సమావేశంలో పాల్గొన్న ఆర్.కృష్ణయ్య తదితరులు
ముషీరాబాద్: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్ రేట్లు పెంచాలని, చదివే విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు రూ.5500 నుంచి 20 వేలకు పెంచాలని, కోర్సుల్లో చదివే విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, ఫీజుల బకాయిలు రూ.3300 కోట్లు చెల్లించాలని నవంబర్ 10న కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్‌వో కార్యాలయాల వరకు ర్యాలీలు జరపాలని 14 బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి.
ఆదివారం బీసీ భవన్‌లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశానికి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హజరై మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్‌షిప్‌లు 5 సంవత్సరాల క్రితం నిర్ణయించారని ఆంధ్రప్రదేశ్‌లో రూ. 20 వేలు స్కాలర్‌షిప్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో కేవలం రూ.5500 మాత్రమే ఇస్తున్నారన్నారు.
ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలన్నారు. 2007లో ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మొత్తం ఫీజులు మంజూరు చేస్తే ప్రభుత్వానికి అదనంగా 150 కోట్లు మాత్రమే భారం పడుతుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ దిక్కులేని శాఖగా మారిందని ఈ శాఖకు కమీషనర్, ఎండీ లేరన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, నీలం వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment