ఎస్‌ఎఫ్‌ఐ చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
అడ్డుకున్న పోలీసులు..విద్యార్థుల అరెస్టు
హైదరాబాద్: పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ర్ట కమిటీ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల ప్రదర్శనను ఇందిరాపార్కు చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట, వాగ్వాదం, అరెస్టుల వంటి సంఘటనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హాస్టళ్ల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ రాష్ర్ట కమిటీ ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు మేరకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. అనంతరం నాయకుల పిలుపు మేరకు విద్యార్థులు ప్రదర్శనగా చలో సెక్రటేరియ ట్ చేపట్టగా.. అప్రమత్తమైన పోలీసులు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్ వద్ద అడ్డుకున్నారు.
అక్కడ పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సచివాలయం నుంచి బయటకు వచ్చిన మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలను విద్యార్థులు అడ్డుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రులను అడ్డుకున్న నాయకులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చిపడేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ర్ట అధ్యక్షుడు కోట రమేశ్, ప్రధాన కార్యదర్శి సాంబశివ, నాయకులు నాగేశ్వర్‌రావు, జగదీశ్, ప్రకాష్ కారత్, లక్ష్మణ్ తదితరులతో పాటు 44 మందిని పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టులు కాకుండా ధర్నాచౌక్ వైపు పరుగులు తీస్తున్న విద్యార్థులను పోలీసులు వెంటపడి మరీ పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
మెస్ చార్జీలు పెంచాలి: డాక్టర్ నాగేశ్వర్
ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ డా. కె.నాగేశ్వర్ మాట్లాడుతూ కమిటీ సమావేశాల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గంటకు రూ.500 భత్యం తీసుకుంటారని, విద్యార్థుల మెస్ చార్జీలను రోజుకు రూ. 300కి పెంచక పోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు వెంకట్, సహాయ కార్యదర్శి రజని, నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.