దసరా సెలవుల్లో టీచర్ల బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల్లో టీచర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. అలాగే ప్రస్తుత విద్యా విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు, రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను హేతుబద్ధీకరించేందుకు(రేషనలైజేషన్) తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే బదిలీలు ఉంటాయని విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. పిల్లలున్నా ఉపాధ్యాయుల కొరత ఉన్న స్కూళ్లలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రేషనలైజేషన్ ప్రక్రియను దసరా సెలవుల్లో చేపడతామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలు, విధాన నిర్ణయాలపై ఆయా సంఘాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వివిధ అంశాలపై మంత్రి స్పష్టతనిచ్చారు.
దసరాలోపే ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. వారం రోజుల్లో ముసాయిదాను సిద్ధం చేస్తామన్నారు. ఎంఈఓ/డిప్యూటీ ఈఓ/డైట్ లెక్చరర్ /జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. 2013లో బదిలీ అయినప్పటికీ ఇప్పటికీ పాత స్థానాల్లోనే పనిచేస్తున్న టీచర్లను రిలీవ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అవసరాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్ , మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ, పీఆర్‌టీయూ-తెలంగాణ, యూటీఎఫ్, ఎస్టీయూ, తెలుగునాడు, బీటీఏ, పండిత పరిషత్తు తదితర ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, రవి, రాజిరెడ్డి, ధమనేశ్వర్‌రావు, రామసుబ్బారావు, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
వచ్చే ఏడాదిలో ప్రతి పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ సెక్షన్ల ఏర్పాటు. కేజీ టూ పీజీలో భాగంగా చర్యలు.
9, 10 తరగతుల్లో సంస్కరణల అమలు. ఇందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ.
పదో తరగతి పరీక్షల వార్షిక ఫీజు మినహాయింపునకు ఆదాయ పరిమితిని రూ. 24 వేల నుంచి రూ. లక్షకు పెంపు.
ఉపాధ్యాయులకు పదవీ విరమణ సమయంలో 300 రోజుల హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పునరుద్ధరణ.
డివిజన్ స్థాయిలో ఉన్న డిప్యూటీ ఈవోలను ఇకపై తాలూకాకు ఒకరు చొప్పున నియామకం
ఉన్నత పాఠశాలల్లోని భాషా పండితులు, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు చర్యలు.
ఉపాధ్యాయులను బోధనేతర పనులకు పంపించరాదని ఆదేశం.
మార్పు చేసిన బడి వేళలు అమలు చేయాల్సిందే.
ప్రాథమికోన్నత స్కూళ్ల బడివేళల పరిశీలన.
15 రోజుల్లో అన్ని స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు అందేలా చర్యలు.
ఇంగ్లిష్ సబ్జెక్టులోని కఠిన పాఠ్యాంశాల తొలగింపునకు చర్యలు.
రెండో తరగతి నుంచే హిందీ సబ్జెక్టు అమలుకు పరిశీలన.
పదో తరగతిలో ఒక పేపర్‌గా ఉన్న హిందీని రెండు పేపర్లుగా మార్చి వచ్చే విద్యా సంవత్సరంలో అమలుకు చర్యలు.
బడి వేళలు పెరిగినందున సాయంత్రం వేళలో విద్యార్థులకు అల్పాహారం, పాలు ఇచ్చేందుకు యోచన. సీఎంతో చర్చించాక తుది నిర్ణయం.
రేషనలైజేషన్ తర్వాతే డీఎస్సీ
రాష్ర్టవ్యాప్తంగా స్కూళ్లలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తయిన తర్వాత పోస్టుల ఖాళీలను పరిశీలించి డీఎస్సీ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారు. రేషనలైజేషన్ తర్వాత మిగిలే పోస్టులు, గతంలో డీఎస్సీ కోసం గుర్తించిన ఖాళీలు, తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉపాధ్యాయులు పనిచేస్తున్న స్థానాలు వంటి పలు అంశాలపై స్పష్టత వచ్చాక, డీఎస్సీ నిర్వహణపై అక్టోబర్‌లో నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డీఎస్సీలో పరిగణనలోకి తీసుకునే సిలబస్‌పై కూడా అప్పుడే నిర్ణయం తీసుకుంటామన్నారు. టెట్‌పై సీఎంతో చర్చించాకే నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి వివరించారు.