మెనూ బిల్లు...గ్యాస్‌కు చెల్లు
- అరటిపండు, కోడిగుడ్డు కుదింపు
- వసతి గృహాల నెత్తిన గ్యాస్ భారం
నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్: వసతిగృహాల విద్యార్థులు అరకొర భోజనంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. గత ఏడాది మెస్ ఛార్జీలు కాస్త పెంచినా, ఈ ఏడాది గ్యాస్ భారం దాన్ని మింగేస్తోంది. దీంతో మెనూకు కోత పడక తప్పడం లేదు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం గత ఏడాది మెస్ ఛార్జీలు సంతృప్తికర స్థాయిలో పెంచింది. 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.750, 8,9,10 తరగతులు విద్యార్థులకు రూ.850 ఇస్తున్నారు. అయితే పెరిగిన మెస్ బిల్లుకు వంట గ్యాస్ రూపంలో చిల్లు పడుతోంది. పెరిగిన గ్యాస్ ధరలతో విద్యార్థి మెనూకి కేటాయించిన డబ్బులోంచి కొంత ఖర్చు చేయాల్సివస్తోంది.
మెస్ బిల్లుకు సిలిండర్ చిల్లు
ప్రతి వసతి గృహానికి ఏడాదికి 9 రాయితీ సిలిండర్లు మాత్రమే అందిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఇది సాగుతుంది. తక్కువ మంది విద్యార్థులున్న వసతిగృహాలకు కూడా సరిపోవడం లేదు. ఎక్కువ మంది ఉన్నచోట నిర్వాహకులపై తీవ్ర భారం పడుతుంది. సంఖ్య ఎక్కువ ఉన్న వసతిగృహాల్లో ఒక సిలిండరు రెండు, మూడు రోజులకు మాత్రమే సరిపోతుంది. దీనిని బట్టి 9 సిలిండర్లు 18 నుంచి 27 రోజులు వస్తాయి. నెల రోజుల్లో కోటా పూర్తిగా అయిపోతుంది. మిగతా 11 నెలలు పరిస్థితి ఏంటన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాయితీ కాకుండా వాణిజ్య సిలిండరు అయితే రూ.1400 వెచ్చించాల్సి వస్తోందని సంక్షేమాధికారులు అంటున్నారు. సంఖ్య ఎక్కువ ఉన్న వసతిగృహాల్లో 100 వరకు అవసరం ఉంటుంది. కనీసం వెయ్యి చొప్పున లెక్కేసినా రూ.90 వేలు అవుతోంది. వీటికి ప్రభుత్వ నిధులు ఉండవు విద్యార్థుల మెస్ చార్జీల నుంచే వెచ్చించాల్సి ఉంటుంది.
అదనపు సిలిండర్ల హామీ ఏమైంది..!
ఇటు ప్రభుత్వం ప్రకటించిన మెనూ పాటిస్తూ అటు ఖర్చు దాటకుండా చూడాలంటే చుక్కలు కనిపిస్తుండడంతో సంక్షేమాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థులకు నిబంధనల ప్రకారం భోజనం ఇవ్వడం సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. మరో మూడు సిలిండర్లు అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదు. మరోవైపు గ్యాస్‌కు బదులు కట్టెల పొయ్యిపై వంట చేయకూడదనే నిబంధనలున్నాయి. దీనిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ధరల నేపథ్యంలో ఇటు సిలిండరు కొనలేక మెనూ అందించలేక ఒక పక్క సంక్షేమాధికారులు అవస్థలు పడుతుంటే మరో పక్క విద్యార్థులకు చాలీచాలని ఆహారంతో సరి పెట్టుకుంటున్నారు.