మిథ్యాశాఖ
అస్తవ్యస్తంగా వ్యవస్థ..
- ఇప్పటికీ ఎంఈఓలు లేరు
- పుస్తకాల్లేకుండానే పరీక్షలు
- ఇంకా 4.40 లక్షల పుస్తకాలు అవసరం
- అ‘డ్రెస్’లేని యూనిఫాం
- చతికిలబడుతున్న చదువులు
మెదక్: జిల్లా విద్యాశాఖ గాఢనిద్రలో జోగుతోంది. పాఠశాలలు ప్రారంభమైన ఇన్నాళ్లకు కూడా చదువులు గాడిన పడకపోగా, విద్యాశాఖ యంత్రాంగం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. పిల్లలకు పుస్తకాలు పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. యూనిఫాం ఇవ్వలేదు. పాత ఎంఈఓలు బదిలీ అయి 46 రోజులైనా.. ఇప్పటికీ కొత్త వారికి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో చదువులు చతికిలబడుతున్నాయి.
అంతా అస్తవ్యస్తం..
ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అవకతవకలతో కుదేలైన విద్యాశాఖ ఇప్పటికీ దిద్దుబాటుకు ఉపక్రమించలేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాశాఖ పర్యవేక్షణలో మండల విద్యాధికారు (ఎంఈఓ)లదే కీలకపాత్ర. జూలై 7న జరిగిన ప్రధానోపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో జిల్లాలో ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న 20 మంది హెచ్‌ఎంలు బదిలీపై వెళ్లారు. అదే నెల 9న వీరంతా కొత్త పాఠశాలల్లో చేరారు. అయితే వీరు ప్రధానోపాద్యాయుల బాధ్యత నుండి విడుదలైనా.. ఎంఈఓ బాధ్యతల నుంచి తప్పుకోలేదు. కొంతమంది 60 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అక్కడి నుండే వీరు పాత మండలాల్లో ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పర్యవేక్షణ ఘోరం..
ఎంఈఓలుగా ఉన్న హెచ్‌ఎంలు పనిచేసే చోటు నుంచి దూరంగా ఉండటంతో వారానికోసారి మండల కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. దీంతో ఆయా మండలాల్లో పర్యవేక్షణ కరువై పాఠశాలలు గాడి తప్పుతున్నాయి. కాంప్లెక్స్ సమావేశాల్లో, హరితహారం, గ్రామజ్యోతిలో కీలకపాత్ర వహించాల్సిన ఎంఈఓల జాడ కనిపించడం లేదు. ఆగస్టు 15న చాలాచోట్ల మండల విద్యా వనరుల కేంద్రంలో అక్కడ ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఎంఐఎస్‌లు జెండాలు ఎగురవేయడం గమనార్హం. త్వరలో పాఠశాలల్లో అకడమిక్ ఇనస్ట్రక్టర్లను నియమిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో రెగ్యులర్ ఎంఈఓలు అవసరం. ఇతర జిల్లాల్లో బదిలీలు జరిగిన వారం రోజుల్లో కొత్త ఎంఈఓలకు బాధ్యతలు అప్పగించినా.. జిల్లాలో మాత్రం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు.
పుస్తకాలు లేకుండానే ‘పరీక్ష’కు..
పాఠశాలలు తెరచి 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాకు 19,16,137 పుస్తకాలే వచ్చాయి. ఇంకా 4,40,600 పుస్తకాలు అవసరం. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకైతే కనీసం 45 శాతం పుస్తకాలు పంపిణీ కానట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఫార్మటీవ్ 2 టెస్ట్‌లు జరుగుతున్నాయి. మారిన సీసీఈ విధానంలో పుస్తకాలు లేకుండా ఈ టెస్ట్‌లు ఎలా రాయాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బదిలీల సమయంలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేసినప్పటికీ వివిధ పాఠశాలల్లో ఇంకా 1100 పైచిలుకు టీచర్లు అవసరమని తెలుస్తుంది. రేషనలైజేషన్‌లో జరిగిన అక్రమాల వల్లే ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల (వాలంటీర్లు)ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
యూనిఫాం ఏదీ?
ఆగస్టు నెల వచ్చేసినా.. ఇప్పటికీ విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు పంపిణీ కాలేదు. చిరిగిన దుస్తులతోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారు. చాలా పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం పూర్తయినా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉండటంతో విద్యార్థులు తినలేకపోతున్నారు. బియ్యంలో పురుగులు వస్తున్నాయని, అన్నం సరిగా ఉడకడం లేదన్న విమర్శలున్నాయి. మరి, విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు ఎప్పటికి తీసుకుంటుందో?!.