అనంతపురం ఎడ్యుకేషన్: పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన ముద్రను కనపరుస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనం రెండింతలు చేశారు. రూ.1000 స్థానంలో రూ.3వేలకు పెంచిన గౌరవ వేతనం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనం రూ.1000లు అమలు చేశారు. అప్పటి నుంచి అంతే మొత్తం అందుతోంది. గౌరవ వేతనం పెంచాలంటూ ఏళ్ల తరబడి పోరాటాలు చేసినా ఫలితం లేకపోయింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే గౌరవ వేతనం రెండింతలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
గతంలో ఏ నెలలోనూ సక్రమంగా గౌరవ వేతనం ఇచ్చిన సందర్భం లేదని, కొత్త ప్రభుత్వంలో అలాంటి సమస్య ఉత్పన్నం కాదనే ఆశాభావం కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7561 మంది ఎండీఎం కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ. వెయ్యి ప్రకారం నెలకు రూ.75,61,000 గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో గౌరవ వేతనం రెండింతలు కాగా.. ఇక నుంచి ప్రతి నెలా ప్రభుత్వంపై రూ.1,51,22,000 అదనపు భారం పడనుంది. ఇదిలాఉంటే ఇక నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ‘వైఎస్సార్ అక్షయపాత్ర’గా పేరు మార్పు చేశారు. పథకం అమలు, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని.. పరిశుభ్రత పాటించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. రానున్న రోజుల్లో కార్మికులకు భోజనం తయారు చేసే పనిని తగ్గించి కేవలం వడ్డనకే పరిమితం చేస్తామన్నారు. వంట తయారీకి ఆధునిక వంటశాలలు నిర్మించాలని సీఎం ఆదేశించడం పట్ల కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
అడ్రస్ లేని కోడిగుడ్లు
మొన్నటిదాకా అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం పథకం అమలు అధ్వానంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి అమలులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా.. ఫిబ్రవరి నుంచి కోడిగుడ్లు ఇవ్వడమే మానేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి సంబంధిత ఏజెన్సీకి పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోయింది. సదరు ఏజెన్సీకి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టడంతో కోడిగుడ్లు సరఫరా చేసేందుకు వెనుకడుగు వేశారు. పిల్లలకు పౌష్టికారాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అప్పటి సీఎం చంద్రబాబు పదేపదే ప్రకటనలు చేసినా.. కోడిగుడ్ల సరఫరా ఆగిపోయినా పట్టించుకోకపోవడం గమనార్హం.
మా కష్టాలను గుర్తించారు
కొత్త ముఖ్యమంత్రి మా కష్టాలను గుర్తించారు. వెయ్యి రూపాయల గౌరవవేతనం ఏ మూలకు సరిపోయేది కాదు. రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. – లక్ష్మిదేవి, బుళ్లసముద్రం, మడకశిర మండలం
చంద్రబాబు మోసం చేశారు
గౌరవ వేతనం పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తూ జీఓ ఇచ్చినా బడ్జెట్ కేటాయించలేదు. ఎన్నికల ముందు ప్రకటన చేసి చేతులు దులుపుకొన్నారు. పెంచిన గౌరవ వేతనానికి సంబంధించి ఫిబ్రవరి నుంచి అరియర్స్ ఇచ్చేలా చూడాలి. – నాగమణి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment