‘అప్పు చేసి పప్పు కూడు’ ఒకనాటి సామెత. ఇప్పుడు సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు‘అప్పు చేసి చికెన్ కూడు’ పెడుతున్నారు. వారంలో మూడు రోజులు చికెన్, వారం రోజులు కోడిగుడ్డు అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా సంక్షేమ హాస్టళ్లలో మెనూప్రకటించింది. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో వార్డెన్లు అప్పులు చేసివిద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఎనిమిది నెలలుగా మెస్ బిల్లులు మంజూరుచేయకపోవడంతో వార్డెన్లు అష్టకష్టాలు పడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలోని వసతిగృహాలకు రూ.6 కోట్లు బకాయిలు పేరుకు పోవడంతోఇలాగైతే హాస్టళ్ల నిర్వహణ కష్టమంటూ వార్డెన్లు వాపోతున్నారు.
నెల్లూరు రూరల్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు అయినా నేటికీ ప్రభుత్వం బడ్జెట్ (మెస్ చార్జీలు) విడుదల చేయలేదు. దీంతో హాస్టళ్ల వార్డెన్లు అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి వార్డెన్ బయట అప్పు చేసి హాస్టల్‌ను నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి నెలకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం గతేడాది సీఎఫ్‌ఎంఎస్ అనే కొత్త విధానం తీసుకురావడంతో ట్రెజరీ శాఖ నుంచి నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జీలను పెంచుతూ జీఓ విడుదల చేసింది. అయితే పెంచిన చార్జీలు వసతిగృహ అధికారులకు అందడం లేదు. నిధుల విడుదల లేకపోవడంతో కొత్త మెనూ అమలు కూడా అంతంత మాత్రంగానే ఉంది.
జిల్లాలో 87 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీటితో పాటు ఎస్సీ కళాశాల వసతి గృహాలు 14, బీసీ కళాశాల వసతి గృహాలు 20 వరకు ఉన్నాయి. వీటిలో 4 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. తాజాగా ఆగస్టు 1వ తేదీ నుంచి మెనూ చార్ట్‌ను మార్పు చేసింది. ఒక వారం బియ్యంతో కలిపి మొత్తం 23 రకాల నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి, విద్యార్థులకు వడ్డించాలి. ఈ మెనూలో చేసిన మార్పులుకారణంగా విద్యార్థులకు ప్రధానంగా ఒక వారంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం చికెన్ కూర వడ్డించాలి. రోజూ పాలు, గుడ్లతో పాటు అరటి పండ్లు, తినుబండారాలు అందించాలి.
బిల్లులు ఇవ్వరు.. తనిఖీలు చేస్తారు..
గడిచిన మార్చి నుంచి నేటి వరకు డైట్ బిల్లులు వార్డెన్లకు అందలేదు. చాలా మందికి ఫిబ్రవరి నుంచి బిల్లులు అందాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఒక హాస్టల్‌లో 100 మంది నుంచి 150 వరకు విద్యార్థులు ఉండడానికి అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్యను బట్టి సుమారుగా ఒక్కో వసతి గృహానికి రూ.4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు మెస్ చార్జీలు బకాయిలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి డైట్ చార్జీలతో పాటు గత మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులు కూడా ఎక్కువ వసతి గృహాలకు విడుదల కాని పరిస్థితి నెలకొంది. నెలవారీ డైట్ చార్జీలు సకాంలో అందించకుండా ఇటీవల కాలంలో విజిలెన్స్, ఏసీబీ శాఖల అధికారలుతో తనిఖీలపై తనఖీలు నిర్వహించి ఇబ్బందులు గురి చేయడాన్ని వార్డెన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వసతి గృహాలకు మెస్ చార్జీలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వార్డెన్లు కోరుతున్నారు.
సీఎఫ్‌ఎంఎస్ విధానం కారణంగా..
బిల్లులు చెల్లింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రెహెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం)ను కొత్తగా ప్రవేశ పెట్టింది. ఈ నూతన విధాన కారణంగా మెనూకు సంబంధించిన ప్రతి బిల్లును సీఎఫ్‌ఎంఎస్ అన్‌లైన్‌లో పొందుపర్చాలి. ఇది కష్టతరంగా మారింది. విజయవాడ స్థాయిలోనే ఈ నూతన విధానం పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో తిప్పలు తప్పడం లేదు. దీంతో హెచ్‌డబ్ల్యూఓలకు బిల్లులు పాస్‌కావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment