సమావేశానికి హాజరైన అధికారులు
మెదక్ అర్బన్: ప్రతి పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించేలా ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యంతో పాటు మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన పోషకాలను అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
ఈ కార్యక్రమం కేవలం విద్యార్థులను ఉద్దేశించి ఏర్పాటు చేసిందేనని అన్నారు. ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అన్నంతో పాటు విధిగా కూరగాయలు, పప్పులు, ఆకుకూరలతో పాటు గుడ్లను సైతం అందించిప్పుడే విద్యార్థి ఎదుగుదలకు సరిపడా పోషకాలు అందుతాయన్నారు. అమలులో నిర్లక్ష్యం వహించే నిర్వాహకులకు నోటీసులు అందించాలన్నారు. అయినా పరిస్థితుల్లో మార్పు లేనట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు వచ్చే బియ్యం దిగుమతి చేసుకోవాలన్నారు. పాఠశాలలకు వచ్చే బియ్యం తూకంలో తక్కువ వస్తే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
ప్రతి పాఠశాలలో కిచెన్‌షెడ్ల నిర్మాణానికి పాఠశాల యాజమాన్య కమిటీలో చర్చించాలని అన్నారు. పాపన్నపేట మండలంలోని కస్తూర్బా పాఠశాల, ఉన్నత పాఠశాలకు భగీరథ కనెక్షన్లు అందించాలని ఆదేశించి మూడు నెలలు దాటినా ఇప్పటికీ నీరందించకపోవడంపై ఈఈ కమలాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది ఇళ్లు ఉన్న ఆవాసాలకు సైతం మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా నీటి కనెక్షన్లు అందిస్తున్నామని... అలాంటిది 350 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలకు నీటి కనెక్షన్లు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మూడు నెలల కిందట నీటి కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఇప్పటికీ ఆ పాఠశాలలో నీటి సరఫరా కావడం లేదన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావాలని కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు.
అలాగే ప్రతి పాఠశాలకు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలను ప్రధానోపాధ్యాయులు తమ సొంత ఆస్తిలా భావించాలని, ప్రభుత్వం లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే భవనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ రవికాంతరావు, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, నోడల్ అధికారి మధుమోహన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీటీడబ్ల్యూఓ వసంతరావు, జ్యోతిపద్మ, డీపీఆర్వో శైలేశ్వర్‌రెడ్డి, ఏడీలు భాస్కర్, భాస్కర్‌రావు, సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్, సుభాష్‌తో పాటుఆయా మండలాల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment