MEOs
-
నిరంతర పరిశీలన: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబుల్లో ఎలాంటి సమస్య తలెత్తినా వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలని, లేదా కొత్త ట్యాబును అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ట్యాబుల ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న తీరుపై డేటా అనలిటిక్స్ ద్వారా నిరంతర పరిశీలన ఉండాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా హెడ్ మాస్టర్, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల విద్యా శాఖ కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్యాబుల పంపిణీ పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ట్యాబుల (నిర్వహణ) మెయింటెనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ట్యాబుల వాడకం.. దాని ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న తీరు, తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా ఐఎఫ్పి ప్యానెల్స్ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్) ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యల గురించి సీఎంకు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటు కావాలని, 6–10 తరగతుల విద్యార్థులందరికీ ఇవి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్ల వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలని, వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన కలిగేలా శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పిల్లలందరికీ డిక్షనరీలు ఇవ్వాలి – పిల్లలు అందరి వద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలించండి. లేని పిల్లలు అందరికీ వచ్చే విద్యా సంవత్సరం విద్యా కానుకతో కలిపి ఇవ్వాలి. ఇందు కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యా కానుక అందాలి. – పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలి. ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుంది. తద్వారా విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగు పడుతుంది. డీఎస్సీ–98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలి. – గోరుముద్ద నాణ్యతను నిరంతరం పరిశీలించాలి. ఫిబ్రవరి 1 నుంచి వారంలో మూడు రోజులు పిల్లలకు బెల్లంతో తయారు చేసిన రాగి మాల్ట్ ఇవ్వాలి. అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే సరఫరా చేయాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు. ఇప్పటికే సరఫరా.. – ప్రత్యేక లేబుల్‌తో సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, అన్ని గురుకుల పాఠశాలలు హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. – 22 వేలకుపైగా స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ పనులు నడుస్తున్నాయని, ఇప్పటికే దాదాపు రూ.1,500 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వివరించారు. – ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఇంటర్ మీడియట్ విద్య కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల మౌలిక వసతులు కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ జీ వీరపాండ్యన్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, నాడు–నేడు డైరెక్టర్ (టెక్నికల్) మనోహర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ (పాఠశాల విద్యా శాఖ) ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్కూలు పిల్లలకు ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా పిబ్రవరి 1వ తేదీ నుంచి వారానికి మూడు రోజులు బెల్లంతో తయారు చేసిన రాగి మాల్ట్ గ్లాసుడు చొప్పున ఇవ్వాలి. ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.50 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. నాడు– నేడు కింద బాగు చేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలి. ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ (స్కూల్, టాయ్‌లెట్ నిర్వహణ నిధి) నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలి. – సీఎం వైఎస్ జగన్ -
పర్యవేక్షణ అధికారుల్లేక పరేషాన్
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యశాఖలో ఏళ్ల తరబడి పర్యవేక్షక అధికారుల కొరత పీడిస్తోంది. 30 లక్షలమంది విద్యార్థులు, లక్ష మందికిపైగా సిబ్బంది ఉన్న పాఠశాల విద్యా వ్యవస్థలో పలు మండలాలకు ఎంఈవో, కొన్ని జిల్లాలకు డీఈవోలు లేరు. ప్రధానోపాధ్యాయులకే ఎంఈ వో పోస్టులు తాత్కాలికంగా అప్పగిస్తున్నారు. పలువురు ఎంఈవోలను అదనపు మండలాలకు సర్దుబాటు చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం స్కూళ్లు మొదలైన నాటి నుంచి ప్రతీ అంశాన్ని పర్యవేక్షించడం, అవసరమైన నివేదికలు తయారు చేసి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మండల, జిల్లాస్థాయి అధికారుల పాత్ర కీలకం. ఇంగ్లిష్ మీడియం బోధన మొదలైనా పర్యవేక్షక అధికారుల కొరత వల్ల ఇప్పటివరకూ క్షేత్రస్థాయి నివేదికలు ఉన్నతాధికారులకు అందలేదని తెలుస్తోంది. 317 జీవోకు ముందు జిల్లా, జోన్లుగా రెండంచెల వ్యవస్థ ఉండేది. జీవో అమలులోకి వచ్చిన తర్వాత జిల్లా, జోన్, మల్టీజోన్లుగా మూడంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారులు, డైట్ లెక్చరర్ల పోస్టులన్నీ మల్టీజోన్ క్యాడర్ పోస్టులుగా ఉన్నాయి. వీటన్నింటి నిర్వహణకు మల్టీ జోన్‌స్థాయి అధికారి పోస్టులు ఉండాలని టీచర్ల సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఏడు జోన్లకు పాలన వ్యవహారాలు నిర్వహించడానికి ఏడుగురు జాయింట్ డైరెక్టర్(జేడీ) స్థాయి అధికారులు అవసరం కాగా, ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అత్యంత కీలకమైన పరీక్షల విభాగం, ఎస్సీఈఆర్టీ, ఓపెన్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, సైట్, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గ్రంథాలయాలు, పాఠ్యపుస్తకాలు, పబ్లిక్ స్కూల్స్, జవహర్ బాలభవన్ వంటి విభాగాల నిర్వహణకు అధికారులుంటేనే వ్యవస్థలో లోపాలను సరిచేయవచ్చని సూచిస్తున్నారు. కేజీబీవీల్లో ఇద్దరు, మోడల్ స్కూల్స్ విభాగం, ఓపెన్ స్కూల్స్‌లో ఒకరు చొప్పున జాయింట్ డైరెక్టర్లున్నారు. మిగిలిన విభాగాల్లో ఏడీ పోస్టు కానీ, పూర్తిస్థాయిలో డీడీ పోస్టులు లేవు. ఎంఈవోలు... డీఈవోలు ఎక్కడ? ఇప్పటికీ 12 జిల్లాలకే డీఈవోలున్నారు. 21 జిల్లాల్లో డీఈవో పోస్టులు మంజూరు చేసినా భర్తీ చేయలేదు. 602 మండలాలను ఎడ్యుకేషన్ బ్లాకులుగా చేశారు. ప్రతీ బ్లాక్‌కు ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఇప్పుడున్న టీచర్లకు పదోన్నతులు కల్పిస్తే భర్తీ అవుతాయి. స్థానిక సంస్థల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఎక్కువ వున్నారని, కాబట్టి తమకే ఎంఈవోలు కావాలని పంచాయతీరాజ్ విభాగం టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో నేరుగా నియమించిన ఉపాధ్యాయులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ పోస్టులు దక్కించుకునే అర్హత తమకే ఉందని చెబుతున్నారు. ఈ కారణంగానే హెచ్ఎంల పదోన్నతి ప్రతి ఏటా వాయిదా పడుతూ వస్తోంది. పదోన్నతులు, బదిలీలు లేకపోవడంతో కొంతమంది ఎంఈవోలకు 6 నుంచి 8 మండలాలు ఎంఈవో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో తమ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు దెబ్బతినే వీలుందని ఉపాధ్యాయులు అంటున్నారు. -
AP: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 679 ఎంఈఓ-2 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పాఠశాలల నిర్వహణ కోసం ఈ అదనపు ఎంఈవోల నియామకం చేపట్టారు. చదవండి: (మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం) -
ఉపాధ్యాయులను పీడిస్తున్న ఎంఈఓలు
ఆరోగ్యం బాగలేక ఎంప్లాయి హెల్త్ స్కీమ్ కింద ఉపాధ్యాయులు చికిత్స చేయించుకుంటే కొన్నింటికి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. మండల విద్యాశాఖాధికారి ఆ బిల్లులను శాంక్షన్ చేయించి సంబంధిత ఉపాధ్యాయులకు అందించాల్సి ఉంటుంది. బిల్లు చెల్లించే సమయంలో ఎంఈవోల నుంచి వినిపించే మాట ‘మాకేంటి?’ ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేసిన సమయంలో ఎరన్లీవ్, హాఫ్ డే లీవ్ వంటివి వస్తాయి. వాటికి సంబంధించిన బిల్లులన్నీ సంబంధిత మండల విద్యాశాఖాధికారి చేయాలి. ఉద్యోగ విరమణ సమయంలో ఉపాధ్యాయునికి పెద్ద మొత్తంలోనే వస్తుంటుంది. ఈ బిల్లు చేసిన తరువాత ఎంఈవోల నుంచి వినిపించే మాట ‘మాకేంటి?’ ప్రసవ సమయంలో టీచర్లు మెటర్నటీ లీవ్ పెట్టుకుంటారు. ఆరు నెలలు వారు ఇంటి వద్దే ఉంటూ పూర్తి జీతం తీసుకుంటారు. వీరికి ఎంఈవోలే ప్రతినెలా జీతం బిల్లు చేస్తుంటారు. ఆ సమయంలోనూ వినిపించే మాట ‘మాకేంటి?’ అవకాశం వచ్చినప్పుడల్లా ఎంఈవోలు ఉపాధ్యాయుల నుంచి డబ్బు ఎలా డిమాండ్ చేస్తున్నారో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కొన్నిచోట్ల రిక్వెస్ట్, మరి కొన్నిచోట్ల డిమాండ్ చేస్తూ పర్సంటేజీలు పుచ్చుకోవడం వారికి పరిపాటిగా మారింది. సాక్షి, ఒంగోలు టౌన్: బిల్లులు చేసే విషయంలో మండల విద్యాశాఖాధికారులు విసిగిస్తున్నారని కొన్ని మండలాలకు చెందిన ఉపాధ్యాయులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి బిల్లు పెద్ద మొత్తంతో కూడుకొని ఉంటోంది. ఆ బిల్లులను సంబంధిత మండల విద్యాశాఖాధికారులు తమ విధుల్లో భాగంగా చేయాల్సి ఉంటుంది. అయితే ఆ బిల్లులు పెద్ద మొత్తంలో కనిపిస్తుండటంతో కొందరు అధికారులు వాటిపై కన్నేస్తున్నారు. తాజాగా ఉలవపాడు మండల విద్యాశాఖాధికారి ఇలాంటి బిల్లుల విషయంలో డబ్బులు డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఉదంతంతో అలాంటి ప్రవృత్తి కలిగిన మండల విద్యాశాఖాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటివరకు దర్జాగా డిమాండ్ చేసి బిల్లుల్లో పర్సంటేజీలు వసూలు చేసినవారు కంగుతింటున్నారు. ఇంకొందరు మాత్రం మమ్మల్ని ఎవరు ఏమి చేస్తారంటూ పాత రోత ధోరణినే కొనసాగిస్తూ ఉపాధ్యాయుల బిల్లుల్లో చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. విసిగిస్తున్నారు.. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద మెడికల్ బిల్లులు చేయాల్సి వస్తే కొంతమంది ఎంఈవోలు ఎగిరి గంతేస్తున్నారు. మెడికల్ బిల్లులకు సంబంధించి 50 వేల రూపాయల్లోపు అయితే మండల విద్యాశాఖాధికారి నుంచి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి, అక్కడ నుంచి రిమ్స్‌కు వెళ్లి అక్కడ అప్రూవల్ అయిన తర్వాత తిరిగి ఎంఈవో ద్వారానే సంబంధిత ఉపాధ్యాయునికి బిల్లు అందించడం జరుగుతోంది. రూ.50 వేలకు పైబడి వైద్యం చేయించుకుంటే ఆ బిల్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ అప్రూవల్ అయిన తర్వాత తిరిగి ఆ బిల్లును కూడా ఎంఈవో చేతుల మీదుగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు రకాల బిల్లుల విషయంలో తాము పర్సనల్‌గా చెప్పించడం వల్లనే ఈ బిల్లులు వచ్చాయని, అందుకు కొంతమందికి తాము శాంతి చేయాల్సి ఉన్నందున పర్సంటేజీలపై గట్టిగా పట్టుబటి వసూలు చేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జీతాలకు సంబంధించిన బిల్లుల విషయంలో కొందరు తమను జలగల్లా పట్టి పీడిస్తున్నారని, అలాంటి వారి ఆట కట్టించాలని ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు. మెయింటెనెన్స్ గ్రాంట్ ఉన్నా.. ప్రతి మండలంలో మండల రీసోర్స్ సెంటర్ ఉంది. ఇందులో మండల విద్యాశాఖాధికారి ఉంటారు. మండల రీసోర్స్ సెంటర్ నిర్వహణకు సంబంధించి ప్రతి ఏటా మెయింటెనెన్స్ గ్రాంట్ విడుదల చేయడం జరుగుతోంది. ఏడాదికి 80 వేల రూపాయల చొప్పున మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ఇంతకుముందు వరకు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఆ గ్రాంట్‌లో కొంత భాగం సంబంధిత ఎంఈవో మెయింటెనెన్స్‌కే సరిపోతోందన్నది బహిరంగ రహస్యమే. అది చాలదన్నట్లుగా తమకు రావలసిన బిల్లుల విషయంలో కూడా కొందరు ఎంఈవోలు మెయింటెయిన్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అదికాకుండా మండల రీసోర్స్ సెంటర్ డవలప్మెంటే పేరుతో పీఓపీ చేయించాలని, ఫ్లోరింగ్ వేయించాలని, కర్టన్స్ కొనుగోలు చేయాలంటూ కొంతమంది ఉపాధ్యాయుల నుంచి డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారు. అలాంటి మెయింటెనెన్స్ రాయుళ్ల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఉపాధ్యాయులు కోరుతుండటం గమనార్హం. ‘డబుల్’ పర్సంటేజీ.. జిల్లాలోని 56 మండలాలకు 56 మంది మండల విద్యాశాఖాధికారులు ఉండాలి. కానీ 17 మండలాలకు లేరు. పక్క మండలాల వారినే ఇన్ఛార్జిలుగా నియమించారు. బిల్లుల విషయంలో పర్సంటేజీలకు అలవాటుపడిన కొందరు ఇదే మాదిరిగా రెండు మండలాలను తమ కంట్రోల్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఒక్కో మండలంలో 50 నుంచి 100 వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు మండల విద్యాశాఖాధికారుల కంట్రోల్లో ఉంటాయి. ఆ మండలాల ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లుల విషయంలో తాము చెప్పిందే వేదం కావడంతో డబుల్ పర్సంటేజీలు పొందుతున్నారు. కొంతమంది మండల విద్యాశాఖాధికారుల పర్సంటేజీల బెడద పెరిగిపోవడంతో ఏసీబీ ద్వారా అలాంటి వారి ఆట కట్టించాలంటున్నారు ఉపాధ్యాయులు. -
డీవైఈఓ పోస్టుల భర్తీ ఎప్పుడో?
సాక్షి, ఒంగోలు టౌన్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పాఠశాల పనితీరును పర్యవేక్షించేందుకు డీవైఈఓలు కరువయ్యారు. జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీ ఎప్పుడా అని పలువురు ఉపాధ్యాయులు నేటికీ ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు, కందుకూరు, పర్చూరు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఉన్నాయి. ఒంగోలు ఉప విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న దయానందం ఈ ఏడాది జూన్ 30వ తేదీ ఉద్యోగ విరమణ చేశారు. కందుకూరు ఉప విద్యాశాఖాధికారి పోస్టు గత కొన్నేళ్ల నుంచి ఖాళీగా ఉండటంతో లక్ష్మయ్య ఇన్చార్జి ఉప విద్యాశాఖాధికారిగా నియమించారు. ఆయన ఏడాదిన్నర క్రితం ఉద్యోగ విరమణ చేశారు. పర్చూరు ఉప విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో రామ్మోహనరావును ఇన్చార్జి ఉప విద్యాశాఖాధికారిగా నియమించారు. ఆయన గత ఏడాది ఉద్యోగ విరమణ చేశారు. మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో కాశీశ్వరరావును నియమించారు. ఆయన గత ఏడాది ఉద్యోగ విరమణ చేశారు. జిల్లా విద్యాశాఖ పరిధిలోని కీలకమైన నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుత జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావుపై అదనపు బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదులపై నివేదిక ఇచ్చేదెవరు? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, ఉపాధ్యాయుల మధ్య వివాదాలు తలెత్తి ఫిర్యాదులు చేసుకున్నా, పాఠశాలలకు కేటాయించిన నిధులు దుర్వినియోగమైనా ఉప విద్యాశాఖాధికారి అక్కడకు వెళ్లి ఎంక్వయిరీ చేసి, అందుకు సంబంధించిన రిపోర్టును జిల్లా విద్యాశాఖాధికారికి అందించాల్సి ఉంటుంది. ఆ నివేదికను ఆధారం చేసుకుని జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు(జడ్జిమెంట్) తీసుకుంటారు. అయితే ప్రస్తుతం జిల్లాలోని నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులకు జిల్లా విద్యాశాఖాధికారే ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఏమైనా ఫిర్యాదులు వస్తే స్వయంగా డీఈఓ వెళ్లి ఎంక్వయిరీ చేసి, ఆ ఎంక్వయిరీపై జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వీస్ రూల్స్ లేకపోవడమే జిల్లాలో కీలకమైన ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీ గత కొన్నేళ్ల నుంచి నిలిచిపోయింది. అందుకు కారణం వారికి సంబంధించిన సర్వీస్ రూల్స్ లేకపోవడమే. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మధ్య ఆధిపత్య పోరు కూడా కీలకమైన ఇలాంటి పోస్టులకు విఘాతం కలిగిస్తోంది. సర్వీస్ రూల్స్‌కు సంబంధించి ఆ రెండు యాజమాన్యాలకు చెందినవారు ఒకరి తర్వాత ఒకరు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల విషయంలో నెలకొన్న రగడ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. అప్పటి ప్రభుత్వాల చేతులు దాటిపోయి చివరకు కోర్టుల వరకు వెళ్లడంతో కీలకమైన ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీపై ప్రభావం చూపుతోంది. విద్యాశాఖ మంత్రి జోక్యం తప్పనిసరి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఇన్చార్జిలను నియమించినప్పటికీ వారు జీత భత్యాల బిల్లులకు సంబంధించిన విషయాలకే ఎక్కువగా పరిమితమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో, జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. విజిట్స్..ఇన్స్పెక్షన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలలను క్రమం తప్పకుండా విజిట్స్, ఇన్స్పెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ► ప్రాథమిక పాఠశాలలు మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో ఉండగా, ఉన్నత పాఠశాలల పనితీరును ఉప విద్యాశాఖాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. ► ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో వసతులు సమకూరుతున్నాయా, వారికి పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించారా, మ«ధ్యాహ్న భోజనం సక్రమంగా అందుతుందా, విద్యార్థుల పాఠశాలలకు సక్రమంగా హాజరవుతున్నారా తదితరాలన్నింటిని ఉప విద్యాశాఖాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. ► అంతేగాక ఉన్నత పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు çసకాలంలో పాఠశాలలకు హాజరవుతున్నారా, తరగతులు ఏవిధంగా చెబుతున్నారు, విద్యార్థులకు పాఠ్యాంశాలు ఎలా బోధిస్తున్నారు తదితర వాటిని కూడా ఉప విద్యాశాఖాధికారులు చూడాల్సి ఉంటుంది. ► ఉన్నత పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయాలను పరిశీలించి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక అందించాల్సి ఉంటుంది. ► ఇక ఉన్నత పాఠశాలలకు విడుదలవుతున్న నిధులు సక్రమంగా వినియోగిస్తున్నారా, నిధులు సరిపోక ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయాలను కూడా తెలుసుకుని జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించడం జరుగుతుంది. వీటితోపాటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన సెలవులు, ఇంక్రిమెంట్లను కూడా ఉప విద్యాశాఖాధికారులే చూడాల్సి ఉంటుంది. -
‘అమ్మఒడి’తో ప్రతితల్లికీ రూ.15 వేల ఆర్థిక సాయం
సాక్షి, అనంతపురం అర్బన్: ‘‘విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ‘అమ్మఒడి’ పథకం ద్వారా రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో రూపురేఖలు మారనున్నాయి. ఉపాధ్యాయులు కూడా తగు చర్యలు తీసుకుని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ’’ అని కలెక్టర్ సత్యనారాయణ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో విద్యావ్యవస్థపై ఎంఈఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తక్కువగా ఉందంటూ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీల నుంచి మొదటి తరగతిలో కేవలం 18,781 మంది పిల్లలనే చేర్పించడం ఏమిటని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటే ఇంత తక్కువ మంది చేరినట్లు నివేదికలే చెబుతున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులంటే తనకు గౌరవమని, దానిని నిలుపుకోవాలన్నారు. 80 శాతం కంటే లక్ష్యం తక్కువ చేసిన వారికి మెమోలు జారీ చేయాని డీఈఓ దేవరాజ్‌ను ఆదేశించారు. బడిబయటి పిల్లలను చేర్పించడంలోనూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. అమ్మ ఒడితో పాటు ఇతర కార్యక్రమాలను విస్తృతంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 2.69 లక్షల మంది విద్యార్థులకు యూనిఫారం త్వరిగతిన అందజేయాలన్నారు. సమావేశానికి హాజరైన ఎంఈఓలు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి పాఠశాలల్లో టాయ్లెట్లు నిర్మిస్తే... వాటిని ఎందుకు వినియోగించడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. రొద్దం మండలం పెద్ద మణుతూరు పాఠశాలను తాను సందర్శించిన సమయంలో టాయ్‌లెట్‌కు తాళం వేసి ఉందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలతో కలిసి సహఫంక్తి భోజనం చేయాలని చెప్పారు. ఉపాధ్యాయులు గైర్హాజరైతే చర్యలు ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలలకు హాజరుకావాలన్నారు. కొందరు టీచర్లు స్కూల్ సమయం కంటే ముందే ఇళ్లకు వెళుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఉపాధ్యాయుల హాజరును ఎంఈఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాలలకు తాను అకస్మిక తనిఖీకి వస్తానని... ఎక్కడైనా ఉపాధ్యాయులు గైర్హాజరైనట్లు తన దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారులు (వార్డెన్లు), మోడల్ స్కూళ్లు, కేజీబీవీల ప్రిన్సిపాళ్లందరూ స్థానికంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనం అమలు, పాఠశాలల్లో పరిశుభ్రత, తదితర అంశాలపై మండలాల వారీగా కలెక్టర్, జేసీ–2 సమీక్షించారు. సమావేశంలో జేసీ–2 హెచ్.సుబ్బరాజు, ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, ఎస్టీ సంక్షేమ శాఖాధికారి కొండలరావు, బీసీ సంక్షేమ శాఖ అధకారి రబ్బానిబాషా ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇక అ‘ధనం’!
వైరా: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, మరింత రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలనే లక్ష్యంతో సర్కారు నిధులు పెంచింది. ఇకపై కేటాయింపులు అదనంగా చెల్లించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న వంట కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. రెండేళ్ల తర్వాత మధ్యాహ్న భోజన ధరలు పెంచుతూ ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూరగాయలు, నూనె, పప్పు, ఉప్పు తదితర వస్తువులకు సంబంధించి రూ.5.35 శాతం ధరలు పెంచింది. ఇవి వెంటనే అమలులోకి రానున్నాయి. గతంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రోజుకు రూ.4.13 చెల్లించేవారు. ఇకపై రూ.4.35 చెల్లించనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.2.61 కాగా రాష్ట్రం వాటా రూ.1.74 ఉంటుంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు గతంలో రూ.6.18 చెల్లించేవారు. పెరిగిన చార్జీలతో ప్రస్తుతం రూ.6.51 చెల్లిస్తారు. ఇందులో కేంద్రం వాటా రూ.3.91, రాష్ట్రం వాటా రూ.2.60 చొప్పున ఉంటుంది. జిల్లాలో 605 ప్రాథమిక, 193 ప్రాథమికోన్నత, 209 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 92,663 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు, నిరుపేద విద్యార్థులకు నాణ్యత గల విద్య అందించాలన్న లక్ష్యంతో 2005లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైన విషయం విదితమే. సన్న బియ్యం, పోషకాహారం.. దొడ్డు బియ్యం అన్నం నాసిరకంగా ఉండటంతో 2015 నుంచి సన్నబియ్యంతో భోజనం ప్రారంభించారు. వారానికి మూడు గుడ్లు, ఒక రోజు కిచిడీ, రోజు తప్పించి రోజు పప్పు, కూరగాయలు, సాంబార్ మెనూగా ఇస్తున్నారు. ఈ మెనూ ప్రకారం అందించాలంటే వంట ఏజెన్సీలకు గిట్టుబాటు కావట్లేదు. ముఖ్యంగా ఒక్కగుడ్డుకు ప్రభుత్వం ఇచ్చేది రూ.4 మాత్రమే. మార్కెట్లో సాధారణంగా ఒక్కో గుడ్డు రూ.5కు విక్రయిస్తున్నారు. వంట వండినందుకు ఒక్కో మహిళకు నెలకు రూ.వెయ్యి గౌరవభృతిగా చెల్లిస్తున్నారు. వంట ఖర్చు, గౌరవభృతి నెలనెలా రావడం లేదని, మూడు నెలలకోసారి బిల్లులిస్తున్నారంటూ..ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా పాఠశాలల్లో మార్చి నెల వరకు వంట ఖర్చులు, జనవరి వరకు గౌరవ వేతనాలు వచ్చినట్లు సమాచారం. మెనూ అమలు పర్చడానికి ప్రభుత్వం ఇచ్చే రేట్లు సరిపోవడం లేదని ఏజెన్సీ మహిళలు అంటున్న తరుణంలో ఈ ధరల పెంపు వారికి ఊరడింపు లాంటిదేనని భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం హర్షించదగింది.. ప్రభుత్వం మధ్యాహ్న భోజన చార్జీలను పెంచడం హర్షించదగింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా ఆరోగ్యకరమైన భోజనాన్ని కూడా అందించేందుకు అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మంచి భోజనం అందనుం ది. – కె.వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట.. ప్రభుత్వం మధ్యాహ్న భోజన చార్జీలను పెంచడం హర్షించదగింది. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట లభించినట్లైంది. ప్రభుత్వ నిర్ణయం చాలా బాగుంది. హాజరుశాతం మరింత మెరుగవుతుంది. – టి.నర్సింహారావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వైరా -
ఇన్‌చార్జిలే దిక్కు..
సాక్షి, వరంగల్ రూరల్: పాఠశాల విద్యను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించే డీఈఓతోపాటు ఎంఈఓల్లో ఇన్‌చార్జిలే అధికంగా ఉన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న నారాయణరెడ్డికి ఇటీవల డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతిని కల్పించి బదిలీ చేశారు. ఆయనకే వరంగల్ రూరల్ జిల్లా ఇన్చార్జి విద్యాశాఖాధికారిగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా మండలాల్లోని గెజిటెడ్ హెచ్ఎంలను ఇన్చార్జి ఎంఈఓలుగా నియమించారు. 16 మండలాల్లో ఒక్కరే రెగ్యులర్ ఎంఈఓ జిల్లాలోని 16 మండలాలకుగాను ఒక్కరే రెగ్యులర్ ఎంఈఓ ఉన్నారు. నల్లబెల్లి మండల విద్యాశాఖ అధికారిగా దేవా మినహా మిగతా మండలాలకు ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. ఖానాపు రం, నర్సంపేటకు ఇన్చార్జి ఎంఈఓగా దేవా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగతా చోట్ల సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జీ ఎంఈ ఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సొంత పాఠశాల పర్యవేక్షణతోపాటు మిగతా పాఠశాలల పర్యవేక్షణ వారికి అదనపు భారంగా మారింది. దీంతో ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల విధుల నిర్వహణపై పర్యవేక్షణ కరువైంది. దీంతో పలు పాఠశాలలు గాడి తప్పుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో చాలాచోట్ల విద్యార్థుల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతోంది. రెండు చోట్ల పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. పనిచేసే మండలంలో కాకుండా ఇతర మండలాల్లో.. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. దీంతో ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు ఇతర మండలాలకు బదిలీ అయ్యారు. దుగ్గొండి ఇన్చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాసంతి హసన్‌పర్తి మండలంలోని చింతగట్టు జెడ్పీ హైస్కూల్‌కు, చెన్నారావుపేట ఎంఈఓగా పని చేస్తున్న పర్వేజ్ ధర్మసాగర్ మండలం కూనూరు జెడ్పీ హైస్కూల్‌కు, గీసుకొండ ఇన్చార్జి ఎంఈఓ సృజన్‌తేజ నెక్కొండ మండలం సూరిపల్లి జెడ్పీ హైస్కూల్‌కు హెచ్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో పని చేస్తున్న వారు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వారు పనిచేస్తున్న పాఠశాలకు, ఇన్చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మండలానికి మధ్య సుమారు 50 కిలోమీటర్లపైనే దూరం ఉంటుంది. దీంతో పర్యవేక్షణ కష్టంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో ఎంఈఓలను నియమించాలని కోరుతున్నారు. -
అనుమతి లేని కోచింగ్ సెంటర్లు సీజ్
వనపర్తి విద్యావిభాగం : జిల్లాకేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న గురుకుల, నవోదయ కోచింగ్ సెంటర్లను శుక్రవారం ఎంఈఓ ఫయాజుద్దీన్ సీజ్ చేశారు. ఇటీవల జిల్లాలో అనుమతి లేని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ సాధన సమితీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.భరత్‌కుమార్ డీఈఓ సుశీందర్‌రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లో అనుమతి లేని కోచింగ్ సెంటర్లను తనిఖీ చేసి సీజ్ చేయాలని ఎంఈఓలకు డీఈఓ ఆదేశించారు. దీంతో గత రెండు రోజులుగా కొత్తకోట, పెబ్బేరు మండలాల్లో ఎంఈఓలు తనిఖీలు నిర్వహించి కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. దీంతో వనపర్తి పట్టణంలో కొనసాగుతున్న పలువురు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ముందుగానే సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించారు. వనపర్తిలోని పలు కోచింగ్ కేంద్రాల్లో గద్వాల, అలంపూర్, శాంతినగర్, ఇటిక్యాల, కొల్లాపూర్, పాన్‌గల్ తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులను చేర్చుకోవడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి సొంత గ్రామాలకు పంపించారు. ఇందులో భాగంగా శుక్రవారం వనపర్తి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న జీటీ నారాయణ, జ్ఞానశ్రీ, జ్ఞానజ్యోతి, సాధన, సిందూజ, విక్టరీ కోచింగ్ సెంటర్లను ఎంఈఓ ఫయాజుద్దీన్ సీజ్ చేశారు. ఏ పోటీ పరీక్షలకైనా కోచింగ్ ఇచ్చే నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని కొనసాగించాలని ఎంఈఓ ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీ సిబ్బంది రాధిక, సీఆర్పీ రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లో ‘హెడ్స్’ ఖాళీ..!
నల్లగొండ : నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో కలిపి మొత్తం ఉన్నత పాఠశాలలు 572 ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 77 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. నెలవారీ ఉద్యోగ విరమణలతో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో చేపట్టిన నెలవారీ పదోన్నతుల ప్రక్రియ ద్వారా పాఠశాలల్లో ఖాళీలు భర్తీ అయ్యేవి. జూలై-2015తో నెలవారీ పదోన్నతులు కల్పించడాన్ని నిలిపేశారు. దీంతో అప్పటి నుంచి రిటైర్ అయిన హెచ్ఎంల స్థానంలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు. ఇదిలావుంటే కొత్తగా ఏర్పడిన 70 మండలాల్లో ఎంఈఓల పోస్టులు ఖాళీగా ఉండటంతో సీనియర్ హెచ్ఎంలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఓ వైపు హెచ్ఎంలు లేక పాఠశాలలు కుంటుపడుతుంటే...మరో వైపు ఎంఈఓ పోస్టులు భర్తీ చేయకుండా సీనియర్ హెచ్‌ఎంలపై అదనపు భారం మోపడం వల్ల ఉన్నత పాఠశాలలు మరింత నష్టపోవాల్సి వస్తోంది. ఈ విషయాలన్నీ విద్యాశాఖ సెప్టెంబర్‌లో నిర్వహించిన క్షేత్రస్థాయి తనిఖీల్లో బట్టబయలయ్యాయి. నష్టపోతున్న విద్యార్థులు... ‘గురు’తర బాధ్యతను సమర్థంగా నిర్వహించడంలో హెడ్మాస్టర్లు విఫలమవుతున్నట్లు క్షేత్రస్థాయి తనిఖీలో తేలింది. ఏటా నాయకత్వ లక్షణాలపై హెచ్ఎంలకు విద్యాశాఖ ఐదు రోజుల శిక్షణ ఇస్తుంది. శిక్షణ పొందుతున్న హెచ్ఎంలు ఆచరణలో ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇన్చార్జిలు ఉన్న పాఠశాలల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెగ్యుల్ హెచ్ఎంలు చాలా మంది బోధన విధులకు ఎగనామం పెడుతున్నారు. ఒక్కో హెచ్ఎం వారానికి 8 తరగతులు బోధించాల్సి ఉంటుంది. స్వయంగా బోధిస్తూ ఉపాధ్యాయుల బోధనను పర్యవేక్షించాలి. అకడమిక్ క్యాలెండర్‌ను, నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని సమర్థంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాలి. వీటిన్నింటినీ పక్కనపెట్టి కేవలం టీచర్ల వేతన బిల్లులు, ఇతర వ్యవహారాలకే పరిమితమైనట్లు విద్యాశాఖ తనిఖీలో తేలింది. ఉదాహరణకు వేములపల్లి మండలం రావులపెంట ఉన్నత పాఠశాల రెగ్యులర్ హెచ్ఎంను ఇన్చార్జి ఎంఈఓగా నియమించారు. ఆ ఎంఈఓకే మళ్లీ డీఈఓ ఆఫీస్‌లో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్‌గా అదనపు బాధ్యత అప్పగించారు. దీంతో ఇన్చార్జిల పర్యవేక్షణలోనే పాఠశాలలు నడిపే పరిస్థితి ఏర్పడింది. అంతా ఇన్చార్జీల మయం.... ఉమ్మడి జిల్లాలోని 59 మండలాలు, కొత్తగా ఏర్పడిన 11 మండలాలతో కలిపి మొత్తం 70 మండలాల్లో ఎంఈఓ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పదకొండు కొత్త మండలాల్లో అడవిదే వులపల్లి ‘బి’గ్రేడ్ మండలం అయినందున ఆ మండలానికి ఎంఈఓ పోస్టు ఇవ్వలేదు. దీంతో దామరచర్ల ఎంఈఓకు అడవిదేవులపల్లి మండ లాన్ని అదనంగా అప్పగించారు. మిగిలిన 69 మండలాలకు ప్రస్తుతం సీనియర్ హెచ్ఎంలే ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో పాఠశాలల పర్యవేక్షణ కరువై పదో తరగతి ఫలితాల ఉత్తీర్ణతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారం నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభంకానున్నాయి. ఒక్కో ఎంఈఓ ప్రతి మండలంలో కనీసం 40 నుంచి 50 పాఠశాలలు పర్యవే క్షించాలి. వంద నుంచి 150 మంది ఉపాధ్యాయుల పనితీరు చూడాలి. వేతనాలు, సెలవులు, మధ్యాహ్నభోజనం, నెలవారీ నివేదికలు, పాఠశాలల అవసరాలు, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమా లు, ఉన్నతాధికారుల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇన్చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వహించే ప్రధానోపాధ్యాయుడు మండల బాధ్యతలతో పాటు తన పాఠశాలను కూడా పర్యవేక్షించాలి. మండలంలోనే పనులకే అధిక సమయం పడుతుండటంతో ప్రధానోపాధ్యాయుడిగా తన పాఠశాలల పర్యవేక్షణ తక్కువగానే ఉంటోంది. రెండు వైపుల బాధ్యతలు నిర్వర్తించడం ఎంఈఓలకు కత్తిమీదసామే అవుతోంది. -
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపికకు ప్రతిపాదనలు
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపిక –2016 కోసం ప్రతిపాదనలు సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారుల ద్వారా పంపాలని డీఈఓ పి.రాజీవ్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్ట ర్ సర్వేపెల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఈ అవార్డుల ఎంపిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు 10సంవత్సరాలు పూర్తి సర్వీస్ కలిగి ఉండాలని, బడిబాటలో విద్యార్థులను ఎన్రోల్మెంట్ చేసి ఉండాలని, అలాగే హరితహారంలో భాగస్వాములై ఉండాలని తెలిపారు. అలాగే క్రిమినల్ కేసులు ఉండరాదని, ఇప్పటికే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వారు తిరిగి ప్రతిపాదనలు చేయెుద్దని డీఈఓ సూచించారు. -
మిథ్యాశాఖ
అస్తవ్యస్తంగా వ్యవస్థ.. - ఇప్పటికీ ఎంఈఓలు లేరు - పుస్తకాల్లేకుండానే పరీక్షలు - ఇంకా 4.40 లక్షల పుస్తకాలు అవసరం - అ‘డ్రెస్’లేని యూనిఫాం - చతికిలబడుతున్న చదువులు మెదక్: జిల్లా విద్యాశాఖ గాఢనిద్రలో జోగుతోంది. పాఠశాలలు ప్రారంభమైన ఇన్నాళ్లకు కూడా చదువులు గాడిన పడకపోగా, విద్యాశాఖ యంత్రాంగం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. పిల్లలకు పుస్తకాలు పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. యూనిఫాం ఇవ్వలేదు. పాత ఎంఈఓలు బదిలీ అయి 46 రోజులైనా.. ఇప్పటికీ కొత్త వారికి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో చదువులు చతికిలబడుతున్నాయి. అంతా అస్తవ్యస్తం.. ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అవకతవకలతో కుదేలైన విద్యాశాఖ ఇప్పటికీ దిద్దుబాటుకు ఉపక్రమించలేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాశాఖ పర్యవేక్షణలో మండల విద్యాధికారు (ఎంఈఓ)లదే కీలకపాత్ర. జూలై 7న జరిగిన ప్రధానోపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో జిల్లాలో ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న 20 మంది హెచ్ఎంలు బదిలీపై వెళ్లారు. అదే నెల 9న వీరంతా కొత్త పాఠశాలల్లో చేరారు. అయితే వీరు ప్రధానోపాద్యాయుల బాధ్యత నుండి విడుదలైనా.. ఎంఈఓ బాధ్యతల నుంచి తప్పుకోలేదు. కొంతమంది 60 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అక్కడి నుండే వీరు పాత మండలాల్లో ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పర్యవేక్షణ ఘోరం.. ఎంఈఓలుగా ఉన్న హెచ్ఎంలు పనిచేసే చోటు నుంచి దూరంగా ఉండటంతో వారానికోసారి మండల కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. దీంతో ఆయా మండలాల్లో పర్యవేక్షణ కరువై పాఠశాలలు గాడి తప్పుతున్నాయి. కాంప్లెక్స్ సమావేశాల్లో, హరితహారం, గ్రామజ్యోతిలో కీలకపాత్ర వహించాల్సిన ఎంఈఓల జాడ కనిపించడం లేదు. ఆగస్టు 15న చాలాచోట్ల మండల విద్యా వనరుల కేంద్రంలో అక్కడ ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఎంఐఎస్‌లు జెండాలు ఎగురవేయడం గమనార్హం. త్వరలో పాఠశాలల్లో అకడమిక్ ఇనస్ట్రక్టర్లను నియమిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో రెగ్యులర్ ఎంఈఓలు అవసరం. ఇతర జిల్లాల్లో బదిలీలు జరిగిన వారం రోజుల్లో కొత్త ఎంఈఓలకు బాధ్యతలు అప్పగించినా.. జిల్లాలో మాత్రం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. పుస్తకాలు లేకుండానే ‘పరీక్ష’కు.. పాఠశాలలు తెరచి 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాకు 19,16,137 పుస్తకాలే వచ్చాయి. ఇంకా 4,40,600 పుస్తకాలు అవసరం. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకైతే కనీసం 45 శాతం పుస్తకాలు పంపిణీ కానట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఫార్మటీవ్ 2 టెస్ట్‌లు జరుగుతున్నాయి. మారిన సీసీఈ విధానంలో పుస్తకాలు లేకుండా ఈ టెస్ట్‌లు ఎలా రాయాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బదిలీల సమయంలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేసినప్పటికీ వివిధ పాఠశాలల్లో ఇంకా 1100 పైచిలుకు టీచర్లు అవసరమని తెలుస్తుంది. రేషనలైజేషన్‌లో జరిగిన అక్రమాల వల్లే ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల (వాలంటీర్లు)ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. యూనిఫాం ఏదీ? ఆగస్టు నెల వచ్చేసినా.. ఇప్పటికీ విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు పంపిణీ కాలేదు. చిరిగిన దుస్తులతోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారు. చాలా పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం పూర్తయినా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉండటంతో విద్యార్థులు తినలేకపోతున్నారు. బియ్యంలో పురుగులు వస్తున్నాయని, అన్నం సరిగా ఉడకడం లేదన్న విమర్శలున్నాయి. మరి, విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు ఎప్పటికి తీసుకుంటుందో?!. -
స్కూళ్లను పట్టించుకోని ఎంఈఓలు!
ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ పాఠశాలలను మండల విద్యాధికారులు (ఎంఈఓ) పట్టించుకోవడం లేదు. స్కూళ్లకు టీచర్లు సరిగ్గా వస్తున్నారా.. లేదా? చూడటం లేదు.. పోనీ వారు స్కూళ్లలో అందుబాటులో ఉంటున్నారా? అంటే అదీ సరిగ్గా లేదు. ఏమంటే తాను ఇన్‌ఛార్జి ఎంఈఓ మాత్రమేనని, మరో స్కూల్లో హెడ్ మాస్టర్‌నని చెబుతున్నారు. మరోవైపు స్కూళ్లలో విద్యా బోధన సరిగ్గా సాగడం లేదు. ఇంగ్లిషు బోధన అయితే మరీ అధ్వానం. ఉపాధ్యాయుల బోధనపై పర్యవేక్షణ లేదు’ ఇదీ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. మూడు వారాలుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు సహా విద్యాశాఖ అధికారులు, అదనపు డెరైక్టర్లు ఇటీవల పాఠశాలల్లో చేసిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన అంశాలు. బుధవారం పాఠశాల విద్యా డెరైక్టరేట్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో దీనిపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో పాఠశాలలు, విద్యా బోధన గాడిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుందని, ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలలు మరింత అధ్వానంగా తయారవుతాయని అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని భావించింది. ఇందులో భాగంగా పాఠశాలల నిర్వహణ, విద్యాబోధన, పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలపై అవసరమైతే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడవద్దని తనిఖీ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు బోధన పద్ధతుల విషయంలో ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణకు సంబంధించి చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు.