ఇక అ‘ధనం’!  | Quality Lunch In Telangana Govt Schools | Sakshi
Sakshi News home page

ఇక అ‘ధనం’! 

Published Mon, May 20 2019 7:17 AM | Last Updated on Mon, May 20 2019 7:17 AM

Quality Lunch In Telangana Govt Schools - Sakshi

 వైరా: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, మరింత రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలనే లక్ష్యంతో సర్కారు నిధులు పెంచింది. ఇకపై కేటాయింపులు అదనంగా చెల్లించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న వంట కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. రెండేళ్ల తర్వాత మధ్యాహ్న భోజన ధరలు పెంచుతూ ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూరగాయలు, నూనె, పప్పు, ఉప్పు తదితర వస్తువులకు సంబంధించి రూ.5.35 శాతం ధరలు పెంచింది. ఇవి వెంటనే అమలులోకి రానున్నాయి. గతంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రోజుకు రూ.4.13 చెల్లించేవారు. ఇకపై రూ.4.35 చెల్లించనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.2.61 కాగా రాష్ట్రం వాటా రూ.1.74 ఉంటుంది.

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు గతంలో రూ.6.18 చెల్లించేవారు. పెరిగిన చార్జీలతో ప్రస్తుతం రూ.6.51 చెల్లిస్తారు. ఇందులో కేంద్రం వాటా రూ.3.91, రాష్ట్రం వాటా రూ.2.60 చొప్పున ఉంటుంది. జిల్లాలో 605 ప్రాథమిక, 193 ప్రాథమికోన్నత, 209 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 92,663 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు, నిరుపేద విద్యార్థులకు నాణ్యత గల విద్య అందించాలన్న లక్ష్యంతో 2005లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైన విషయం విదితమే. 

సన్న బియ్యం, పోషకాహారం.. 
దొడ్డు బియ్యం అన్నం నాసిరకంగా ఉండటంతో 2015 నుంచి సన్నబియ్యంతో భోజనం ప్రారంభించారు. వారానికి మూడు గుడ్లు, ఒక రోజు కిచిడీ, రోజు తప్పించి రోజు పప్పు, కూరగాయలు, సాంబార్‌ మెనూగా ఇస్తున్నారు. ఈ మెనూ ప్రకారం అందించాలంటే వంట ఏజెన్సీలకు గిట్టుబాటు కావట్లేదు. ముఖ్యంగా ఒక్కగుడ్డుకు ప్రభుత్వం ఇచ్చేది రూ.4 మాత్రమే. మార్కెట్‌లో సాధారణంగా ఒక్కో గుడ్డు రూ.5కు విక్రయిస్తున్నారు. వంట వండినందుకు ఒక్కో మహిళకు నెలకు రూ.వెయ్యి గౌరవభృతిగా చెల్లిస్తున్నారు. వంట ఖర్చు, గౌరవభృతి నెలనెలా రావడం లేదని, మూడు నెలలకోసారి బిల్లులిస్తున్నారంటూ..ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా పాఠశాలల్లో మార్చి నెల వరకు వంట ఖర్చులు, జనవరి వరకు గౌరవ వేతనాలు వచ్చినట్లు సమాచారం. మెనూ అమలు పర్చడానికి ప్రభుత్వం ఇచ్చే రేట్లు సరిపోవడం లేదని ఏజెన్సీ మహిళలు అంటున్న తరుణంలో ఈ ధరల పెంపు వారికి ఊరడింపు లాంటిదేనని భావిస్తున్నారు.  
 
ప్రభుత్వ నిర్ణయం హర్షించదగింది.. 
ప్రభుత్వం మధ్యాహ్న భోజన చార్జీలను పెంచడం హర్షించదగింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా ఆరోగ్యకరమైన భోజనాన్ని కూడా అందించేందుకు అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మంచి భోజనం అందనుం ది. – కె.వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా 

మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట.. 
ప్రభుత్వం మధ్యాహ్న భోజన చార్జీలను పెంచడం హర్షించదగింది. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట లభించినట్‌లైంది. ప్రభుత్వ నిర్ణయం చాలా బాగుంది. హాజరుశాతం మరింత మెరుగవుతుంది.  – టి.నర్సింహారావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వైరా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement