సర్కారు బడుల్లో ‘హెడ్స్’ ఖాళీ..!
నల్లగొండ : నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో కలిపి మొత్తం ఉన్నత పాఠశాలలు 572 ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 77 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. నెలవారీ ఉద్యోగ విరమణలతో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంలో చేపట్టిన నెలవారీ పదోన్నతుల ప్రక్రియ ద్వారా పాఠశాలల్లో ఖాళీలు భర్తీ అయ్యేవి. జూలై-2015తో నెలవారీ పదోన్నతులు కల్పించడాన్ని నిలిపేశారు. దీంతో అప్పటి నుంచి రిటైర్ అయిన హెచ్‌ఎంల స్థానంలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నారు.
ఇదిలావుంటే కొత్తగా ఏర్పడిన 70 మండలాల్లో ఎంఈఓల పోస్టులు ఖాళీగా ఉండటంతో సీనియర్ హెచ్‌ఎంలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఓ వైపు హెచ్‌ఎంలు లేక పాఠశాలలు కుంటుపడుతుంటే...మరో వైపు ఎంఈఓ పోస్టులు భర్తీ చేయకుండా సీనియర్ హెచ్‌ఎంలపై అదనపు భారం మోపడం వల్ల ఉన్నత పాఠశాలలు మరింత నష్టపోవాల్సి వస్తోంది. ఈ విషయాలన్నీ విద్యాశాఖ సెప్టెంబర్‌లో నిర్వహించిన క్షేత్రస్థాయి తనిఖీల్లో బట్టబయలయ్యాయి.
నష్టపోతున్న విద్యార్థులు...
‘గురు’తర బాధ్యతను సమర్థంగా నిర్వహించడంలో హెడ్‌మాస్టర్లు విఫలమవుతున్నట్లు క్షేత్రస్థాయి తనిఖీలో తేలింది. ఏటా నాయకత్వ లక్షణాలపై హెచ్‌ఎంలకు విద్యాశాఖ ఐదు రోజుల శిక్షణ ఇస్తుంది. శిక్షణ పొందుతున్న హెచ్‌ఎంలు ఆచరణలో ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇన్‌చార్జిలు ఉన్న పాఠశాలల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెగ్యుల్ హెచ్‌ఎంలు చాలా మంది బోధన విధులకు ఎగనామం పెడుతున్నారు. ఒక్కో హెచ్‌ఎం వారానికి 8 తరగతులు బోధించాల్సి ఉంటుంది. స్వయంగా బోధిస్తూ ఉపాధ్యాయుల బోధనను పర్యవేక్షించాలి. అకడమిక్ క్యాలెండర్‌ను, నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని సమర్థంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాలి.
వీటిన్నింటినీ పక్కనపెట్టి కేవలం టీచర్ల వేతన బిల్లులు, ఇతర వ్యవహారాలకే పరిమితమైనట్లు విద్యాశాఖ తనిఖీలో తేలింది. ఉదాహరణకు వేములపల్లి మండలం రావులపెంట ఉన్నత పాఠశాల రెగ్యులర్ హెచ్‌ఎంను ఇన్‌చార్జి ఎంఈఓగా నియమించారు. ఆ ఎంఈఓకే మళ్లీ డీఈఓ ఆఫీస్‌లో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్‌గా అదనపు బాధ్యత అప్పగించారు. దీంతో ఇన్‌చార్జిల పర్యవేక్షణలోనే పాఠశాలలు నడిపే పరిస్థితి ఏర్పడింది.
అంతా ఇన్‌చార్జీల మయం....
ఉమ్మడి జిల్లాలోని 59 మండలాలు, కొత్తగా ఏర్పడిన 11 మండలాలతో కలిపి మొత్తం 70 మండలాల్లో ఎంఈఓ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పదకొండు కొత్త మండలాల్లో అడవిదే వులపల్లి ‘బి’గ్రేడ్ మండలం అయినందున ఆ మండలానికి ఎంఈఓ పోస్టు ఇవ్వలేదు. దీంతో దామరచర్ల ఎంఈఓకు అడవిదేవులపల్లి మండ లాన్ని అదనంగా అప్పగించారు. మిగిలిన 69 మండలాలకు ప్రస్తుతం సీనియర్ హెచ్‌ఎంలే ఇన్‌చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో పాఠశాలల పర్యవేక్షణ కరువై పదో తరగతి ఫలితాల ఉత్తీర్ణతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారం నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభంకానున్నాయి.
ఒక్కో ఎంఈఓ ప్రతి మండలంలో కనీసం 40 నుంచి 50 పాఠశాలలు పర్యవే క్షించాలి. వంద నుంచి 150 మంది ఉపాధ్యాయుల పనితీరు చూడాలి. వేతనాలు, సెలవులు, మధ్యాహ్నభోజనం, నెలవారీ నివేదికలు, పాఠశాలల అవసరాలు, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమా లు, ఉన్నతాధికారుల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇన్‌చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వహించే ప్రధానోపాధ్యాయుడు మండల బాధ్యతలతో పాటు తన పాఠశాలను కూడా పర్యవేక్షించాలి. మండలంలోనే పనులకే అధిక సమయం పడుతుండటంతో ప్రధానోపాధ్యాయుడిగా తన పాఠశాలల పర్యవేక్షణ తక్కువగానే ఉంటోంది. రెండు వైపుల బాధ్యతలు నిర్వర్తించడం ఎంఈఓలకు కత్తిమీదసామే అవుతోంది.