మాసబ్‌ట్యాంక్ బీసీ సంక్షేమ భవనం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్.కృష్ణయ్య తదితరులు
విజయనగర్ కాలనీ: పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడంతో పాటు 16 లక్షల కళాశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు పెంచాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అంజి, నీల వెంకటేశ్, రామకృష్ణ నాయకత్వంలో మాసాబ్‌ట్యాంక్ బీసీ సంక్షేమ భవన్‌ను వేలాది మంది విద్యార్థులతో కలిసి ముట్టడించారు.
ముట్టడిలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ ఆరేళ్ల కిందటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, ఇటీవల పెరిగిన నిత్యావసర ధరల నూనెలు, పప్పులు, కూరగాయలు తదితర ఆహార వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. హోటల్‌లో ఒక్క పూట భోజనం కనీసం రూ.60 ఉందని, హాస్టల్ విద్యార్థులకు పూటకు రూ.10 ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.
జైల్‌లో ఖైదీలకు నెలకు రూ.2,100 ఇస్తూ, హాస్టల్ విద్యార్థులకు రూ.950 ఇవ్వడంలో ఏమైనా న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. 2013 వరకు కోర్సు ఫీజులు మంజూరు చేశారని, 2014 నుంచి ప్రభుత్వం పూర్తి ఫీజు స్కీమ్‌కు పరిమితులు విధిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తోందన్నారు. కార్యక్రమంలో తిరుపతి, అనిల్, అనంతయ్యలతో పాటు వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment