miday meals
-
పాఠశాలకు సరుకుల బదులు పశువుల దాణా..!
పుణె: సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మహారాష్ట్రలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పుణెలోని ఒక మున్సిపల్ పాఠశాలకు మధ్యాహ్నభోజన పథకంలో భాగంగా పశువుల దాణాను సరఫరా చేశారు. ఈ ఘటన గత వారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలకు సరుకులకు బదులు పశువుల దాణా వచ్చింది. దీంతో కంగుతిన్న పాఠశాల సిబ్బంది స్థానిక నాయకులు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు పంపిన పశువుల దాణాను స్వాధీనం చేసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు .. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, 58 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల పుణె మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో నేరుగా మిడ్ డే మీల్స్ సరుకులను విద్యార్థుల ఇంటికి చేరవేయాలని కార్పోరేషన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సరుకుల రవాణాలో పొరపాట్ల మూలంగా తాజా ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై పుణె నగర మేయర్ మాట్లాడుతూ.. ‘కార్పోరేషన్ పాఠశాల విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వస్తువులను సరఫరా చేయడమే మా బాధ్యత. పాఠశాలకు పశువుల దాణాను పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. (చదవండి: పుణేలో కోవిడ్ ఆంక్షలు) -
మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి
సాక్షి, సంగారెడ్డి : కందిలోని జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బందిపై మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీలో భాగంగా శనివారం కంది వెళ్లిన మంత్రి అక్కడి పాఠశాల విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. పదో తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టులోని ప్రశ్నలు అడిగి.. వారి పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి ప్రశ్నలకు అక్కడి విద్యార్ధులు కనీసం సమాధానాలు చెప్పలేకపోయారు. తెలుగులో కూడా పేర్లు రాయలేకపోయారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులపై మంత్రి హరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు ఇలా ఉంటే పరీక్షల్లో ఎలా పాసవుతారని హరీష్ ప్రశ్నించారు. పదో తరగతికి వచ్చినా కనీసం ఎక్కాలు చెప్పడం రాకపోతే ప్రపంచంతో ఎలా పోటీపడతారని మండిపడ్డారు. అనంతరం మధ్యాహ్న భోజనంపై ఆరాతీశారు. వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యకు ప్రభుత్వం అన్న రకాలుగా అండగా ఉంటుందని, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని మంత్రి ఆదేశించారు. -
స్కూలు అమ్మలకు ఆసరా
సాక్షి కడప/ ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల కిందట ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. అవ్వతాతల కోసం వైఎస్సార్ పింఛన్ పథకాన్ని తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్...కిడ్నీ బాధితులకు పింఛన్ కింద రూ. 10 వేలు, దివ్యాంగులకు రూ. 3 వేలు అందించేలా తొలి సంతకాన్ని చేసి దివంగత సీఎం వైఎస్సార్‌ను తలపించారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఎడతెరిపి లేకుండా శాఖలపై సమీక్ష చేస్తూ ప్రతి పథకాన్ని పేదలకు అందేలా రూపకల్పన చేస్తున్నారు. మొదటగా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి అందించే మహిళా కార్మికుల కష్టాలను అధ్యయనం చేసిన సీఎం వారి గౌరవ వేతనం పెంపునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రూ.1000 మాత్రమే...అందునా అది కూడా టీడీపీ సర్కార్ హయాంలో నెలనెల ఇవ్వని పరిస్థితి ఇప్పటికీ కూడా మూడు, నాలుగు నెలల గౌరవ వేతనం కూడా పెండింగ్‌లో పెట్టి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా కార్మికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సీఎం వైఎస్ జగన్ రూ. 1000 నుంచి రూ. 3000లకు గౌరవ వేతనాన్ని పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 5745 మందికి లబ్ది జిల్లాలో 3654 పాఠశాలల్లో సుమారు 2,17,536 మందికి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. వంట ఏజెన్సీల ద్వారా 5745 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా సీఎం తీసుకున్న నిర్ణయంతో గౌరవ వేతనం నెలకు రూ.3 వేలు చొప్పున అందనుంది. మధ్యాహ్న భోజన కార్మికులు వంట వండే సమయంలో అనేక అవస్థలకు గురవుతున్నా వారిని ఎవరూ పట్టించుకోలేదు. ఒకపక్క సమస్యలు...మరోవైపు సక్రమంగా రాని గౌరవ వేతనం.....అదికూడా అంతంత మాత్రంగా ఇస్తుండడంతో అవస్థలు పడుతున్న వారి కష్టానికి సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇవ్వనుంది.జిల్లాలో 5745 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుండడంతో మహిళా కార్మికుల మోముల్లో చిరునవ్వులు విరజిల్లుతున్నాయి. వైఎస్సార్ అక్షయపాత్రగా నామకరణం ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మొదటగా మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్సార్ అక్షయపాత్రగా నామకరణం చేశారు. అంతేకాకుండా ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రతి పాఠశాలలో నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. పథకానికి నామకరణం చేసిన ఆయన పిల్లల కడుపుకు అందించే ఆహార విషయంలోనూ ప్రతి ఒక్కరూ బాద్యతగా వ్యవహారించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మహిళా కార్మికుల్లో సంబరాలు మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తక్కువ గౌరవ వేతనమే కాకుండా వారికి నెలనెల కూడా సక్రమంగా ఇవ్వలేదు. గౌరవ వేతనం పెంచుతామని హామి ఇచ్చినా దాన్ని అమలు చేయలేదు. వరత్నాలతోపాటు మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనాన్ని మేనిఫెస్టోలో లేకపోయినా....ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వస్తూనే సీఎం వైఎస్ జగన్ వారికి న్యాయం చేశారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహిళా కార్మికులు సంబరాలు చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
గౌరవం పెరిగింది
అనంతపురం ఎడ్యుకేషన్: పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనదైన ముద్రను కనపరుస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనం రెండింతలు చేశారు. రూ.1000 స్థానంలో రూ.3వేలకు పెంచిన గౌరవ వేతనం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనం రూ.1000లు అమలు చేశారు. అప్పటి నుంచి అంతే మొత్తం అందుతోంది. గౌరవ వేతనం పెంచాలంటూ ఏళ్ల తరబడి పోరాటాలు చేసినా ఫలితం లేకపోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే గౌరవ వేతనం రెండింతలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఏ నెలలోనూ సక్రమంగా గౌరవ వేతనం ఇచ్చిన సందర్భం లేదని, కొత్త ప్రభుత్వంలో అలాంటి సమస్య ఉత్పన్నం కాదనే ఆశాభావం కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7561 మంది ఎండీఎం కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ. వెయ్యి ప్రకారం నెలకు రూ.75,61,000 గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో గౌరవ వేతనం రెండింతలు కాగా.. ఇక నుంచి ప్రతి నెలా ప్రభుత్వంపై రూ.1,51,22,000 అదనపు భారం పడనుంది. ఇదిలాఉంటే ఇక నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ‘వైఎస్సార్ అక్షయపాత్ర’గా పేరు మార్పు చేశారు. పథకం అమలు, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని.. పరిశుభ్రత పాటించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. రానున్న రోజుల్లో కార్మికులకు భోజనం తయారు చేసే పనిని తగ్గించి కేవలం వడ్డనకే పరిమితం చేస్తామన్నారు. వంట తయారీకి ఆధునిక వంటశాలలు నిర్మించాలని సీఎం ఆదేశించడం పట్ల కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అడ్రస్ లేని కోడిగుడ్లు మొన్నటిదాకా అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం పథకం అమలు అధ్వానంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి అమలులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా.. ఫిబ్రవరి నుంచి కోడిగుడ్లు ఇవ్వడమే మానేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి సంబంధిత ఏజెన్సీకి పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోయింది. సదరు ఏజెన్సీకి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టడంతో కోడిగుడ్లు సరఫరా చేసేందుకు వెనుకడుగు వేశారు. పిల్లలకు పౌష్టికారాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అప్పటి సీఎం చంద్రబాబు పదేపదే ప్రకటనలు చేసినా.. కోడిగుడ్ల సరఫరా ఆగిపోయినా పట్టించుకోకపోవడం గమనార్హం. మా కష్టాలను గుర్తించారు కొత్త ముఖ్యమంత్రి మా కష్టాలను గుర్తించారు. వెయ్యి రూపాయల గౌరవవేతనం ఏ మూలకు సరిపోయేది కాదు. రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. – లక్ష్మిదేవి, బుళ్లసముద్రం, మడకశిర మండలం చంద్రబాబు మోసం చేశారు గౌరవ వేతనం పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తూ జీఓ ఇచ్చినా బడ్జెట్ కేటాయించలేదు. ఎన్నికల ముందు ప్రకటన చేసి చేతులు దులుపుకొన్నారు. పెంచిన గౌరవ వేతనానికి సంబంధించి ఫిబ్రవరి నుంచి అరియర్స్ ఇచ్చేలా చూడాలి. – నాగమణి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఇక అ‘ధనం’!
వైరా: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, మరింత రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలనే లక్ష్యంతో సర్కారు నిధులు పెంచింది. ఇకపై కేటాయింపులు అదనంగా చెల్లించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న వంట కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. రెండేళ్ల తర్వాత మధ్యాహ్న భోజన ధరలు పెంచుతూ ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూరగాయలు, నూనె, పప్పు, ఉప్పు తదితర వస్తువులకు సంబంధించి రూ.5.35 శాతం ధరలు పెంచింది. ఇవి వెంటనే అమలులోకి రానున్నాయి. గతంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రోజుకు రూ.4.13 చెల్లించేవారు. ఇకపై రూ.4.35 చెల్లించనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.2.61 కాగా రాష్ట్రం వాటా రూ.1.74 ఉంటుంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు గతంలో రూ.6.18 చెల్లించేవారు. పెరిగిన చార్జీలతో ప్రస్తుతం రూ.6.51 చెల్లిస్తారు. ఇందులో కేంద్రం వాటా రూ.3.91, రాష్ట్రం వాటా రూ.2.60 చొప్పున ఉంటుంది. జిల్లాలో 605 ప్రాథమిక, 193 ప్రాథమికోన్నత, 209 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 92,663 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు, నిరుపేద విద్యార్థులకు నాణ్యత గల విద్య అందించాలన్న లక్ష్యంతో 2005లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైన విషయం విదితమే. సన్న బియ్యం, పోషకాహారం.. దొడ్డు బియ్యం అన్నం నాసిరకంగా ఉండటంతో 2015 నుంచి సన్నబియ్యంతో భోజనం ప్రారంభించారు. వారానికి మూడు గుడ్లు, ఒక రోజు కిచిడీ, రోజు తప్పించి రోజు పప్పు, కూరగాయలు, సాంబార్ మెనూగా ఇస్తున్నారు. ఈ మెనూ ప్రకారం అందించాలంటే వంట ఏజెన్సీలకు గిట్టుబాటు కావట్లేదు. ముఖ్యంగా ఒక్కగుడ్డుకు ప్రభుత్వం ఇచ్చేది రూ.4 మాత్రమే. మార్కెట్లో సాధారణంగా ఒక్కో గుడ్డు రూ.5కు విక్రయిస్తున్నారు. వంట వండినందుకు ఒక్కో మహిళకు నెలకు రూ.వెయ్యి గౌరవభృతిగా చెల్లిస్తున్నారు. వంట ఖర్చు, గౌరవభృతి నెలనెలా రావడం లేదని, మూడు నెలలకోసారి బిల్లులిస్తున్నారంటూ..ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా పాఠశాలల్లో మార్చి నెల వరకు వంట ఖర్చులు, జనవరి వరకు గౌరవ వేతనాలు వచ్చినట్లు సమాచారం. మెనూ అమలు పర్చడానికి ప్రభుత్వం ఇచ్చే రేట్లు సరిపోవడం లేదని ఏజెన్సీ మహిళలు అంటున్న తరుణంలో ఈ ధరల పెంపు వారికి ఊరడింపు లాంటిదేనని భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం హర్షించదగింది.. ప్రభుత్వం మధ్యాహ్న భోజన చార్జీలను పెంచడం హర్షించదగింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా ఆరోగ్యకరమైన భోజనాన్ని కూడా అందించేందుకు అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మంచి భోజనం అందనుం ది. – కె.వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట.. ప్రభుత్వం మధ్యాహ్న భోజన చార్జీలను పెంచడం హర్షించదగింది. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట లభించినట్లైంది. ప్రభుత్వ నిర్ణయం చాలా బాగుంది. హాజరుశాతం మరింత మెరుగవుతుంది. – టి.నర్సింహారావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వైరా -
నాణ్యమైన భోజనం ఇవ్వాలి
మెదక్ అర్బన్: ప్రతి పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించేలా ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యంతో పాటు మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన పోషకాలను అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమం కేవలం విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిందేనని అన్నారు. ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అన్నంతో పాటు విధిగా కూరగాయలు, పప్పులు, ఆకుకూరలతో పాటు గుడ్లను సైతం అందించిప్పుడే విద్యార్థి ఎదుగుదలకు సరిపడా పోషకాలు అందుతాయన్నారు. అమలులో నిర్లక్ష్యం వహించే నిర్వాహకులకు నోటీసులు అందించాలన్నారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేనట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు వచ్చే బియ్యం దిగుమతి చేసుకోవాలన్నారు. పాఠశాలలకు వచ్చే బియ్యం తూకంలో తక్కువ వస్తే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి ప్రతి పాఠశాలలో కిచెన్‌షెడ్ల నిర్మాణానికి పాఠశాల యాజమాన్య కమిటీలో చర్చించాలని అన్నారు. పాపన్నపేట మండలంలోని కస్తూర్బా పాఠశాల, ఉన్నత పాఠశాలకు భగీరథ కనెక్షన్లు అందించాలని ఆదేశించి మూడు నెలలు దాటినా ఇప్పటికీ నీరందించకపోవడంపై ఈఈ కమలాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది ఇళ్లు ఉన్న ఆవాసాలకు సైతం మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా నీటి కనెక్షన్లు అందిస్తున్నామని... అలాంటిది 350 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలకు నీటి కనెక్షన్లు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మూడు నెలల కిందట నీటి కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఇప్పటికీ ఆ పాఠశాలలో నీటి సరఫరా కావడం లేదన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావాలని కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. అలాగే ప్రతి పాఠశాలకు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలను ప్రధానోపాధ్యాయులు తమ సొంత ఆస్తిలా భావించాలని, ప్రభుత్వం లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే భవనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ రవికాంతరావు, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు, నోడల్ అధికారి మధుమోహన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీటీడబ్ల్యూఓ వసంతరావు, జ్యోతిపద్మ, డీపీఆర్వో శైలేశ్వర్‌రెడ్డి, ఏడీలు భాస్కర్, భాస్కర్‌రావు, సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్, సుభాష్‌తో పాటుఆయా మండలాల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అప్పు చేసి భోజనం!
బజార్హత్నూర్(బోథ్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు సర్కారు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్నో వ్యయ, ప్రయాసాలకు ఓర్చి నిర్వాహకులు వంట చేసి భోజనం పెడుతున్నా బిల్లులు మాత్రం నెలనెలా రావడం లేదు. దీంతో అప్పులు చేసి విద్యార్థులకు వండి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. మూడు నెలలుగా రాని బిల్లులు జిల్లాలో మొత్తం 68,382 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అందులో భాగంగా 2018 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మొత్తం 56 పనిదినాల్లో 68,382 మంది విద్యార్థులకు అందించిన మధ్యాహ్నం భోజనం బిల్లులు రూ.2,63,89,728లను ప్రభుత్వం చెల్లించకపోవడంతో నిర్వాహకులు అప్పులు చేసి మరి ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.అందుబాటులో డబ్బులు లేక నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లిస్తే తప్పా మధ్యాహ్న భోజన కార్యక్రమం కొనసాగే పరిస్థితి కనపడటం లేదు. 9–10వ తరగతుల విద్యార్థులు మధ్యాహ్న భోజన బిల్లులు జూలై నుంచి డిసెంబర్ వరకు బిల్లులు రాలేదు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే మొదటి మూడు నెలలకు సంబంధించి రూ.43,62,000 బిల్లులు మంజూరయ్యాయని, త్వరలో నిర్వాహకులకు అందిస్తామని తెలిపారు. గిట్టుబాటు కాని చార్జీలు కూరగాయలు పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ మేరకు ఏజెన్సీలకు బిల్లులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నెలనెలా బిల్లులు చెల్లించకపోవడం, చార్జీలు పెంచకపోతే రోజు కూరగాయలు పెట్టడం సాధ్యం కాదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచకపోవడంతో భోజనంలో కూడా నాణ్యత లోపిస్తోంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొరికి రోజుకు రూ.4.13పైసలు, సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు పెడితే అదనంగా రూ.4.. 6నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.6.18పైసలు సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు పెడితే అదనంగా రూ.4.. 9, 10వ తరగతులకు గుడ్డుతోపాటు భోజనానికి రూ.8.18చొప్పున ఏజెన్సీలకు చెల్లిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఈ మొత్తాన్ని ప్రభుత్వం పెంచడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయల ధరలు చూసిన కిలోకు రూ.50కు తక్కువ లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలతో గిట్టుబాటు కాకా నిర్వాహకులు ఆలుగడ్డ, చారు, పలుచని పప్పుకే పరిమితమవుతున్నారు. ఇతర కూరగాయలు లేకపోవడంతో భోజనం రుచించక, విద్యార్థులు సగం కడుపుతో సరిపెట్టుకుంటున్నారు. మెనూ ప్రకారం భారమే అయినా.. మధ్యాహ్న భోజనం మెనూలో సర్కారు కూరగాయలతో కూడిన భోజనంతోపాటు వారంలో సోమ, బుధ, శుక్రవారం గుడ్డు అందించాలని పలు మార్పులు చేసింది. దీనిపై జూన్‌లోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో రాష్ట్రంలో మధ్యాహ్నభోజనం అమలు తీరును పరిశీలించిన కేంద్ర బృందం మెనూ మార్చాలని సూచించింది. రకరకాల కూరగాయలు, బఠానీ పలావ్, కూరగాయలతో కూర్మా, కాబులీ శనగలు, కూరగాయలతో బిర్యాణి, మిల్మేకర్ బిర్యాణి, మునగకాయ, పెసర పప్పుతో కిచిడీ, చట్నీ, అన్నం, టమాటా, బఠానీల కూర, సోయాచిక్కుడు వంటి కూరలు ఉండాలని నిర్ధేశించింది. తదితర పదార్థాలతో వండి పెడితే విద్యార్థులు ఇష్టంగా తినడంతోపాటు వారికి పౌష్టికాహరం అందించనట్లు కూడా ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వాహకులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం భారమే అయినా కూరగాయలు కొని భోజనం పెడుతున్నారు. కానీ బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రూ.15 చెల్లిస్తేనే.. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 1,153 పాఠశాలలు ఉండగా, 68వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిపై మధ్యాహ్న భోజన పథకం కింద గుడ్డు అందించిన రోజు రూ.5.91లక్షలు, గుడ్డు లేని రోజు రూ.3.59లక్షలకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నాణ్యమైన భోజనం అందాలంటే ఒక్కో విద్యార్థిపై కనీసం రూ.15 వంతున చెల్లించాలని ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు అదనంగా ప్రతీ రోజు మరో రూ.3లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే భోజనంలో నాణ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారమైతంది నేను వృధ్యాప్యలో ఉండటంతో వ్యవసాయ కూలీగా వెళ్లే పరిస్థితి లేనందున నీడపట్టున ఉంటూ మధ్యాహ్న భో జనం వంటచేసి పెడుతున్నాను. కానీ ప్రభుత్వం బిల్లులు నెలల తరబడి చెల్లించకపోవడంతో ఉపాధ్యాయుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. ఒక నెల ఎలాగోలా సర్ధుకపోవచ్చు కాని 3 నెలలు బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా భారమైతంది. – కమలాబాయి, నిర్వాహకురాలు నెలనెలా చెల్లించాలి మధ్యాహ్నభోజన నిర్వాహకులంతా రోజు కూలీలే. వారి వద్ద వేల రూపాయలు జమ ఉండవనే విషయం ప్రభుత్వానికి తెలిసినా బిల్లుల విషయంలో నిర్లక్ష్యం చేయడం సరికాదు. అప్పులు చేసి వడ్డీలు కట్టే పరిస్థితుల్లో లేము. అలా కట్టాలంటే మా రోజు కూలీ వడ్డీకే సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలాగే మధ్యాహ్నభోజనం బిల్లులు నెలనెలా చెల్లించాలి. – కర్వల పోసాని, నిర్వాహకురాలు బడ్జెట్ విడుదలైతే బిల్లులు చెల్లిస్తాం జిల్లాలో 1,153 పాఠశాలల మధ్యాహ్న భోజనం బిల్లులు గత 3 నెలలకు రూ.2.63 కోట్లు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. 9–10వ తరగతి విద్యార్థులు మధ్యాహ్న భోజన బిల్లులు జూలై నుంచి డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉండే. అందులో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మొదటి మూడు నెలలకు సంబంధించిన రూ.43,62,000 ఇటీవల మంజూరయ్యాయి. త్వరలో వాటిని నిర్వాహకులకు అందిస్తాం. మిగతా మూడు నెలల బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయగానే చెల్లిస్తాం. – రవీందర్‌రెడ్డి, డీఈవో -
‘గౌరవ’మేదీ..?
సాక్షి, నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, పాఠశాలకు వచ్చే పిల్లల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. పథకం విజయవంతంగా సాగుతున్నా.. భోజనం వండి వడ్డించే కార్మికుల పరిస్థితి మాత్రం ఆగమ్యగోచరంగా ఉంది. నాలుగు నెలలుగా వీరికి గౌరవ వేతనం అందకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే అరకొర వేతనం కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో.. వారి అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ దసరాకైనా వేతనం అందుతుందని భావించిన వారికి ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. ఇచ్చేది రూ.వెయ్యి.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహం భోజనం వండిపెట్టే కార్మికులకు గౌరవ వేతనం రూ.1000 ఇస్తున్నారు. కార్మికులు భోజనం వండి పెట్టడడంతోపాటు వడ్డించాలి కూడా. ఇన్ని పనులు చేసినా వారికి ఇచ్చే వేతనం ఎంతో తక్కువ. అదికూడా పాఠశాలలు పునః ప్రారంభమైన జూన్ నుంచి కూడా అందడం లేదు. ఇచ్చే కొద్ది పాటి గౌరవ వేతనం కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. అధికారులను అడిగినా వారు కూడా తెలియదని చెబుతున్నారు. వంట పని మానేస్తున్న కార్మికులు.. వేతనాలు సక్రమంగా అందక.. బిల్లులు సరిగా విడుదల కాక చాలా మంది కార్మికులు విధుల నుంచి తప్పుకుంటున్నారు. బయట వేరే పనిచేసుకున్నా అధికంగా డబ్బు సంపాధించవచ్చని.. ఇక్క నెల రోజులు కష్టపడి పనిచేసినా ఇచ్చేది.. వెయ్యి రూపాయలని.. అదీ సక్రమంగా అందకపోవడంతో చేసేదిలేక చాలా మంది కార్మికులు పని మానేస్తున్నారు. అదేబాటలో మరికొందరు ఉన్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు. జిల్లాలో 1700 మంది కార్మికులు.. జిల్లాలో మధ్యాహ్నా భోజన కార్మికులు దాదాపు 1700 మంది ఉన్నారు. వారు ప్రతి రోజు 1,11, 616 మంది విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. అయితే 2010 నుంచి కార్మికులకు గౌరవ వేతనం ఇస్తున్నారు. అప్పటి నుంచి సక్రమంగా ఇవ్వడం లేదు. దీంతో వారి బాధలు వర్ణనాతీతం. ఆశతో పనిచేస్తున్నాం మేము ఏళ్లతరబడి పనిచేస్తున్నాం. నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. అది ఎటూ సరిపోవడం లేదు. ప్రభుత్వం జీతం పెంచకపోవతుందా అన్న ఆశతో పనిచేస్తున్నాం. ఇచ్చే జీతం కూడా నెల నెల ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీతం పెంచి.. సక్రమంగా విడుదల చేసిన మమ్ములను ఆదుకోవాలి. – రమణ, మధ్యాహ్న భోజన కార్మికురాలు వంట పని మానేయమంటున్నారు.. నెలరోజులు కష్టపడి వంట చేస్తే అతి తక్కువ వేతనం ఇస్తున్నారు. ఎన్నోసార్లు వేతనం పెరుగుతుందని ఎదురుచూశాం.. కానీ పెంచలేదు. వంట పని మానివేయమని ఇంట్లోవాళ్లు అంటున్నారు. ప్రభుత్వం అందరి ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తుంది. మాకు జీతాలైనా పెంచకపోతాతుందా.. అని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం వేతనాలు పెంచాలని కోరుతున్నాం. – స్వప్నారాణి, కార్మికురాలు -
‘భోజనం’ అమలయ్యేనా?
మహబూబ్‌నగర్ మండలంలోని మాసన్‌పల్లికి చెందిన విమల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. నిత్యం 15కిలోమీటర్లు ప్రయాణించి కాలేజీకి వెళ్తుంది. వ్యవసాయ కుటుంబం కావడంతో ఉదయం ఇంటిపని పూర్తి చేసుకుని బస్సు వచ్చే సమయానికి రెడీగా ఉండాలి. ఆమె బయలుదేరే సమయానికి ఇంట్లో వంట పూర్తవదు. దీంతో టిఫిన్ బాక్స్ లేకుండానే వచ్చేస్తుంది. మధ్యాహ్నం వరకు ఎలాగోలా ఉంటున్నా, ఆ తర్వాత పాఠాలు వినలేకపోతోంది. వారంలో నాలుగు రోజులు ఇదే వరుస. ఈ పరి స్థితి ఒక్క విమలదే కాదు.. గ్రామీణ ప్రాంతాల నుంచి నిత్యం కళాశాలలకు వస్తున్న చాలామంది విద్యార్థులది. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిపాదన కొంతకాలంగా ఉన్నప్పటికీ జూలైలో హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులతో జరిగిన సమావేశంలో మధ్యాహ్న భోజనం పథకం అమలుకు సంబం దించి పలుఅంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే భోజనం అందుతుందని విద్యార్థులు ఆనందించారు. కానీ నిర్ణయం వెలువడి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు అమలుకు నోచుకోకపోవడంతో నిరాశ అలుముకుంది. ఎప్పటి నుంచి అమలుచేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం.. గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే చాలామంది విద్యార్థులు ప్రతిరోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ఇంటినుంచి మధ్యాహ్నం భోజనం తీసుకురాలేకపోతున్నారు. ఎదిగే వయస్సులో విద్యార్థులు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల చాలారకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం తగ్గుతున్న క్రమంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పౌష్టికాహారం అందుతుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయని గుర్తించారు. అమలు ఎంతో అవసరం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలు, వృత్తి విద్యా కళాశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలుచేయడం ఎంతో అవసరమని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఈ పథకం ద్వారా అన్ని కళాశాలల్లో కలిపి 20,016 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఎదిగే క్రమంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తే రక్తహీనత, బలహీనత, ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశమే లేదని పేర్కొంటున్నారు. ఇబ్బందులు తప్పేవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు చాలా వరకు జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రంలో ఉన్నాయి. వీటిలో చదివే చాలా మంది విద్యార్థులకు జిల్లాలోని గ్రామాల నుంచి బస్సుతో పాటు పలువాహనాలలో వస్తుంటారు. చాలా గ్రామాలకు సకాలంలో బస్సు సదుపాయం లేక విద్యార్థులు కాలినడకన వస్తున్నారు. ఈ క్రమంలో వారు బయలుదేరే సమయానికి భోజనం ఉండటం లేదు. కాలికడుపుతోనే వచ్చి, చిరుతిళ్లతో సరిపెట్టుకుంటున్నారు. అవి ఏ మూలకూ సరిపోక ఆకలితో నకనకలాడుతున్నారు. శారీర, మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ప్రయాణానికే సరిపోతుంది చాలాకాలంగా కళాశాలలో మధ్యాహ్న భోజనం పెడతారని అందరూ అంటున్నారు. కానీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఇంటి వద్ద అన్ని పనులు పూర్తి చేసుకుని రావాలంటే చదువుకోవడానికి సమయం సరిపోవడం లేదు. ఉదయం, సాయంత్రం ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక భోజనం మీద ప్రత్యేక దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కళాశాలలో విద్యార్థులకు భోజనం పెడితే పెద్ద సమస్య తీరుతుంది. – సరోజ, కోయిల్‌కొండ, బాలికల జూనియర్ కళాశాల వెంటనే అమలు చేయాలి ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెంటనే అమలుచేయాలి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. దీనిద్వారా ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. – అనూష, మానన్పల్లి, బాలికల జూనియర్ కళాశాల ఇబ్బందులు తీర్చాలి నేను నిత్యం మా ఊరు పిల్లగుండుతండా నుంచి కళాశాలకు బస్సులో వస్తున్నాను. ఉదయం బస్సు వచ్చే సమయానికి పనులు పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి. లేదంటే బస్సు పోతుంది. నేను వచ్చే సమయానికి ఇంట్లో వంట కాదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నాలాగే చాలామంది విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. – సురేఖ, పిల్లగుండతండా, బాలికల జూనియర్ కళాశాల -
బడిలో వంట..ఇక ఉండదంట!
ఇంకొల్లు (ప్రకాశం): బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచారం చేశారు. అధికారం వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న జాబులను పీకేస్తున్నాయి. నిబంధనల పేరుతో వరుసగా అంగన్వాడీ, ఆదర్శ రైతులు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ వచ్చారు. చివరికి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే కుకింగ్ ఏజెంట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు పాఠశాలల్లో వంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెక్ పెట్టాయి. ఇక నుంచి బడిలో వంట వండే పని లేదు. ఢిల్లీకి చెందిన ఏక్తా శక్తి అనే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించనున్నారు. 20 కిలో మీటర్ల పరిధిలోని పాఠశాలలను యూనిట్‌గా తీసుకొని అక్కడే వంట సిద్ధం చేసి ఆయా పాఠశాలలకు సరఫరా చేస్తారు. దీనికి గాను ప్రభుత్వం వారికి 2 నుంచి 5 ఎకరాల స్థలం అప్పగించనుంది. 2003వ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాయి. అప్పుడు పాఠశాలల్లో భోజనం వండే వారికి విద్యార్థికి రూ.1.25 చొప్పున కూలి ఇస్తూ వచ్చారు. 15 సంవత్సరాలుగా అనేక మంది ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం నెలల తరబడి వేతనాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా అప్పు చేసి కుకింగ్ ఏజెంట్లు విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జిల్లాలో 3,315 పాఠశాలల్లో 5,500 మంది కార్మికుల జీవితాలు వీధిన పడనున్నాయి. కుకింగ్ ఏజెంట్లు వేడి వేడి భోజనాన్ని సరైన సమయానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో వడ్డించి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే 20 కిలోమీటర్ల నుంచి భోజనం పాఠశాలకు వచ్చే సరికి చల్లారిపోతుంది. చల్లారిన భోజనం తింటే మరలా పసి పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వంట నిర్వహణపై ఎవరి పర్యవేక్షణ ఉండదు. ఎట్టకేలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరి గుండెల్లో రాయి పడినట్లయింది. వీరి గోడు వెళ్లబోసుకుందామని చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లబోతుంటే ముందస్తు అరెస్టులు చేసి భయ భ్రాంతులకు గురి చేసిందీ ప్రభుత్వం. జాబిచ్చింది బాబే.. తీసేస్తుంది బాబే : ఉమ్మడి రాష్ట్రంలో 2003లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకం బాధ్యతను డ్వాక్రా మహిళలకు అప్పగించారు. అప్పటి నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పథకాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ నేడు కార్పొరేటు సంస్థలకు అప్పగించేందుకు బాబు సర్కారు శ్రీకారం చుట్టింది. రానున్న ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెబుతామంటున్నారు కుకింగ్ ఏజెంట్లు. పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. కేవలం రూ.1,000 గౌరవ వేతనంతో 15 సంవత్సరాలుగా ఈ పథకంపై ఆధార పడిన మహిళలు ఉపాధి కోల్పోతారు. ఉద్యోగ భద్రత కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలి. పథకం అమలుకు మౌలిక సదుపాయాలు కల్పించి, పి.ఎఫ్, ఐ.ఎస్.ఐ సౌకర్యాలు కల్పించాలి. – పెంట్యాల కల్పన, మధ్యాహ్న భోజన పథకం కుకింగ్ ఏజెంట్ల జిల్లా కన్వీనర్ మా పొట్ట కొడుతున్నారు ఉసురు తగులుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలకు వంట వండి పెడుతున్నాం. శుభకార్యాలు కూడా పక్కనపెట్టి పిల్లలకే మా సేవలు అంకితం చేస్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం మమ్మల్ని తొలగిస్తామని ప్రకటించటం హేయమైన చర్య. – కె.సత్యవతి, కుకింగ్ ఏజెంటు, ఇంకొల్లు. -
మిడ్డే మిల్స్ అలవెన్స్ పెంచాలని జవదేకర్‌ను కలిసిన కవిత
-
తినే ప్లేట్లతో టాయిలెట్ క్లీన్ చేయించారు..?
సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో దారుణం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్ క్లీన్చేయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో గత గురువారం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లితండ్రులకు తెలియజేయడంతో వారు పాఠశాల ముందు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ శర్మ విచారణకు ఆదేశించారు. ఓ విద్యార్థి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. టాయిలెట్‌లోని మలాన్ని తినే ప్లేట్లతో ఎత్తించారని తన కూతురు పాఠశాల నుంచి ఇంటికి రాగానే తెలిపిందని అప్పటికే పాఠశాల మూసేశారని, దీంతోనే ఉపాధ్యాయులను నిలదీసేందుకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛతపై అవగాహన కోసమే.. అయితే ఈ ఆరోపణలను పాఠశాల ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహాన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని, దీనిలో ఉపాధ్యాయులు కూడా పాల్లొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ రాకేశ్ తెలిపారు. పాఠశాల్లో ఒకటే టాయిలెట్ ఉందని అలాంటప్పుడు విద్యార్థులతో ఎందుకు క్లీన్ చేయిస్తామని ఆయన ప్రశ్నించారు. -
పౌష్టికాహారం పక్కదారి
ఉదయగిరి: అంగన్వాడీ కేంద్రాల్లో పేదలకు అందాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అందజేస్తున్న సరుకుల్లో టెండర్ల నిర్వాహకులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఈ టెండర్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తుండడం వెనుక అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సక్రమంగా సరఫరా కావడం లేదు. అమలు లక్ష్యం దెబ్బతింటోది. పేదలకు అందాల్సిన పౌష్టికాహారం అందని ద్రాక్షపండులా మిగిలిపోతోంది. పేద మహిళలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందక మృత్యువాతపడుతున్నారు. అనారోగ్య శిశువులకు జన్మనిస్తున్నారు. ఈ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు కోడిగుడ్లు, పాలు, బలవర్థక ఆహారం అందించడంతోపాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించే కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ పథకం అమలు క్షేత్రస్థాయిలో అధ్వానంగా ఉంది. జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,774 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. పౌష్టికాహారం లోపం వల్ల 8 ప్రాజెక్టుల్లో మధ్యాహ్న భోజనాన్ని అందించే అమృతహస్తం పథకం గత ఏడాది నుంచి అమలుచేస్తున్నారు. ఈ పథకం ద్వారా సుమారు పదివేల మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మిగిలిన ప్రాజెక్టుల్లో 25,700 మంది గర్భిణులు, 27,300 మంది బాలింతలకు మూడు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, 500 గ్రాముల నూనె, వారానికి 4 కోడిగుడ్లు అందజేస్తున్నారు. 3-6 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రం మధ్యాహ్నం ఒక్కపూట అన్నం, కోడిగుడ్లు, పాలు, ఉడికించిన శనగలు అందించాల్సి ఉంది. సరుకులు స్వాహా?:అంగన్వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్ల ద్వారా సరుకులు అందజేయాలి. సరుకులను జిల్లా కేంద్రం నుంచి ప్రాజెక్టు కేంద్రానికి సరఫరా చేస్తారు. అక్కడినుంచి అంగన్వాడీ కేంద్రాలకు అందించాలి. అయితే ప్రతినెలా క్రమపద్దతి ప్రకారం సరుకుల సరఫరా జరగడం లేదు. రెండు, మూడు నెలలకు ఒకేసారి సరుకులు సరఫరా చేస్తున్నారు. ఇక్కడే సరుకులకు కోత పడుతోంది. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై సరుకులు స్వాహా చేస్తున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే సరుకుల్లో కూడా కోత పడుతోంది. కొంతమంది సూపర్వైజర్లు ఈ సరుకుల్ని కొంతమేర స్వాహాచేసి కేంద్రాలకు పంపుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలోనే లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సరుకులు అందడం లేదు. రవాణాలోనూ తప్పని తిప్పలు: నిబంధనల ప్రకారం జిల్లాకేంద్రం నుంచి ప్రాంతీయ ప్రాజెక్టులకు సరుకులుసరఫరా కావాలి. అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలి. కానీ చాలాచోట్ల అలా జరగడం లేదు. ఐసీడీఎస్ ప్రాజెక్టు నుంచి ఒక్కొక్క మండలంలో రెండు మూడుచోట్లకు సరఫరా చేస్తున్నారు. అక్కడినుంచి ఆ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు తమ సొంత ఖర్చులతో సరుకులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రవాణా భారం కూడా కార్యకర్తలపై పడుతోంది. కార్యకర్తలకు తప్పని వేధింపులు: ప్రాజెక్టుల పరిధిలోని సూపర్వైజర్లు చాలాకాలం నుంచి పాతుకుపోయి ఉండడంతో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమ మాటకు ఎదురుచెప్పే కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. చాలామంది సూపర్వైజర్లు సరుకుల్లో కోత పెట్టడాన్ని ప్రశ్నించిన కార్యకర్తలకు వేధింపులు తప్పడం లేదు. పైగా అమృతహస్తం బిల్లులు, ఇంటి అద్దెలు, కట్టెల బిల్లులు, ఇతర బిల్లుల్లో పర్సంటేజీలను ముక్కుపిండి వసూలుచేస్తున్నారు. కొంతమంది సూపర్వైజర్ల వసూళ్లపర్వంపై కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ప్రయోజనం శూన్యం. అవకతవకలు జరిగితే సహించం సరుకుల సరఫరాలో అవకతవకలు జరిగితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తప్పవు. సిబ్బంది అవినీతికి పాల్పడినా కఠిన చర్యలుంటాయి. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే కార్యకర్తలు నేరుగా మా దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం సరఫరా చేసే ప్రతి గ్రాము సరుకు లబ్ధిదారులకు అందాలి. విజయలక్ష్మి, పీడీ -
మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థినులకు అస్వస్థత
నాదెండ్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఘటన నాదెండ్ల: మధ్యాహ్న భోజనం వికటించి 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన మండల కేంద్రమైన నాదె ండ్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. ప్రభుత్వం గతేడాది ఈ విద్యాలయాన్ని రూ.2కోట్ల వ్యయంతో నిర్మించి అదే ఏడాది ప్రారంభించింది. ఈ విద్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు 160 మంది ఉన్నారు. శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థినుల్లో 18 మందికి తీవ్రమైన కడుపునొప్పి, అనంతరం వాంతులు అయ్యాయి. ఏఎన్ఎం భారతి బాలికలకు ప్రాథమిక చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేర్పించారు. వైద్యాధికారి డాక్టర్ ఆర్. గోపీనాయక్ అత్యవసర చికిత్సలు అందించారు. కల్తీ కందిపప్పు వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు వైద్యులు చెబుతున్నారు. దుడ్డుబియ్యంలో పురుగులు వస్తున్నాయని, మూడురోజులుగా పప్పుతోపాటు మరో కూర వడ్డిస్తున్నారని విద్యార్థినులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ కేవీఎన్ శివకుమార్, సూపర్ వైజర్ కె.శ్రీనివాసరావు, చంద్రశేఖర్ హస్పిటల్‌కు చేరుకుని విద్యార్థినులను పరామర్శించి వైద్యుల నుంచి వివరాలను సేకరించారు. అక్కడి నుంచి విద్యాలయానికి చేరుకుని ఆహార నమూనాలను సేకరించారు. -
సర్కార్ ఇస్కూల్
పైన పోటువల గనిపిస్తున్నది మన మెతుకు సీమలోని ఓ బడి.. నాలుగు కట్టెలు.. సుట్టూ కొన్ని పుల్లలు.. పైన ఎండిన గడ్డి.. కింద ఇసుక.. గిదేం ఇస్కూల్ అంటర.. గిది ఇస్కూలే..15 ఏండ్ల సంది గిట్లనే నడుస్తున్న సర్కార్ ఇస్కూల్.. ఈ బల్లోనే 25 మంది పోరగాండ్లు అచ్చరాలు దిద్దుతుండ్రు.. గాలొచ్చినా.. వానొచ్చినా ఏడ కూల్తదోనని భయపడుతుండ్రు..మరి గింత ఘోరమా.. బంగారు తెలంగాణలో గూడా గిట్లాంటి బడులా..గింతకీ ఈ ఇస్కూల్ ఏడుందంటరా..లోపల పేజీల్ల సదువుండ్రి...అడగాల్సినోళ్లను అడుగుండ్రి...మా పిళ్లగాండ్లకు సక్కని బడులు గట్టించేంతవరకు లొల్లిజేస్తమని గట్టిగ జెప్పుండ్రి.. మర్సిపోయినం సీఎం సాబ్ మనోడే గదా.. సూద్దాం ఏం జేస్తడో కౌడిపల్లి: బడి బయటి పిల్లలు పాఠశాలలో ఉండాలి.. నాణ్యమైన బోధన.. ప్రైవేటు పాఠశాలలకు తీసిపోని వసతులు.. మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం ప్రభుత్వ పాఠశాలల గురించి అధికారులు, పాలకులు చెప్పే మాటలు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ పంచాయతీ కొర్ర సీత్యతండా 35 కుటుంబాలు ఉన్నాయి. తండావాసుల కోరిక మేరకు ఇక్కడ 15 ఏళ్ల క్రితం అధికారులు ఓ పూరి గుడిసెలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ పూరి గుడిసెలోనే పాఠశాల కొనసాగుతోంది. ఒక్కో ఏడాది 15 నుంచి 25 మంది వరకు ఈ పూరిగుడిసెలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. చాలాసార్లు తనిఖీ చేసేందుకు ఇక్కడికొచ్చిన అధికారులు పక్కా భవనం మంజూరు చేస్తామంటూ హామీలిచ్చారు. కానీ అది ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇదిలావుంటే మూడేళ్ల క్రితం పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ పాఠశాలను కూడా మరోపాఠశాలలో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు ఇక్కడి నుంచి కాలినడకన మరోచోట ఉన్న పాఠశాలకు వెళ్లి విద్యాభ్యాసం కొనసాగించేవారు. వర్షాకాలంలో కాలినడకన అంతదూరం వెళ్లడం ఇబ్బందిగా మారడంతో చాలా మంది చదువులకు స్వస్తి చెప్పారు. దీంతో తండావాసులంతా అధికారులకు మొరపెట్టుకోగా, రెండేళ్ల క్రితం కొర్ర సీత్యతండాలో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. అయితే కూలేందుకు సిద్ధంగా ఉన్న పూరిపాకలోనే మళ్లీ పాఠశాల కొనసాగించారు. గతంలో ఈ పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయుడు ఉండగా, విలీనం తర్వాత ఉపాధ్యాయుడూ కరువయ్యాడు. దీంతో రెండేళ్లుగా విద్యావలంటీర్లే ఇక్కడి విద్యార్థులకు చదువులు చెప్పారు. అయితే ఈ విద్యాసంవత్సరం విద్యావాలంటీర్ల నియమించని అధికారులు దయ్యలతండా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను డిప్యూటేషన్‌పై ఇక్కడికి పంపారు. ప్రస్తుతం పాఠశాలలో 12 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న పూరిగుడిసెలో బిక్కుబిక్కుమంటూ భవిష్యత్‌ను దిద్దుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామంలోని పాఠశాలకు పక్కా భవనం మంజూరు చేయడంతో పాటు రెగ్యులర్ ఉపాధ్యాయున్ని నియమించాలని తండావాసులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎంఈఓ రాజారెడ్డిని వివరణ కోరగా పాఠశాలకు పక్కా భవనంతో పాటు ఉపాధ్యాయుడిని కేటాయించాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.