ఇంకొల్లు (ప్రకాశం): బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచారం చేశారు. అధికారం వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న జాబులను పీకేస్తున్నాయి. నిబంధనల పేరుతో వరుసగా అంగన్‌వాడీ, ఆదర్శ రైతులు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ వచ్చారు. చివరికి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే కుకింగ్ ఏజెంట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సర్కారు పాఠశాలల్లో వంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెక్ పెట్టాయి. ఇక నుంచి బడిలో వంట వండే పని లేదు. ఢిల్లీకి చెందిన ఏక్తా శక్తి అనే ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించనున్నారు. 20 కిలో మీటర్ల పరిధిలోని పాఠశాలలను యూనిట్‌గా తీసుకొని అక్కడే వంట సిద్ధం చేసి ఆయా పాఠశాలలకు సరఫరా చేస్తారు. దీనికి గాను ప్రభుత్వం వారికి 2 నుంచి 5 ఎకరాల స్థలం అప్పగించనుంది.
2003వ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాయి. అప్పుడు పాఠశాలల్లో భోజనం వండే వారికి విద్యార్థికి రూ.1.25 చొప్పున కూలి ఇస్తూ వచ్చారు. 15 సంవత్సరాలుగా అనేక మంది ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం నెలల తరబడి వేతనాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా అప్పు చేసి కుకింగ్ ఏజెంట్లు విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జిల్లాలో 3,315 పాఠశాలల్లో 5,500 మంది కార్మికుల జీవితాలు వీధిన పడనున్నాయి. కుకింగ్ ఏజెంట్లు వేడి వేడి భోజనాన్ని
సరైన సమయానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో వడ్డించి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే 20 కిలోమీటర్ల నుంచి భోజనం పాఠశాలకు వచ్చే సరికి చల్లారిపోతుంది. చల్లారిన భోజనం తింటే మరలా పసి పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వంట నిర్వహణపై ఎవరి పర్యవేక్షణ ఉండదు. ఎట్టకేలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరి గుండెల్లో రాయి పడినట్లయింది. వీరి గోడు వెళ్లబోసుకుందామని చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లబోతుంటే ముందస్తు అరెస్టులు చేసి భయ భ్రాంతులకు గురి చేసిందీ ప్రభుత్వం.
జాబిచ్చింది బాబే.. తీసేస్తుంది బాబే :
ఉమ్మడి రాష్ట్రంలో 2003లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకం బాధ్యతను డ్వాక్రా మహిళలకు అప్పగించారు. అప్పటి నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పథకాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ నేడు కార్పొరేటు సంస్థలకు అప్పగించేందుకు బాబు సర్కారు శ్రీకారం చుట్టింది. రానున్న ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెబుతామంటున్నారు కుకింగ్ ఏజెంట్లు.
పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోం
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. కేవలం రూ.1,000 గౌరవ వేతనంతో 15 సంవత్సరాలుగా ఈ పథకంపై ఆధార పడిన మహిళలు ఉపాధి కోల్పోతారు. ఉద్యోగ భద్రత కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలి. పథకం అమలుకు మౌలిక సదుపాయాలు కల్పించి, పి.ఎఫ్, ఐ.ఎస్.ఐ సౌకర్యాలు కల్పించాలి.
– పెంట్యాల కల్పన, మధ్యాహ్న భోజన పథకం కుకింగ్ ఏజెంట్ల జిల్లా కన్వీనర్
మా పొట్ట కొడుతున్నారు ఉసురు తగులుతుంది
ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలకు వంట వండి పెడుతున్నాం. శుభకార్యాలు కూడా పక్కనపెట్టి పిల్లలకే మా సేవలు అంకితం చేస్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం మమ్మల్ని తొలగిస్తామని ప్రకటించటం హేయమైన చర్య. – కె.సత్యవతి, కుకింగ్ ఏజెంటు, ఇంకొల్లు.
Comments
Please login to add a commentAdd a comment