
విద్యార్థులతోపాటు ధర్నాలో ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు
కవాడిగూడ: నాణ్యమైన భోజ నం లేక హాస్టల్ విద్యార్థులు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఐదేళ్ల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగానే మెస్‌చార్జీలు, స్కాలర్‌షిప్‌లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద ఆదివారం నిర్వహించిన మహాధర్నాలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 లక్షలమంది హాస్టల్ విద్యార్థులకు తక్షణమే మెస్‌చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాలేజీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు రూ.1500 నుంచి 3000 వరకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.
బీసీ జనాభా దామాషా ప్రకారం మరో 240 గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, రాజ్‌కుమార్, సతీష్, అనంతయ్య, నిఖిల్, భాస్కర్, ప్రజాపతి మల్లేష్, సందీప్, వంశీ, వందలాదిమంది గురుకుల హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment