎస్‌టీఎం క్యాంపస్ కారణంగా గౌహతి నగరానికి వరద ముప్పు పెరిగిందంటూ సీఎం శర్మ గతంలోనే ఆరోపణలు చేయడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment