సాక్షి, కరీంనగర్ : సంక్షేమ హాస్టళ్లు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. నెలనెలా రావాల్సిన మెస్ చార్జీలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ వార్డెన్లకు తలకుమించిన భారంగా మారింది. హాస్టళ్లల్లో చదివే పిల్లల భోజనం, ఇతర సదుపాయాలకు నిధుల కొరత ఏర్పడింది. పేద విద్యార్థులకు అన్నం పెట్టేందుకు ఇచ్చే డైట్ చార్జీలు ఏడు నెలలుగా అందడంలేదు. దీంతో వార్డెన్లు అప్పులు చేసి హాస్టళ్లను నెట్టుకొస్తున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక దివాలా తీస్తున్నారు. బిల్లులు మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బిల్లులు ఇవ్వకపోతే ఇక హాస్టళ్లను నడుపలేమని చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. హాస్టళ్లకు సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సరుకుల సరఫరా చేయలేమని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే జిల్లాలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లల్లోని విద్యార్థులకు భోజనం కూడా దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి...
జిల్లాలో బీసీ, ఎస్సీ కలిపి సంక్షేమ హాస్టళ్లు 51 ఉన్నాయి. ఇందులో పోస్టు మెట్రిక్ హాస్టళ్లు 20 ఉండగా ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులు 2,438 మంది వసతి పొందుతున్నారు. అలాగే 31 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉండగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేద విద్యార్థులు 2,720 మంది వరకు వసతి పొందుతున్నారు. పోస్టుమెట్రిక్ హాస్టళ్లల్లో ఉంటున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,200 నుంచి రూ.1,500 వరకు ప్రతినెలా డైట్ చార్జీలు ఇవ్వాల్సి ఉంది. ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు తరగతిని బట్టి రూ.750 నుంచి రూ.1,100 వరకు ఒక్కొక్కరికీ ప్రతినెలా ఇవ్వాలి. హాస్టళ్లకు ప్రభుత్వం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. నూనెలు, ఉప్పు, కారం, చింతపండు మొద లగు సరుకులు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తుండగా, కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్, ఇత ర వస్తువులు హాస్టల్ వార్డెన్లు భరించాలి. ఖర్చు చేసిన వాటికి వార్డెన్లు బిల్లులు చూపితే ప్రతి నెలా మంజూరీ చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
కోట్లల్లో బకాయిలు...
బీసీ, ఎస్సీ, పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ హాస్టళ్లకు ఈ ఏడాది మార్చి నుంచి బిల్లులు రావడం లేదు. ఆలస్యమైన ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది కదా అని వార్డెన్లు స్థోమత లేకున్నా బయట అప్పులు చేసి మరి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ హాస్టళ్ల బకాయిలు దాదాపు జిల్లాలో రూ.6 కోట్ల పైచిలుకు ఉన్నట్లు సమాచారం. ప్రీమెట్రిక్ హాస్టళ్ల కన్నా పోస్టుమెట్రిక్ హాస్టళ్ల వార్డెన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్ల నిర్వహణకు అయ్యే ఖర్చును ముందుగానే 80 శాతం భరించాల్సి ఉంటుంది. బిల్లులు గత ఏడు నెలలుగా నిలిచిపోవడంతో ఒక పోస్టుమెట్రిక్ హాస్టల్ వార్డెన్‌కు రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు రావాల్సి ఉంది. గుడ్లు, పాలు, చికెన్, కూరగాయల వ్యాపారులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. బకాయి డబ్బులు చెల్లిస్తే కానీ సరుకులు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో మరోచోట అప్పులు చేసి పాత అప్పులు తీర్చి మళ్లీ అప్పు చేసి సరుకులు, కూరగాయలు కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో హాస్టళ్ల నిర్వహణ వారి కుటుంబాల పోషణకు తలకుమించిన భారంగా మారిందని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందని కాస్మోటిక్ చార్జీలు...
బీసీ, ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టళ్లల్లో చదువుతున్న పాఠశాలస్థాయి పేద విద్యార్థులకు నెలనెలా కాస్మోటిక్, హేయిర్ కటింగ్, నాప్‌కిన్ చార్జీలు ప్రభుత్వం ఇవ్వాలి. అబ్బాయిలకు నెలకు కాస్మోటిక్ చార్జీల కింద రూ.50, కటింగ్ చార్జీల కింద రూ.12 మొత్తం రూ.62 ఇవ్వాల్సి ఉంది. ప్రైమరీస్థాయి బాలికలకు కాస్మోటిక్ చార్జీలు రూ. 55, హైస్కూల్ విద్యార్థినీలకు నాప్‌కిన్ చార్జీలతో కలిపి రూ.75 ఇవ్వాలి. అయితే ఈ కాస్మోటిక్ చార్జీలు కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదు. డబ్బులు వచ్చినప్పుడు తీసుకోవచ్చనే దృక్పథంతో కటింగ్ చార్జీలు, సబ్బులు, నూనెలకు వార్డెన్లు వారి జేబుల నుంచి ఇస్తున్నారు. ఇలా వార్డెన్ల జేబులు ఖాళీ అవుతున్నాయే తప్ప బిల్లులు రావడం లేదు.
ఫ్రీజింగ్ ఉండటంతో..
ఏడు నెలలుగా మెస్‌చార్జీలు, ఇతరత్రా నిధులు రావాల్సి ఉంది. మధ్యలో రెండుసార్లు నిధులు వచ్చాయి. ఫ్రీజింగ్‌లో ఉండటం వల్ల నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే వార్డెన్లకు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.
– బాలసురేందర్, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి
బకాయిలు రూ.6 కోట్లు?
Published Fri, Oct 11 2019 10:56 AM | Last Updated on Fri, Oct 11 2019 10:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment