విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు
బజార్‌హత్నూర్(బోథ్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు సర్కారు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్నో వ్యయ, ప్రయాసాలకు ఓర్చి నిర్వాహకులు వంట చేసి భోజనం పెడుతున్నా బిల్లులు మాత్రం నెలనెలా రావడం లేదు. దీంతో అప్పులు చేసి విద్యార్థులకు వండి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.
మూడు నెలలుగా రాని బిల్లులు
జిల్లాలో మొత్తం 68,382 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అందులో భాగంగా 2018 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మొత్తం 56 పనిదినాల్లో 68,382 మంది విద్యార్థులకు అందించిన మధ్యాహ్నం భోజనం బిల్లులు రూ.2,63,89,728లను ప్రభుత్వం చెల్లించకపోవడంతో నిర్వాహకులు అప్పులు చేసి మరి ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.అందుబాటులో డబ్బులు లేక నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లిస్తే తప్పా మధ్యాహ్న భోజన కార్యక్రమం కొనసాగే పరిస్థితి కనపడటం లేదు. 9–10వ తరగతుల విద్యార్థులు మధ్యాహ్న భోజన బిల్లులు జూలై నుంచి డిసెంబర్ వరకు బిల్లులు రాలేదు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే మొదటి మూడు నెలలకు సంబంధించి రూ.43,62,000 బిల్లులు మంజూరయ్యాయని, త్వరలో నిర్వాహకులకు అందిస్తామని తెలిపారు.
గిట్టుబాటు కాని చార్జీలు
కూరగాయలు పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ మేరకు ఏజెన్సీలకు బిల్లులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నెలనెలా బిల్లులు చెల్లించకపోవడం, చార్జీలు పెంచకపోతే రోజు కూరగాయలు పెట్టడం సాధ్యం కాదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచకపోవడంతో భోజనంలో కూడా నాణ్యత లోపిస్తోంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొరికి రోజుకు రూ.4.13పైసలు, సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు పెడితే అదనంగా రూ.4.. 6నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.6.18పైసలు సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు పెడితే అదనంగా రూ.4.. 9, 10వ తరగతులకు గుడ్డుతోపాటు భోజనానికి రూ.8.18చొప్పున ఏజెన్సీలకు చెల్లిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఈ మొత్తాన్ని ప్రభుత్వం పెంచడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఏ కూరగాయల ధరలు చూసిన కిలోకు రూ.50కు తక్కువ లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలతో గిట్టుబాటు కాకా నిర్వాహకులు ఆలుగడ్డ, చారు, పలుచని పప్పుకే పరిమితమవుతున్నారు. ఇతర కూరగాయలు లేకపోవడంతో భోజనం రుచించక, విద్యార్థులు సగం కడుపుతో సరిపెట్టుకుంటున్నారు.
మెనూ ప్రకారం భారమే అయినా..
మధ్యాహ్న భోజనం మెనూలో సర్కారు కూరగాయలతో కూడిన భోజనంతోపాటు వారంలో సోమ, బుధ, శుక్రవారం గుడ్డు అందించాలని పలు మార్పులు చేసింది. దీనిపై జూన్‌లోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో రాష్ట్రంలో మధ్యాహ్నభోజనం అమలు తీరును పరిశీలించిన కేంద్ర బృందం మెనూ మార్చాలని సూచించింది. రకరకాల కూరగాయలు, బఠానీ పలావ్, కూరగాయలతో కూర్మా, కాబులీ శనగలు, కూరగాయలతో బిర్యాణి, మిల్‌మేకర్ బిర్యాణి, మునగకాయ, పెసర పప్పుతో కిచిడీ, చట్నీ, అన్నం, టమాటా, బఠానీల కూర, సోయాచిక్కుడు వంటి కూరలు ఉండాలని నిర్ధేశించింది. తదితర పదార్థాలతో వండి పెడితే విద్యార్థులు ఇష్టంగా తినడంతోపాటు వారికి పౌష్టికాహరం అందించనట్లు కూడా ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వాహకులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం భారమే అయినా కూరగాయలు కొని భోజనం పెడుతున్నారు. కానీ బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
కనీసం రూ.15 చెల్లిస్తేనే..
జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 1,153 పాఠశాలలు ఉండగా, 68వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిపై మధ్యాహ్న భోజన పథకం కింద గుడ్డు అందించిన రోజు రూ.5.91లక్షలు, గుడ్డు లేని రోజు రూ.3.59లక్షలకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నాణ్యమైన భోజనం అందాలంటే ఒక్కో విద్యార్థిపై కనీసం రూ.15 వంతున చెల్లించాలని ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు అదనంగా ప్రతీ రోజు మరో రూ.3లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే భోజనంలో నాణ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
భారమైతంది
నేను వృధ్యాప్యలో ఉండటంతో వ్యవసాయ కూలీగా వెళ్లే పరిస్థితి లేనందున నీడపట్టున ఉంటూ మధ్యాహ్న భో జనం వంటచేసి పెడుతున్నాను. కానీ ప్రభుత్వం బిల్లులు నెలల తరబడి చెల్లించకపోవడంతో ఉపాధ్యాయుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. ఒక నెల ఎలాగోలా సర్ధుకపోవచ్చు కాని 3 నెలలు బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా భారమైతంది. – కమలాబాయి, నిర్వాహకురాలు
నెలనెలా చెల్లించాలి
మధ్యాహ్నభోజన నిర్వాహకులంతా రోజు కూలీలే. వారి వద్ద వేల రూపాయలు జమ ఉండవనే విషయం ప్రభుత్వానికి తెలిసినా బిల్లుల విషయంలో నిర్లక్ష్యం చేయడం సరికాదు. అప్పులు చేసి వడ్డీలు కట్టే పరిస్థితుల్లో లేము. అలా కట్టాలంటే మా రోజు కూలీ వడ్డీకే సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలాగే మధ్యాహ్నభోజనం బిల్లులు నెలనెలా చెల్లించాలి. – కర్వల పోసాని, నిర్వాహకురాలు
బడ్జెట్ విడుదలైతే బిల్లులు చెల్లిస్తాం
జిల్లాలో 1,153 పాఠశాలల మధ్యాహ్న భోజనం బిల్లులు గత 3 నెలలకు రూ.2.63 కోట్లు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. 9–10వ తరగతి విద్యార్థులు మధ్యాహ్న భోజన బిల్లులు జూలై నుంచి డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉండే. అందులో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మొదటి మూడు నెలలకు సంబంధించిన రూ.43,62,000 ఇటీవల మంజూరయ్యాయి. త్వరలో వాటిని నిర్వాహకులకు అందిస్తాం. మిగతా మూడు నెలల బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయగానే చెల్లిస్తాం. – రవీందర్‌రెడ్డి, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment