mess charges
-
సమస్యల వలయంలో సం‘క్షామ’ హాస్టళ్లు
నీళ్ల పప్పు.. ఉడికీ ఉడకని అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో రోజూ ఇదే మెనూ. ఈ భోజనాన్ని తినలేక పిల్లలు అల్లాడిపోతున్నారు. చలి వణికిస్తోంటే కప్పుకోవడానికి దుప్పట్లు లేక విలవిల్లాడిపోతున్నారు. ఓ వైపు దోమల మోత.. మరో వైపు బయటి నుంచి దుర్గంధం వెదజల్లుతుండటంతో రాత్రిళ్లు పడుకోలేకపోతున్నారు. ‘ఇదేంటయ్యా..’ అని పిల్లల తల్లిదండ్రులు వార్డెన్లను ప్రశ్నిస్తే.. ‘మేమేం చేయాలి.. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.. ఎన్ని రోజులని మేం అప్పులు చేసి తెచ్చిపెట్టాలి? ఇప్పటికే చాలా వరకు అప్పులు చేశాం.. ఆ అప్పు తీరిస్తేనే కొత్తగా సరుకులు ఇస్తామని కిరాణా కొట్ల వాళ్లు చెబుతున్నారు. పై ఆఫీసర్లకు రోజూపరిస్థితి చెబుతూనే ఉన్నాం. వారు అంతా విని ఫోన్ పెట్టేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుప్పట్లు కూడా ఇవ్వలేదు. అవన్నీ పక్కన పెట్టినా.. కనీసం మెస్ చార్జీలన్నా సమయానికి ఇవ్వాలి కదా..’ అంటూ వాపోతున్నారు. వార్డెన్లే ఇలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు బిక్కమోహం వేసుకుని చూడాల్సిన దుస్థితి. సరిగ్గా ఐదు నెలలకు ముందు వరకు వారంలో రోజుకొక మెనూతో చక్కటి భోజనం తిన్న విద్యార్థులు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత పరిస్థితిపై వాపోతున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : మానవత్వం లేని కూటమి సర్కారు తీరుతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓ వైపు చలి వణికిస్తుండగా, మరోవైపు పిల్లలకు సరైన భోజనం కరువైంది. చాలా చోట్ల మరుగుదొడ్లు, మంచి నీటి సమస్యతో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. వారికి క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన వస్తువులతోపాటు కాస్మోటిక్, మెస్ చార్జీలు విడుదల చేయడం లేదు. ఈ దిశగా కూటమి పార్టీల నేతలు ఎన్నికల ముందు హామీలు గుప్పించి ఐదు నెలలైనా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో 3,836 హాస్టళ్లు, గురుకులాల్లో చదివే 6,34,491 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర పేద వర్గాల విద్యార్థులతోపాటు వాటిలో పని చేస్తున్న 36,537 మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ప్రతి సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి ఏటా స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో ఒక దుప్పటి, ఒక కార్పెట్, రెండు టవళ్లు, ప్లేటు, గ్లాసు, బౌలు, ట్రంకు పెట్టె ఇవ్వాలి. ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికి రోజుకు రూ.46 చొప్పున డైట్ బిల్లు (మెస్ చార్జీలు) ఇవ్వాలి. మూడు నెలలు (ప్రస్తుతం నాల్గవ నెల)గా ఈ బిల్లులు పెండింగ్ పెట్టడంతో హాస్టల్, గురుకులాల నిర్వాహకులే చేతి నుంచి డబ్బులు పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు, బార్బర్ ఖర్చులను తల్లుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు సైతం ఐదు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం కంటింజెంట్ బిల్లులు కూడా విడుదల చేయలేదు. ఈ నిధులను స్టేషనరీ, నిత్యావసర వస్తువులు, హెల్త్ కిట్స్, రిపేర్లు వంటి అత్యవసరమైన వాటికి ఖర్చు పెడతారు. ఒక్కొక్క హాస్టల్, గురుకులానికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కంటింజెంట్ అవసరాలు ఉంటాయి.అంతటా అవే సమస్యలే..» ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందడం లేదు. చాలా చోట్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. మంచి నీరు సరిగా ఉండదు. మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ మూలన పడింది. బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో 88 మంది విద్యార్థినిలు నేల మీదే పడుకుంటున్నారు. వీరికి కనీసం దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదు. అవనిగడ్డ ఎస్సీ బాలికల వసతి గృహంలో మే నుంచి కాస్మటిక్స్ ఛార్జీలు ఇవ్వ లేదు. ఏ ఒక్క హాస్టల్లోనూ సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. » గుంటూరు నగరంలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. మార్చి నుంచి సంక్షేమ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు రాలేదు. దీంతో వార్డెన్ న్లు అప్పు తీసుకువచ్చి విద్యార్థినులకు ఆహారం పెట్టాల్సిన పరిస్థితి. జూన్ నెలలో ఇవ్వాల్సిన దుప్పట్లు, ప్లేట్లు, గ్లాస్లు ఇంత వరకు ఇవ్వలేదు. » ఒంగోలు జిల్లాలోని చాలా వరకు హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. వారంలో 6 సార్లు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరోజుతో సరిపెడుతున్నారు. ప్రతి రోజూ పాలు అందించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో కనిగిరి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2లో 45 మందికి గాను ముగ్గురు పిల్లలే హాస్టల్లో ఉన్నారు. పామూరు పట్టంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో 30 మందికి గాను ఒక్క విద్యార్థి మాత్రమే కనిపించాడు. గిద్దలూరు బేస్తవారిపేటలోని బీసీ హాస్టల్లో వాచ్మెన్, అటెండర్లే వంట చేస్తున్నారు.» ఏలూరు జిల్లాలోని హాస్టళ్లలో చలికి తట్టుకోలేక చాలా మంది పిల్లలు హాస్టల్ వదిలి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 400 మంది విద్యార్థులకు ఇప్పుడు 50 మంది మాత్రమే ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని హాస్టళ్లలో పారిశుద్ధ్యం బాగోలేక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. » కాకినాడ జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లలో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అధ్వాన పారిశుద్ధ్యం వల్ల పందులు, దోమలతో సావాసం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల పాఠశాల ప్రాంగణం అధ్వానంగా తయారైంది. సామర్లకోట బీసీ బాలికల వసతి గృహం చుట్టూ తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పిఠాపురం బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్లో భద్రత కరువైంది. చివరకు బాలికలు దుస్తులు మార్చుకునే సౌకర్యం కూడా లేదు. రాత్రి పూట విద్యుత్ పోయిందంటే హాస్టల్లో అంధకారమే. » విజయనగరం జిల్లా కేంద్రంలో కాటవీధిలోనున్న బీసీ సంక్షేమ వసతి గృహంలో కోండ్రు సాంబశివరావు అనే విద్యార్థి ఇటీవల మృత్యువాతపడ్డాడు. కారణమేమిటో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ ఘటనతో ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థుల్లో చాలా మంది మళ్లీ తిరిగి హాస్టల్లో అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత మూడు నాలుగు నెలల్లో 8 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మరణించారు.» విశాఖపట్నం జిల్లాలో కాస్మొటిక్ చార్జీలు ఇవ్వలేదు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై నివేదికలు పంపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనకాపల్లి జిల్లాలో బాలికల హాస్టళ్లన్నింటిలో సీసీ కెమెరాల్లేవు. విద్యార్థులకు దోమ తెరలు, దుప్పట్లు, జంబుకానాలు ఇవ్వలేదు. అల్లూరి జిల్లాలోనూ అదే పరిస్థితి. » బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో కనీస వసతులు కరువయ్యాయి. గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య తగ్గింది.» మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్వగ్రామమైన కర్నూలు జిల్లా లద్దగిరిలో బాత్రూమ్లు లేక పిల్లలు ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. కోసిగిలో పందుల బెడద తీవ్రంగా ఉంది. నంద్యాలలోని ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహాల్లో నీటి సౌకర్యం లేదు. విద్యార్థులు బహిర్భూమికి ముళ్ల పొదలు, రైల్వే ట్రాక్ వద్దకు వెళుతున్నారు. శ్రీశైలం, సున్నిపెంట వసతి గృహాలకు ప్రహరీ లేదు. ఈ హాస్టళ్లు నల్లమల అభయారణ్యం పరిధిలో ఉన్నందున అడవి జంతువులు ఎప్పుడు దాడి చేస్తాయోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలుమార్లు వసతి గృహాలకు సమీపంలో చిరుతలు సంచరించాయి. ప్యాపిలి ఎస్సీ వసతి గృహంలో మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పాణ్యంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో మంచి నీటి సమస్య ఉంది. » చిత్తూరులో ఎస్సీ ప్రీ మెట్రిక్ వసతి గృహంలో కుక్, కామాటి, వార్డెన్ లేరు. వాచ్మెన్ బంధువులతో అనధికారికంగా వంటలు వండిస్తున్నారు. జిల్లాలోని చాలా హాస్టళ్లలో వార్డెన్లు చేతి నుంచి ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు. చౌడేపల్లిలో మరుగుదొడ్లు సహా వసతి గృహాన్ని బాలురే శుభ్రం చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోని బీసీ, ఎస్టీ వసతి గృహాల్లో మరుగు దొడ్లకు నీటి సౌకర్యం లేదు. నిధుల లేమితో తిరుపతిలోని హాస్టళ్లలో ఐదు నెలలుగా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. కడుపునిండా భోజనం కరువు..ప్రభుత్వం మూడు నెలలుగా డైట్ చార్జీలు ఇవ్వక పోవడంతో హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు ఎలా భోజనం పెట్టాలో తెలియక వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. సరుకులను అప్పుపై తెచ్చి వంట చేయించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. పెద్ద మొత్తంలో సరుకులను అప్పుగా ఇవ్వడానికి దుకాణదారులు ముందుకు రావడం లేదని గ్రామీణ ప్రాంత హాస్టల్, గురుకులాల వార్డెన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో విద్యార్థులకు అందించే ఆహారంలో పూర్తిగా నాణ్యత కరువైంది. నీళ్ల చారు, నాసిరకం అన్నంతో కడుపు నింపుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే సమస్యలు.. ఆపై ఆకలి కేకలతో హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. మరో వైపు భద్రత కరువైంది. ఎవరు పడితే వారు హాస్టల్ ప్రాంగణంలో వచ్చి పోతుంటారు. ఎవరు వస్తున్నారో.. ఎందుకు వస్తున్నారో అడిగే నాథుడే ఉండడు. ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ ఇటీవల హైకోర్టు ప్రాథమికంగా పలు మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదు.హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా..» హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. » హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. » హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.» మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. » భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. » సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ళీ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. » హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి.ఆత్మరక్షణకు వర్క్‌షాపులు నిర్వహించండి » హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. » తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్‌షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. » హాస్టళ్లలో సమ వయస్కులతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే గుర్తించి సరిచేయాలి. » హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీనిమహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. -
పిల్లలు తక్కువుంటే విలీనమే..!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మెస్ చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాలను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సమీక్షించడంతో పాటు సమీపంలో ఉన్న హాస్టళ్లలో సర్దుబాటు చేసే అవకాశాలపై నివేదిక తయారు చేయాల ని సంక్షేమ శాఖలను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం సంక్షేమ వసతిగృహాలు, గురుకుల వి ద్యా సంస్థలతో పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో డైట్ చార్జీల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ పా ల్గొన్నారు. డైట్ చార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఇదే క్రమంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేసి మెరుగైన వసతులు కల్పించే అంశంపైనా చర్చించారు. కనీసం 50 మంది విద్యార్థులుంటే.. సగటున ఒక సంక్షేమ హాస్టల్లో కనీసం 50 మంది విద్యార్థులుండాలి. దాదాపు వంద మందికి వసతులు కల్పిస్తూ హాస్టల్‌ను అందుబాటులోకి తెచ్ఛినప్పటికీ... అందులో కనీసం సగం మంది పిల్లలుంటేనే మెరుగైన సర్విసులు కల్పించవచ్చు. అలాకాకుండా 15 నుంచి 25 మంది విద్యార్థులుంటే ఖజానాపైనా భారం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను గుర్తించాలని, అదేవిధంగా వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేసే అంశాలపై పూర్తిస్థాయి నివేదికను జిల్లాల వారీగా రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయాలకు పంపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,550 సంక్షేమ వసతిగృహాలున్నాయి. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ చాలాచోట్ల ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో ప్రీమెట్రిక్ హాస్టళ్లను పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మార్పు చేశారు. ఇంకా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రులు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
ధరలు వంద శాతం పెరిగితే, మెస్ చార్జీలు 25% పెంపా?
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులపై సీఎం కేసీఆర్ కలగజేసుకొని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యావసరాల ధరలు 100 శాతం పెరిగితే, మెస్‌చార్జీలు 25 శాతం మాత్రమే పెంచుతామనడంలో ఎలాంటి హేతుబద్ధత లేదని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, విద్యార్థుల మెస్ చార్జీలను 25 శాతం మేర పెంచాలని మంత్రివర్గ ఉపసంఘ సమావేశం నిర్ణయించడం హర్షణీయమైనప్పటికీ, ఈ నిర్ణయం గుడ్డిలో మెల్ల లాగా మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. పెరిగిన -
విద్యార్థుల మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలి
విజయనగర్ కాలనీ: పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడంతో పాటు 16 లక్షల కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అంజి, నీల వెంకటేశ్, రామకృష్ణ నాయకత్వంలో మాసాబ్‌ట్యాంక్ బీసీ సంక్షేమ భవన్‌ను వేలాది మంది విద్యార్థులతో కలిసి ముట్టడించారు. ముట్టడిలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ ఆరేళ్ల కిందటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, ఇటీవల పెరిగిన నిత్యావసర ధరల నూనెలు, పప్పులు, కూరగాయలు తదితర ఆహార వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. హోటల్లో ఒక్క పూట భోజనం కనీసం రూ.60 ఉందని, హాస్టల్ విద్యార్థులకు పూటకు రూ.10 ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలకు నెలకు రూ.2,100 ఇస్తూ, హాస్టల్ విద్యార్థులకు రూ.950 ఇవ్వడంలో ఏమైనా న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. 2013 వరకు కోర్సు ఫీజులు మంజూరు చేశారని, 2014 నుంచి ప్రభుత్వం పూర్తి ఫీజు స్కీమ్‌కు పరిమితులు విధిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తోందన్నారు. కార్యక్రమంలో తిరుపతి, అనిల్, అనంతయ్యలతో పాటు వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. -
పెరిగిన ధరల మేరకు స్కాలర్షిప్ ఇవ్వాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం (హైదరాబాద్): పెరిగిన ధరల మేరకు విద్యార్థులకు ఇచ్చే ఉప కారవేతనాలను కూడా పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు రెండేళ్లుగా బకాయి ఉన్న రూ.3,500 కోట్ల ఫీజులను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలో 16 బీసీ సంఘాలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్ రూ.1,800 నుంచి రూ. 5,000కు, కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,500 నుంచి 1,800కు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2,000లకు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీబంధు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. జూనియర్ అడ్వొకేట్లకు స్టైపెండ్‌ను రూ.10 వేలకు పెంచాలన్నారు. -
మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలి
కవాడిగూడ: నాణ్యమైన భోజ నం లేక హాస్టల్ విద్యార్థులు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఐదేళ్ల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగానే మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద ఆదివారం నిర్వహించిన మహాధర్నాలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 లక్షలమంది హాస్టల్ విద్యార్థులకు తక్షణమే మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాలేజీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు రూ.1500 నుంచి 3000 వరకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా దామాషా ప్రకారం మరో 240 గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, రాజ్‌కుమార్, సతీష్, అనంతయ్య, నిఖిల్, భాస్కర్, ప్రజాపతి మల్లేష్, సందీప్, వంశీ, వందలాదిమంది గురుకుల హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
భారీగా దివ్యాంగుల మెస్ చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల మెస్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. సాధారణ విద్యార్థుల కంటే కనీసం 25% అధి కంగా మెస్ చార్జీలు చెల్లించాలని వికలాంగుల చట్టం–2016 చెబుతోంది. ఇందులో భాగంగా మెస్ చార్జీలు పెంచాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపింది. దీంతో స్పందించిన ప్రభుత్వం రెండ్రో జుల క్రితం పెంచిన మెస్ చార్జీలపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి డి.దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రీమెట్రిక్ కేటగిరీలో 3 నుంచి 7వ తరగతి దివ్యాంగ విద్యార్థులకు నెలకు రూ.950 నుంచి రూ.1200కు పెంచింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1500కు పెంచింది. పోస్టుమెట్రిక్ కేటగిరీలో ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే దివ్యాంగ విద్యా ర్థులకు నెలకు రూ.1500 నుంచి రూ.2 వేలకు పెంచింది. -
మెస్ చార్జీలు రూ.2,500కు పెంచాలి
కవాడిగూడ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెస్ చార్జీలను రూ.1,500 నుంచి రూ.2,500కు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్‌చేశారు. ఆదివారం వందలాది మంది హాస్టల్ విద్యార్థులతో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం 2008లో నూతన వసతి గృహాలు, కాలేజీలు, ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని నిరాహార దీక్ష చేయగా ప్రభుత్వం దిగొచ్చి హామీలు అమలు చేసిందని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 27 శాతం, ఎమ్మెల్యేలకు 50 శాతం వేతనాలు పెంచడం ఏం ధర్మమని ప్రశ్నించారు. హాస్టల్ విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్న అనంతరం రెండేళ్లపాటు ప్రభుత్వం వారికి కోచింగ్ ఇప్పించి వసతి కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ సంఘాల నేతలు మల్లేశ్‌యాదవ్, దాసు సురేశ్, సతీశ్, నర్సింహగౌడ్, కృష్ణయాదవ్, చంటి ముదిరాజ్, వెంకట్, చరణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు రూ.6 కోట్లు?
సాక్షి, కరీంనగర్ : సంక్షేమ హాస్టళ్లు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. నెలనెలా రావాల్సిన మెస్ చార్జీలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ వార్డెన్లకు తలకుమించిన భారంగా మారింది. హాస్టళ్లల్లో చదివే పిల్లల భోజనం, ఇతర సదుపాయాలకు నిధుల కొరత ఏర్పడింది. పేద విద్యార్థులకు అన్నం పెట్టేందుకు ఇచ్చే డైట్ చార్జీలు ఏడు నెలలుగా అందడంలేదు. దీంతో వార్డెన్లు అప్పులు చేసి హాస్టళ్లను నెట్టుకొస్తున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక దివాలా తీస్తున్నారు. బిల్లులు మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బిల్లులు ఇవ్వకపోతే ఇక హాస్టళ్లను నడుపలేమని చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. హాస్టళ్లకు సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సరుకుల సరఫరా చేయలేమని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే జిల్లాలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లల్లోని విద్యార్థులకు భోజనం కూడా దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో బీసీ, ఎస్సీ కలిపి సంక్షేమ హాస్టళ్లు 51 ఉన్నాయి. ఇందులో పోస్టు మెట్రిక్ హాస్టళ్లు 20 ఉండగా ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులు 2,438 మంది వసతి పొందుతున్నారు. అలాగే 31 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉండగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేద విద్యార్థులు 2,720 మంది వరకు వసతి పొందుతున్నారు. పోస్టుమెట్రిక్ హాస్టళ్లల్లో ఉంటున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,200 నుంచి రూ.1,500 వరకు ప్రతినెలా డైట్ చార్జీలు ఇవ్వాల్సి ఉంది. ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు తరగతిని బట్టి రూ.750 నుంచి రూ.1,100 వరకు ఒక్కొక్కరికీ ప్రతినెలా ఇవ్వాలి. హాస్టళ్లకు ప్రభుత్వం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. నూనెలు, ఉప్పు, కారం, చింతపండు మొద లగు సరుకులు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తుండగా, కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్, ఇత ర వస్తువులు హాస్టల్ వార్డెన్లు భరించాలి. ఖర్చు చేసిన వాటికి వార్డెన్లు బిల్లులు చూపితే ప్రతి నెలా మంజూరీ చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కోట్లల్లో బకాయిలు... బీసీ, ఎస్సీ, పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ హాస్టళ్లకు ఈ ఏడాది మార్చి నుంచి బిల్లులు రావడం లేదు. ఆలస్యమైన ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది కదా అని వార్డెన్లు స్థోమత లేకున్నా బయట అప్పులు చేసి మరి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ హాస్టళ్ల బకాయిలు దాదాపు జిల్లాలో రూ.6 కోట్ల పైచిలుకు ఉన్నట్లు సమాచారం. ప్రీమెట్రిక్ హాస్టళ్ల కన్నా పోస్టుమెట్రిక్ హాస్టళ్ల వార్డెన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్ల నిర్వహణకు అయ్యే ఖర్చును ముందుగానే 80 శాతం భరించాల్సి ఉంటుంది. బిల్లులు గత ఏడు నెలలుగా నిలిచిపోవడంతో ఒక పోస్టుమెట్రిక్ హాస్టల్ వార్డెన్‌కు రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు రావాల్సి ఉంది. గుడ్లు, పాలు, చికెన్, కూరగాయల వ్యాపారులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. బకాయి డబ్బులు చెల్లిస్తే కానీ సరుకులు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో మరోచోట అప్పులు చేసి పాత అప్పులు తీర్చి మళ్లీ అప్పు చేసి సరుకులు, కూరగాయలు కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో హాస్టళ్ల నిర్వహణ వారి కుటుంబాల పోషణకు తలకుమించిన భారంగా మారిందని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని కాస్మోటిక్ చార్జీలు... బీసీ, ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టళ్లల్లో చదువుతున్న పాఠశాలస్థాయి పేద విద్యార్థులకు నెలనెలా కాస్మోటిక్, హేయిర్ కటింగ్, నాప్కిన్ చార్జీలు ప్రభుత్వం ఇవ్వాలి. అబ్బాయిలకు నెలకు కాస్మోటిక్ చార్జీల కింద రూ.50, కటింగ్ చార్జీల కింద రూ.12 మొత్తం రూ.62 ఇవ్వాల్సి ఉంది. ప్రైమరీస్థాయి బాలికలకు కాస్మోటిక్ చార్జీలు రూ. 55, హైస్కూల్ విద్యార్థినీలకు నాప్కిన్ చార్జీలతో కలిపి రూ.75 ఇవ్వాలి. అయితే ఈ కాస్మోటిక్ చార్జీలు కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదు. డబ్బులు వచ్చినప్పుడు తీసుకోవచ్చనే దృక్పథంతో కటింగ్ చార్జీలు, సబ్బులు, నూనెలకు వార్డెన్లు వారి జేబుల నుంచి ఇస్తున్నారు. ఇలా వార్డెన్ల జేబులు ఖాళీ అవుతున్నాయే తప్ప బిల్లులు రావడం లేదు. ఫ్రీజింగ్ ఉండటంతో.. ఏడు నెలలుగా మెస్‌చార్జీలు, ఇతరత్రా నిధులు రావాల్సి ఉంది. మధ్యలో రెండుసార్లు నిధులు వచ్చాయి. ఫ్రీజింగ్లో ఉండటం వల్ల నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే వార్డెన్లకు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – బాలసురేందర్, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి -
మెస్ చార్జీలు విడుదల చేయండి
హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థుల భోజన ఖర్చులకు గత 7 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేయడం లేదని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. మెస్ బిల్లులు చెల్లించకపోతే విద్యార్థులకు భోజనాలు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. హాస్టల్ మెస్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంలను కలిసి ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హాస్టల్ వార్డెన్లు వడ్డీలకు అప్పులు తెచ్చి హాస్టళ్లు నడిపిస్తున్నారని తెలిపారు. రూ. లక్షల్లో అప్పులు పెరగడం వల్ల హాస్టళ్లు నడపడం కష్టంగా మారిందని వాపోయారు. బిల్లులు చెల్లించని కారణంగా హాస్టళ్లను మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే హాస్టళ్లకు బడ్జెట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హాస్టళ్లలో 1,178 వార్డెన్ పోస్టులు, 1,600 వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వీటిని తక్షణమే భర్తీ చేయాలని కోరారు. హాస్టళ్ల సమస్యలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని, తక్షణమే బకాయిలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వంద కాలేజీలు ప్రారంభించాలి.. వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు బుధవారం బీసీ భవన్‌కు వచ్చి తమకు హాస్టళ్లలో టిఫిన్స్ పెట్టడం లేదని, భోజనంలో నాణ్యత ఉండటం లేదని ఆర్.కృష్ణయ్యకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే బడ్జెట్ విడుదల చేయిస్తానని ఆర్.కృష్ణయ్య వారికి హామీ ఇచ్చారు. బీసీలకు 100 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, జైపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పు చేసి భోజనం!
బజార్హత్నూర్(బోథ్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు సర్కారు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్నో వ్యయ, ప్రయాసాలకు ఓర్చి నిర్వాహకులు వంట చేసి భోజనం పెడుతున్నా బిల్లులు మాత్రం నెలనెలా రావడం లేదు. దీంతో అప్పులు చేసి విద్యార్థులకు వండి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. మూడు నెలలుగా రాని బిల్లులు జిల్లాలో మొత్తం 68,382 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అందులో భాగంగా 2018 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మొత్తం 56 పనిదినాల్లో 68,382 మంది విద్యార్థులకు అందించిన మధ్యాహ్నం భోజనం బిల్లులు రూ.2,63,89,728లను ప్రభుత్వం చెల్లించకపోవడంతో నిర్వాహకులు అప్పులు చేసి మరి ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.అందుబాటులో డబ్బులు లేక నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లిస్తే తప్పా మధ్యాహ్న భోజన కార్యక్రమం కొనసాగే పరిస్థితి కనపడటం లేదు. 9–10వ తరగతుల విద్యార్థులు మధ్యాహ్న భోజన బిల్లులు జూలై నుంచి డిసెంబర్ వరకు బిల్లులు రాలేదు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే మొదటి మూడు నెలలకు సంబంధించి రూ.43,62,000 బిల్లులు మంజూరయ్యాయని, త్వరలో నిర్వాహకులకు అందిస్తామని తెలిపారు. గిట్టుబాటు కాని చార్జీలు కూరగాయలు పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ మేరకు ఏజెన్సీలకు బిల్లులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నెలనెలా బిల్లులు చెల్లించకపోవడం, చార్జీలు పెంచకపోతే రోజు కూరగాయలు పెట్టడం సాధ్యం కాదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచకపోవడంతో భోజనంలో కూడా నాణ్యత లోపిస్తోంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొరికి రోజుకు రూ.4.13పైసలు, సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు పెడితే అదనంగా రూ.4.. 6నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.6.18పైసలు సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు పెడితే అదనంగా రూ.4.. 9, 10వ తరగతులకు గుడ్డుతోపాటు భోజనానికి రూ.8.18చొప్పున ఏజెన్సీలకు చెల్లిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఈ మొత్తాన్ని ప్రభుత్వం పెంచడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయల ధరలు చూసిన కిలోకు రూ.50కు తక్కువ లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలతో గిట్టుబాటు కాకా నిర్వాహకులు ఆలుగడ్డ, చారు, పలుచని పప్పుకే పరిమితమవుతున్నారు. ఇతర కూరగాయలు లేకపోవడంతో భోజనం రుచించక, విద్యార్థులు సగం కడుపుతో సరిపెట్టుకుంటున్నారు. మెనూ ప్రకారం భారమే అయినా.. మధ్యాహ్న భోజనం మెనూలో సర్కారు కూరగాయలతో కూడిన భోజనంతోపాటు వారంలో సోమ, బుధ, శుక్రవారం గుడ్డు అందించాలని పలు మార్పులు చేసింది. దీనిపై జూన్‌లోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో రాష్ట్రంలో మధ్యాహ్నభోజనం అమలు తీరును పరిశీలించిన కేంద్ర బృందం మెనూ మార్చాలని సూచించింది. రకరకాల కూరగాయలు, బఠానీ పలావ్, కూరగాయలతో కూర్మా, కాబులీ శనగలు, కూరగాయలతో బిర్యాణి, మిల్మేకర్ బిర్యాణి, మునగకాయ, పెసర పప్పుతో కిచిడీ, చట్నీ, అన్నం, టమాటా, బఠానీల కూర, సోయాచిక్కుడు వంటి కూరలు ఉండాలని నిర్ధేశించింది. తదితర పదార్థాలతో వండి పెడితే విద్యార్థులు ఇష్టంగా తినడంతోపాటు వారికి పౌష్టికాహరం అందించనట్లు కూడా ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వాహకులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం భారమే అయినా కూరగాయలు కొని భోజనం పెడుతున్నారు. కానీ బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రూ.15 చెల్లిస్తేనే.. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 1,153 పాఠశాలలు ఉండగా, 68వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిపై మధ్యాహ్న భోజన పథకం కింద గుడ్డు అందించిన రోజు రూ.5.91లక్షలు, గుడ్డు లేని రోజు రూ.3.59లక్షలకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నాణ్యమైన భోజనం అందాలంటే ఒక్కో విద్యార్థిపై కనీసం రూ.15 వంతున చెల్లించాలని ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు అదనంగా ప్రతీ రోజు మరో రూ.3లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే భోజనంలో నాణ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారమైతంది నేను వృధ్యాప్యలో ఉండటంతో వ్యవసాయ కూలీగా వెళ్లే పరిస్థితి లేనందున నీడపట్టున ఉంటూ మధ్యాహ్న భో జనం వంటచేసి పెడుతున్నాను. కానీ ప్రభుత్వం బిల్లులు నెలల తరబడి చెల్లించకపోవడంతో ఉపాధ్యాయుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. ఒక నెల ఎలాగోలా సర్ధుకపోవచ్చు కాని 3 నెలలు బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా భారమైతంది. – కమలాబాయి, నిర్వాహకురాలు నెలనెలా చెల్లించాలి మధ్యాహ్నభోజన నిర్వాహకులంతా రోజు కూలీలే. వారి వద్ద వేల రూపాయలు జమ ఉండవనే విషయం ప్రభుత్వానికి తెలిసినా బిల్లుల విషయంలో నిర్లక్ష్యం చేయడం సరికాదు. అప్పులు చేసి వడ్డీలు కట్టే పరిస్థితుల్లో లేము. అలా కట్టాలంటే మా రోజు కూలీ వడ్డీకే సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలాగే మధ్యాహ్నభోజనం బిల్లులు నెలనెలా చెల్లించాలి. – కర్వల పోసాని, నిర్వాహకురాలు బడ్జెట్ విడుదలైతే బిల్లులు చెల్లిస్తాం జిల్లాలో 1,153 పాఠశాలల మధ్యాహ్న భోజనం బిల్లులు గత 3 నెలలకు రూ.2.63 కోట్లు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. 9–10వ తరగతి విద్యార్థులు మధ్యాహ్న భోజన బిల్లులు జూలై నుంచి డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉండే. అందులో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మొదటి మూడు నెలలకు సంబంధించిన రూ.43,62,000 ఇటీవల మంజూరయ్యాయి. త్వరలో వాటిని నిర్వాహకులకు అందిస్తాం. మిగతా మూడు నెలల బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయగానే చెల్లిస్తాం. – రవీందర్‌రెడ్డి, డీఈవో -
అప్పుచేసి చికెన్ కూడు
‘అప్పు చేసి పప్పు కూడు’ ఒకనాటి సామెత. ఇప్పుడు సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు‘అప్పు చేసి చికెన్ కూడు’ పెడుతున్నారు. వారంలో మూడు రోజులు చికెన్, వారం రోజులు కోడిగుడ్డు అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా సంక్షేమ హాస్టళ్లలో మెనూప్రకటించింది. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో వార్డెన్లు అప్పులు చేసివిద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఎనిమిది నెలలుగా మెస్ బిల్లులు మంజూరుచేయకపోవడంతో వార్డెన్లు అష్టకష్టాలు పడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలోని వసతిగృహాలకు రూ.6 కోట్లు బకాయిలు పేరుకు పోవడంతోఇలాగైతే హాస్టళ్ల నిర్వహణ కష్టమంటూ వార్డెన్లు వాపోతున్నారు. నెల్లూరు రూరల్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు అయినా నేటికీ ప్రభుత్వం బడ్జెట్ (మెస్ చార్జీలు) విడుదల చేయలేదు. దీంతో హాస్టళ్ల వార్డెన్లు అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి వార్డెన్ బయట అప్పు చేసి హాస్టల్‌ను నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి నెలకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం గతేడాది సీఎఫ్ఎంఎస్ అనే కొత్త విధానం తీసుకురావడంతో ట్రెజరీ శాఖ నుంచి నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జీలను పెంచుతూ జీఓ విడుదల చేసింది. అయితే పెంచిన చార్జీలు వసతిగృహ అధికారులకు అందడం లేదు. నిధుల విడుదల లేకపోవడంతో కొత్త మెనూ అమలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలో 87 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీటితో పాటు ఎస్సీ కళాశాల వసతి గృహాలు 14, బీసీ కళాశాల వసతి గృహాలు 20 వరకు ఉన్నాయి. వీటిలో 4 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. తాజాగా ఆగస్టు 1వ తేదీ నుంచి మెనూ చార్ట్‌ను మార్పు చేసింది. ఒక వారం బియ్యంతో కలిపి మొత్తం 23 రకాల నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి, విద్యార్థులకు వడ్డించాలి. ఈ మెనూలో చేసిన మార్పులుకారణంగా విద్యార్థులకు ప్రధానంగా ఒక వారంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం చికెన్ కూర వడ్డించాలి. రోజూ పాలు, గుడ్లతో పాటు అరటి పండ్లు, తినుబండారాలు అందించాలి. బిల్లులు ఇవ్వరు.. తనిఖీలు చేస్తారు.. గడిచిన మార్చి నుంచి నేటి వరకు డైట్ బిల్లులు వార్డెన్లకు అందలేదు. చాలా మందికి ఫిబ్రవరి నుంచి బిల్లులు అందాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఒక హాస్టల్లో 100 మంది నుంచి 150 వరకు విద్యార్థులు ఉండడానికి అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్యను బట్టి సుమారుగా ఒక్కో వసతి గృహానికి రూ.4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు మెస్ చార్జీలు బకాయిలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి డైట్ చార్జీలతో పాటు గత మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులు కూడా ఎక్కువ వసతి గృహాలకు విడుదల కాని పరిస్థితి నెలకొంది. నెలవారీ డైట్ చార్జీలు సకాంలో అందించకుండా ఇటీవల కాలంలో విజిలెన్స్, ఏసీబీ శాఖల అధికారలుతో తనిఖీలపై తనఖీలు నిర్వహించి ఇబ్బందులు గురి చేయడాన్ని వార్డెన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వసతి గృహాలకు మెస్ చార్జీలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వార్డెన్లు కోరుతున్నారు. సీఎఫ్ఎంఎస్ విధానం కారణంగా.. బిల్లులు చెల్లింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ (కాంప్రెహెన్స్ మేనేజ్మెంట్ సిస్టం)ను కొత్తగా ప్రవేశ పెట్టింది. ఈ నూతన విధాన కారణంగా మెనూకు సంబంధించిన ప్రతి బిల్లును సీఎఫ్ఎంఎస్ అన్లైన్లో పొందుపర్చాలి. ఇది కష్టతరంగా మారింది. విజయవాడ స్థాయిలోనే ఈ నూతన విధానం పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో తిప్పలు తప్పడం లేదు. దీంతో హెచ్‌డబ్ల్యూఓలకు బిల్లులు పాస్‌కావడం లేదు. -
వసతి..వ్యథే..!
సంక్షేమ హాస్టలే తమ ఇల్లని సంబరపడ్డారు. అధికారులే తమ సంరక్షకులని భావించారు. హాస్టల్ అధికారులే పెద్ద దిక్కని భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస వసతులు కరువయ్యాయి. తిండి సరిగా లేదు. ఫ్యాన్ ఉన్నా తిరగడం లేదు. మరుగుదొడ్లు ఉన్నా నీటి జాడ లేదు. ఆరుబయట స్నానాలు, అరకొర అద్దె భవనాలు, మెనూ పాటించక పోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు సంక్షామానికి గురయ్యాయి. దీంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. హాస్టళ్ల సమస్యలపై సాక్షి ప్రత్యేక కథనం. నెల్లూరు రూరల్: పేద విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నేటికి అద్దె భవనాల్లో చాలీచాలని గదుల్లో చదువుతూ కాలం వెల్లదీస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదల జాప్యం వల్ల హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. బాత్రూమ్లు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. తలుపులు విరిగి, ఉన్న వాటికి కన్నాలు పడ్డాయి. మరి కొన్నింటికి తలుపులు లేకుండా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఏడాదికి ఒక్క సారైనా హాస్టల్‌కు రంగులు వేయించడం, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 73 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇందులో 22 బీసంక్షేమ హాస్టళ్లు చాలీచాలని వసతులతో అద్దె భవనాల్లో కాలం వెల్లదీస్తున్నారు. వసతుల కల్పనలో విఫలం సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వంతోపాటు అధికారులు విఫలమయ్యారు. చాలీచాలని గదుల్లో విద్యార్థులు తమ పెట్టెలు, వస్తువుల వద్దే నిద్రిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చదువుకోవడానికి సరైన వసతులు లేక తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సివస్తోంది. కొన్ని కిటికీలకు రెక్కలు లేకపోవడంతో దోమలు గదుల్లోకి చేరుతున్నాయి. కొన్ని గదుల్లో ఫ్యాన్లు ఉన్నా తిరగకపోవడంతో దోమల దాటికి విద్యార్థులకు సరిగా నిద్రపట్టడం లేదు. దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో చలిలో జాగారం చేస్తున్నారు. ఇనుపపెట్టెలను 2008వ సంవత్సరంలో అందజేసినట్లు అధికారులే చెబుతున్నారు. ఉన్నవి విరిగిపోయి వంగిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. వాటిలో దుస్తులు కానీ, పుస్తకాలు కానీ దాచుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని వారు వాపోతున్నారు. కొత్తగా వచ్చిన వారు పాత పెట్టెలలోనే వస్తువులు భద్రపరచుకుంటూ కాలం వెళ్లతీస్తున్నారు. వసతి గృహాల్లో ఎలుకలు వాటిని చిందర వందర చేస్తున్నాయి. ఎలుకల వల్ల కొన్ని వసతి గృహాల్లో కంటి మీద కునుకు లేకుండాపోతోంది. భద్రత కరువు బాలికల వసతి గృహాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ కరువైంది. వాచ్మన్లను ఏర్పాటు చేయకపోవడంతో బాలికలు అభద్రతాభావంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంతో పలు హాస్టళ్లలో రాత్రి వేళ్లల్లో ఆగంతకులు, ఆకతాయిలు, మందుబాబులు చొరబడినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బాలికల హాస్టళ్లలో పురుషులను సిబ్బంది, ట్యూటర్లుగా నియమించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ సిబ్బంది సరిపోవడం లేదంటూ పలు హాస్టళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులపై అగాయిత్యాలు జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే మోనూ ఎలా.. వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచింది. ఇందులో భాగంగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన చార్జీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్‌తోపాటు గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ స్కూళ్లు, చిల్డ్రన్స్ హోంలు, ఆనంద నిలయాలకు వర్తింపచేశారు. పెంచిన మెస్ చార్జీలు జూలై 1వ తేదీ నుంచి కొత్త మెనూ అమల్లోకి వచ్చింది. మారిన మెనూ ప్రకారం వారానికి రెండుసార్లు కోడికూర, ప్రతి రోజూ పాలు, గుడ్లు, మారిన అల్పాహారంలో పూరీ, ఇడ్లీ వడ్డించాలని కొత్త మెనూను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో స్కేల్ ఆఫ్ రేషన్ ఇచ్చినా ధరలు మాత్రం ఇవ్వకపోవడంతో తామేం చేయాలో అర్థం కావడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు ఇప్పుడు మెస్ చార్జీల పెంపునకు చాలా తేడా ఉంది. ఒక్కో విద్యార్థిపై రూ.40పైగా అదనంగా భరించాల్సి వస్తుందని వార్డెన్లు వాపోతున్నారు. ఈ మెనూ అమలు సాధ్యం కాదని అధికారులు, వార్డెన్లు చేతులెత్తేశారు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. తప్పని ఎక్కిళ్లు.. హాస్టళ్లకు దాతలు ఇచ్చిన ఆర్వోప్లాంట్లు మరమ్మతులకు గురికావడంతో మూలనపడ్డాయి. విద్యార్థులకు గ్లాసుల పంపిణీ లేదు. భోజనం చేసే సమయంలో మంచినీరు అందుబాటులో లేకపోవడంతో చేతిపంపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొన్ని ప్లేట్లు పగుళ్లిచ్చాయి. ఆరుబయటకే.. హాస్టళ్లలో సరిపడా మరుగుదొడ్లు, స్నానపుగదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే స్నానం చేస్తున్నారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో బయటకు వెళితే విషపురుగుల బారిన పడుతామేమోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పందులు తిరుగుతున్నాయి. దీంతో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ అంటూ బహిరంగ మలవిసర్జన వద్దని, పారిశుద్ధ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటనలు చేయడం తప్ప సంక్షేమ హాస్టళ్లలో సరిపడిన మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతుల లేమి కారణంగా హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇప్పటికే జిల్లాలో 80 హాస్టళ్లు మూతపడ్డాయి. మౌలిక వసతుల కల్పనకు చర్యలు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. పెట్టెలు, దుప్పట్లు అందజేశాం. మరుగుదొడ్ల నిర్మాణం, పాత భవనాల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తాం. ప్రతి హాస్టల్‌కు వాచ్‌మన్ నియమించడంతోపాటు, బాలికల వసతిగృహాలకు భద్రత పెంచాం. పెరిగిన మెస్ చార్జీలకు అనుగుణంగా తయారు చేసిన మెనూలో కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ పూర్తిస్థాయిలో మెనూ అమలు చేయాలని వార్డెన్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. – డి.మధుసూదనరావు, ఉప సంచాలకులు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ -
విద్యార్థుల మెస్ చార్జీలు పెంపు
ప్రభుత్వం ఉత్తర్వులు.. 16.99 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి సాక్షి, హైదరాబాద్: ప్రిమెట్రిక్, పోస్టుమెట్రిక్ విద్యార్థుల మెస్ చార్జీలు పెరిగాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చార్జీల పెంపుపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు నిర్ణయాన్ని 2017–18 వార్షిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 1,650 హాస్ట ళ్లు, 450 గురుకులాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3.32 లక్షల మంది విద్యార్థులున్నారు. మరో 13.67 లక్షల మంది పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉన్నారు. తాజా పెంపుతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ హాస్టళ్లు, కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లు, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టళ్లలో చదివే విద్యార్థులతో పాటు రోజు వారీగా కాలేజీకి వెళ్లే విద్యార్థులు అనే నాలుగు కేటగిరీలకు ప్రభు త్వం నిధులు విడుదల చేస్తోంది. వీరిలో డేస్కాలర్ విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో, మిగిలిన వారికి సంబంధించి వారి వసతిగృహ సంక్షేమాధికారులకు మెస్ చార్జీల రూపంలో ప్రభుత్వం నిధులిస్తోంది. తాజా పెంపుతో ఆయా విద్యార్థులకు మరింత మెరుగైన భోజనం అందిస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు. విద్యార్థుల ఉద్యమాలకు ఫలితమిది: టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఉపకారవేతనాలు, మెస్ చార్జీల పెంపు కోసం విద్యార్థులు చేసిన ఉద్యమాలు ఫలించాయి. వారి ఉద్యమాలకు స్పందించిన ముఖ్యమంత్రి గత అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేశా రు. చార్జీల పెంపుతో వసతిగృహాల్లో విద్యార్థు లకు మంచి భోజనం పెట్టే అవకాశం కల్పిం చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. -
జైల్లో ఖైదీలకంటే హీనమా?: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: జైల్లో ఖైదీలకు నెలకు 3 వేల రూపాయలు భోజనం కోసం మంజూరు చేస్తుండగా, మెడిసిన్, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు నెలకు 1050 రూపాయలు మెస్‌ఛార్జీలుగా ఇస్తున్నారు. జైల్లో ఖైదీలకిచ్చే ప్రాధాన్యత విధ్యార్థులకు ఇవ్వరా?.. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు రోజుకు రూ.35 వంతున పూటకు 10.67 రూపాయలతో భోజనం సాధ్యమేనా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విధ్యార్థుల స్కాలర్షిప్లు, మెస్‌ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు, మెస్‌ఛార్జీలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కానుకగా ఉద్యోగ, కార్మిక వర్గాలకు, ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన విద్యార్థుల స్కాలర్షిప్లు, మెస్‌ఛార్జీలు పెంచక పోవడం శోచనీయమన్నారు. బీసీ సంఘం నాయకులు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, రాంకోటి, కుల్కచర్ల శ్రీనివాస్, రామలింగం, నర్సింహ్మగౌడ్, వేముల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
మెస్ చార్జీలు లేవు.. బతుకమ్మకు కోట్లా ?
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థులకు రెండేళ్లుగా మెస్ చార్జీలు విడుదల చేయని ప్రభుత్వం..కేసీఆర్ కూతురు కవితకు మాత్రం బంగారు బతుకమ్మ ఆడటానికి కోట్ల రూపాయలు విడదల చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బతుకమ్మ అంటే కవిత అన్నట్లు చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారని విర్శించారు. కేంద్రం ప్రకటించిన ఫసల్ బీమాకు రాష్ట్రం చెల్లించాల్సిన డబ్బులు కట్టకుండా రైతులకు పరిహారం రాకుండా చేశారని అన్నారు. రాయితీ ట్రాక్టర్లను కూడా అర్హులైన రైతులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. భారత్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లో జవాన్లు చేసిన ప్రతి దాడి పట్ల జవాన్లకు యావత్ జాతి వందనం చేస్తోందని అన్నారు. ఆయన వెంట నాయకులు తాళ్లపల్లి కుమారస్వామి, కొత్త దశరథం, చదువు రాంచంద్రారెడ్డి, వెంకటేష్ ఉన్నారు. -
ఎస్ఎఫ్ఐ చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
అడ్డుకున్న పోలీసులు..విద్యార్థుల అరెస్టు హైదరాబాద్: పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ర్ట కమిటీ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల ప్రదర్శనను ఇందిరాపార్కు చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట, వాగ్వాదం, అరెస్టుల వంటి సంఘటనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హాస్టళ్ల సమస్యలపై ఎస్ఎఫ్ఐ రాష్ర్ట కమిటీ ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు మేరకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. అనంతరం నాయకుల పిలుపు మేరకు విద్యార్థులు ప్రదర్శనగా చలో సెక్రటేరియ ట్ చేపట్టగా.. అప్రమత్తమైన పోలీసులు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్ వద్ద అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సచివాలయం నుంచి బయటకు వచ్చిన మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలను విద్యార్థులు అడ్డుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రులను అడ్డుకున్న నాయకులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చిపడేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ర్ట అధ్యక్షుడు కోట రమేశ్, ప్రధాన కార్యదర్శి సాంబశివ, నాయకులు నాగేశ్వర్రావు, జగదీశ్, ప్రకాష్ కారత్, లక్ష్మణ్ తదితరులతో పాటు 44 మందిని పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టులు కాకుండా ధర్నాచౌక్ వైపు పరుగులు తీస్తున్న విద్యార్థులను పోలీసులు వెంటపడి మరీ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మెస్ చార్జీలు పెంచాలి: డాక్టర్ నాగేశ్వర్ ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ డా. కె.నాగేశ్వర్ మాట్లాడుతూ కమిటీ సమావేశాల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గంటకు రూ.500 భత్యం తీసుకుంటారని, విద్యార్థుల మెస్ చార్జీలను రోజుకు రూ. 300కి పెంచక పోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు వెంకట్, సహాయ కార్యదర్శి రజని, నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలి
ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను ఘట్కేసర్ టౌన్: పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా వసతి గృహాల్లోని విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ ఉత్తర కమిటీ ఆధర్యంలో జూలై 24న సికింద్రాబాద్‌లో ప్రారంభమైన సైకిల్‌యాత్ర మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట్, కీసర మండలాల్లో మండలాల్లో కొనసాగి ఘట్కేసర్లో బుధవారం జరిగిన ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గృహాల్లోని విద్యార్థులకు రోజుకు ఒక్కంటికి రూ. 27 తో మూడు పూటలా భోజనం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రస్తుతమిస్తున్న కాస్మొటిక్ చారీ్జలను పెంచాలన్నారు. అద్దె భవనాలు, ఇన్చార్జి వార్డెన్లతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని, శాశ్వత వార్డెన్లను నియమించాలని, శాశ్వత భవనాలను నిర్మించాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అనుసరించి కేజీ - పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వర్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ వారానికి ఒకసారి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని, ఘట్కేసర్లో మూసిన బీసీ విద్యార్థి వసతి గృహాన్ని తక్షణమే తెరిపించాలన్నారు. బంగారు తెలంగాణ అంటే విద్యారంగాన్ని కార్పొరేటుకు అప్పగించడమేనా అన్ని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని మేడ్చల్, ఘట్కేసర్ మండలాల్లో డిగ్రీ కళాశాలలను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రీకాంత్, శేఖర్, ప్రశాంత్, గౌతం, లక్ష్మణ్, వెంకటేష్, నర్సింహ, రమేష్ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
అన్నం పెట్టండి మహాప్రభో
* మెస్ చార్జీలు చెల్లించినా భోజనం పెట్టలేదని నిరసన * వీఎస్‌యూ పరిపాలన భవనం, కళాశాల వద్ద ధర్నా * సీఐ కాళ్లు పట్టుకుని బతిమిలాడిన విద్యార్థులు నెల్లూరు (టౌన్): విక్రమ సింహపురి యూనివర్సిటీ రోజుకో వివాదానికి కేంద్ర బిందువవుతోంది. వర్సిటీ అధికారులు అనుసరిస్తున్న తీరుతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా మెస్‌చార్జీలు చెల్లించినా భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా హాస్టల్లోనే నిరసన తెలుపుతూ వచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం వీఎస్‌యూ పరిపాలన భవనం వద్ద బైఠాయించారు. కార్యాలయంలోకి అధికారులు, సిబ్బంది వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంతలో వర్సిటీ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసన విరమించకుంటే కేసులు పెడతామని విద్యార్థులను బెదిరించారు. ఈ క్రమంలో విద్యార్థులు సీఐ అబ్దుల్ కరీం కాళ్లు పట్టుకుని అధికారులతో మాట్లాడి తమకు భోజనం పెట్టించాలని వేడుకున్నారు. మరోవైపు వర్సిటీ క ళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ అందె ప్రసాద్ విద్యార్థుల వద్దకు వచ్చి చిందులు తొక్కారు. నిరసన తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని వీసీతో చర్చించి బుధవారం నాటికి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఇంకోవైపు వీఆర్ హైస్కూలు ప్రాంగణంలోని వర్సిటీ కళాశాల వద్ద విద్యార్థినులు బైఠాయించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన వసతిగృహం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని నిరసన తెలిపారు. ప్రస్తుతం బాలికల హాస్టల్ కొనసాగుతున్న డీకేడబ్ల్యూ కళాశాల వసతిగృహంలో వసతులు అధ్వానంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదంటూ తరగతులు బహిష్కరించారు. ఇంతలో ఇన్చార్జి ప్రిన్సిపల్ వచ్చి టీసీలు ఇచ్చి పంపేస్తామని బెదిరించడంతో విద్యార్థినులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇంత జరిగినా వీసీ, రిజిస్ట్రార్లు పరిపాలనా భవనం వద్దకు రాకపోవడంతో దాతలు ఏర్పాటు చేసిన భోజనంతో విద్యార్థులు ఆకలి తీర్చుకున్నారు. సమస్య ఇదీ విక్రమ సింహపురి యూనివర్సీటీ పీజీ కళాశాలకు సంబంధించిన వసతి గృహాన్ని కొత్తూరులో నిర్వహిస్తున్నారు. ఇందులో 70 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా క్రమం తప్పకుండా మెస్ చార్జీలు చెల్లిస్తున్నారు. అయితే పాత విద్యార్థులు బకాయి ఉన్నారనే నెపంతో ఆరు నెలలుగా మెస్నూ మూసేశారు. తాము మెస్ చార్జీలు చెల్లించినందున తమ వరకైనా భోజనం పెట్టాలని విద్యార్థులు కోరినా వర్సిటీ అధికారుల నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ఈ విద్యార్థులు అప్పటి నుంచి భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యార్థినులు కూడా సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీరు డీకేడబ్ల్యూ కళాశాల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి రూ.2 వేలు చొప్పున కాషన్ డిపాజిట్ చెల్లించారు. అయితే ప్రస్తుతం నూతన హాస్టల్ లోకి మార్చితే మరోమారు కాషన్ డిపాజిట్ చెల్లించమంటుండటంతో విద్యార్థినులు మండిపడుతున్నారు. -
చదువులకేదీ చేయూత?
- కోట్లు ఇవ్వాల్సి ఉన్నా కిమ్మనని సర్కారు - పేరుకుపోతున్న రీయింబర్స్మెంట్ బకాయిలు - స్కాలర్షిప్లు, మెస్ చార్జీలదీ అదే పరిస్థితి - వేలాది మంది విద్యార్థులకు తప్పని అవస్థలు సాక్షి, కాకినాడ : కొత్త ప్రభుత్వం కొలువుదీరి వందరోజులైనా విద్యార్థుల కొలిమి నుంచి బయటపడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, మెస్ చార్జీల బకాయిలు మంజూరు కాక వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచినా సొమ్ములందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. రెండో కౌన్సెలింగ్ అనంతరం మరో వారం పదిరోజుల్లో తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. అయినా గత విద్యాసంవత్సరానికి చెందిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మాత్రం మంజూరు కాలేదు. జిల్లాకు సంబంధించి ఈ మొత్తం రూ.122 కోట్ల వరకు ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు (ఉపకార వేతనాలు), మెస్ చార్జీల బకాయిలు కూడా కొండల్లా పేరుకుపోతున్నాయి. 2013-2014 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఎస్సీ, బీసీ, ఈబీసీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు సంబంధించి మొత్తం రూ.93,24,00,000 బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 3,400 మంది ఎస్సీ విద్యార్థులకు సంబంధించి రూ.13 కోట్లు బకాయిలు ఉండగా, అందులో ఉపకారవేతనాల కింద రూ.10 కోట్లు, రూ.3 కోట్లు మెస్ చార్జీల నిమిత్తం విడుదల కావాల్సి ఉంది. 31వేల మంది బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.35 కోట్లు, మెస్ చార్జీల కింద రూ.14 కోట్లు విడుదల కావాల్సి ఉంది. 19 వేల మంది ఈబీసీ విద్యార్థులకు రూ.30 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం చెల్లించాల్సి ఉంది. 3 వేల మంది ఎస్టీ విద్యార్థులకు సంబంధించి రూ.కోటి, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు రూ.24 లక్షలు విడుదల కావాల్సి ఉండగా మిగిలిన మొత్తం ఎస్సీ విద్యార్థులకు సంబంధించిన బకాయిగా విడుదల కావలసి ఉంది. ‘దీవెన’కూ గతి లేదు.. ఇక రాజీవ్ విద్యాదీవెన పథకంకింద 9, 10 తరగతుల ఎస్సీ విద్యార్థులకు నెలకు రూ.150ల చొప్పున పది నెలలకు ఒకేసారి రూ.750 అడ్హాక్ గ్రాంట్ కింద మంజూరు చేస్తుంటారు. జిల్లాలో 12,945 మంది విద్యార్థులకు మొత్తం రూ.2.91కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. ఇక ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ న్యూస్కీమ్ కింద 5 నుంచి 8వతరగతి వరకు చదువుతున్న బాలురకు నెలకు రూ.100 చొప్పున, బాలికలకు రూ.150 చొప్పున చెల్లిస్తుంటారు. ఈ స్కీమ్ కింద జిల్లాలో 26,224 మంది విద్యార్థులకు రూ.3.28 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా, కేవలం రూ.71 లక్షలు మాత్రమే విడుదల చేశారు. ఇంకా రూ.2.57 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. ఉత్తమ గురుకుల పాఠశాలల్లో 652 మంది విదార్థులకు సంబంధించి రూ.1.30 కోట్లు విడుదల కావాల్సి ఉంది. నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు సంబంధించి రూ.20 లక్షల వరకు విడుదల చేయాల్సి ఉంది. ఇక వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకైతే రూ.50 కోట్ల వరకు స్కాలర్షిప్, మెస్‌చార్జీల బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిల కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తులు పంపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అధికారులంటున్నారు. -
మెనూ బిల్లు...గ్యాస్‌కు చెల్లు
అరటిపండు, కోడిగుడ్డు కుదింపు వసతి గృహాల నెత్తిన గ్యాస్ భారం నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్: వసతిగృహాల విద్యార్థులు అరకొర భోజనంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. గత ఏడాది మెస్ ఛార్జీలు కాస్త పెంచినా, ఈ ఏడాది గ్యాస్ భారం దాన్ని మింగేస్తోంది. దీంతో మెనూకు కోత పడక తప్పడం లేదు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం గత ఏడాది మెస్ ఛార్జీలు సంతృప్తికర స్థాయిలో పెంచింది. 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.750, 8,9,10 తరగతులు విద్యార్థులకు రూ.850 ఇస్తున్నారు. అయితే పెరిగిన మెస్ బిల్లుకు వంట గ్యాస్ రూపంలో చిల్లు పడుతోంది. పెరిగిన గ్యాస్ ధరలతో విద్యార్థి మెనూకి కేటాయించిన డబ్బులోంచి కొంత ఖర్చు చేయాల్సివస్తోంది. మెస్ బిల్లుకు సిలిండర్ చిల్లు ప్రతి వసతి గృహానికి ఏడాదికి 9 రాయితీ సిలిండర్లు మాత్రమే అందిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఇది సాగుతుంది. తక్కువ మంది విద్యార్థులున్న వసతిగృహాలకు కూడా సరిపోవడం లేదు. ఎక్కువ మంది ఉన్నచోట నిర్వాహకులపై తీవ్ర భారం పడుతుంది. సంఖ్య ఎక్కువ ఉన్న వసతిగృహాల్లో ఒక సిలిండరు రెండు, మూడు రోజులకు మాత్రమే సరిపోతుంది. దీనిని బట్టి 9 సిలిండర్లు 18 నుంచి 27 రోజులు వస్తాయి. నెల రోజుల్లో కోటా పూర్తిగా అయిపోతుంది. మిగతా 11 నెలలు పరిస్థితి ఏంటన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాయితీ కాకుండా వాణిజ్య సిలిండరు అయితే రూ.1400 వెచ్చించాల్సి వస్తోందని సంక్షేమాధికారులు అంటున్నారు. సంఖ్య ఎక్కువ ఉన్న వసతిగృహాల్లో 100 వరకు అవసరం ఉంటుంది. కనీసం వెయ్యి చొప్పున లెక్కేసినా రూ.90 వేలు అవుతోంది. వీటికి ప్రభుత్వ నిధులు ఉండవు విద్యార్థుల మెస్ చార్జీల నుంచే వెచ్చించాల్సి ఉంటుంది. అదనపు సిలిండర్ల హామీ ఏమైంది..! ఇటు ప్రభుత్వం ప్రకటించిన మెనూ పాటిస్తూ అటు ఖర్చు దాటకుండా చూడాలంటే చుక్కలు కనిపిస్తుండడంతో సంక్షేమాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థులకు నిబంధనల ప్రకారం భోజనం ఇవ్వడం సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. మరో మూడు సిలిండర్లు అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదు. మరోవైపు గ్యాస్‌కు బదులు కట్టెల పొయ్యిపై వంట చేయకూడదనే నిబంధనలున్నాయి. దీనిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ధరల నేపథ్యంలో ఇటు సిలిండరు కొనలేక మెనూ అందించలేక ఒక పక్క సంక్షేమాధికారులు అవస్థలు పడుతుంటే మరో పక్క విద్యార్థులకు చాలీచాలని ఆహారంతో సరి పెట్టుకుంటున్నారు.