అన్నం పెట్టండి మహాప్రభో
* మెస్ చార్జీలు చెల్లించినా భోజనం పెట్టలేదని నిరసన
* వీఎస్‌యూ పరిపాలన భవనం, కళాశాల వద్ద ధర్నా
* సీఐ కాళ్లు పట్టుకుని బతిమిలాడిన విద్యార్థులు
నెల్లూరు (టౌన్): విక్రమ సింహపురి యూనివర్సిటీ రోజుకో వివాదానికి కేంద్ర బిందువవుతోంది. వర్సిటీ అధికారులు అనుసరిస్తున్న తీరుతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా మెస్‌చార్జీలు చెల్లించినా భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా హాస్టల్‌లోనే నిరసన తెలుపుతూ వచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం వీఎస్‌యూ పరిపాలన భవనం వద్ద బైఠాయించారు.
కార్యాలయంలోకి అధికారులు, సిబ్బంది వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంతలో వర్సిటీ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసన విరమించకుంటే కేసులు పెడతామని విద్యార్థులను బెదిరించారు. ఈ క్రమంలో విద్యార్థులు సీఐ అబ్దుల్ కరీం కాళ్లు పట్టుకుని అధికారులతో మాట్లాడి తమకు భోజనం పెట్టించాలని వేడుకున్నారు. మరోవైపు వర్సిటీ క ళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ అందె ప్రసాద్ విద్యార్థుల వద్దకు వచ్చి చిందులు తొక్కారు. నిరసన తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని వీసీతో చర్చించి బుధవారం నాటికి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఇంకోవైపు వీఆర్ హైస్కూలు ప్రాంగణంలోని వర్సిటీ కళాశాల వద్ద విద్యార్థినులు బైఠాయించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన వసతిగృహం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని నిరసన తెలిపారు. ప్రస్తుతం బాలికల హాస్టల్ కొనసాగుతున్న డీకేడబ్ల్యూ కళాశాల వసతిగృహంలో వసతులు అధ్వానంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదంటూ తరగతులు బహిష్కరించారు. ఇంతలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్ వచ్చి టీసీలు ఇచ్చి పంపేస్తామని బెదిరించడంతో విద్యార్థినులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇంత జరిగినా వీసీ, రిజిస్ట్రార్‌లు పరిపాలనా భవనం వద్దకు రాకపోవడంతో దాతలు ఏర్పాటు చేసిన భోజనంతో విద్యార్థులు ఆకలి తీర్చుకున్నారు.
సమస్య ఇదీ
విక్రమ సింహపురి యూనివర్సీటీ పీజీ కళాశాలకు సంబంధించిన వసతి గృహాన్ని కొత్తూరులో నిర్వహిస్తున్నారు. ఇందులో 70 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా క్రమం తప్పకుండా మెస్ చార్జీలు చెల్లిస్తున్నారు. అయితే పాత విద్యార్థులు బకాయి ఉన్నారనే నెపంతో ఆరు నెలలుగా మెస్‌నూ మూసేశారు. తాము మెస్ చార్జీలు చెల్లించినందున తమ వరకైనా భోజనం పెట్టాలని విద్యార్థులు కోరినా వర్సిటీ అధికారుల నుంచి స్పందన కరువైంది.
ఈ క్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ఈ విద్యార్థులు అప్పటి నుంచి భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యార్థినులు కూడా సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీరు డీకేడబ్ల్యూ కళాశాల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి రూ.2 వేలు చొప్పున కాషన్ డిపాజిట్ చెల్లించారు. అయితే ప్రస్తుతం నూతన హాస్టల్ లోకి మార్చితే మరోమారు కాషన్ డిపాజిట్ చెల్లించమంటుండటంతో విద్యార్థినులు మండిపడుతున్నారు.