జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం
సాక్షి, ఒంగోలు టౌన్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పాఠశాల పనితీరును పర్యవేక్షించేందుకు డీవైఈఓలు కరువయ్యారు. జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీ ఎప్పుడా అని పలువురు ఉపాధ్యాయులు నేటికీ ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు, కందుకూరు, పర్చూరు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఉన్నాయి. ఒంగోలు ఉప విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న దయానందం ఈ ఏడాది జూన్ 30వ తేదీ ఉద్యోగ విరమణ చేశారు. కందుకూరు ఉప విద్యాశాఖాధికారి పోస్టు గత కొన్నేళ్ల నుంచి ఖాళీగా ఉండటంతో లక్ష్మయ్య ఇన్‌చార్జి ఉప విద్యాశాఖాధికారిగా నియమించారు. ఆయన ఏడాదిన్నర క్రితం ఉద్యోగ విరమణ చేశారు. పర్చూరు ఉప విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో రామ్మోహనరావును ఇన్‌చార్జి ఉప విద్యాశాఖాధికారిగా నియమించారు. ఆయన గత ఏడాది ఉద్యోగ విరమణ చేశారు.
మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో కాశీశ్వరరావును నియమించారు. ఆయన గత ఏడాది ఉద్యోగ విరమణ చేశారు. జిల్లా విద్యాశాఖ పరిధిలోని కీలకమైన నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుత జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావుపై అదనపు బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫిర్యాదులపై నివేదిక ఇచ్చేదెవరు?
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, ఉపాధ్యాయుల మధ్య వివాదాలు తలెత్తి ఫిర్యాదులు చేసుకున్నా, పాఠశాలలకు కేటాయించిన నిధులు దుర్వినియోగమైనా ఉప విద్యాశాఖాధికారి అక్కడకు వెళ్లి ఎంక్వయిరీ చేసి, అందుకు సంబంధించిన రిపోర్టును జిల్లా విద్యాశాఖాధికారికి అందించాల్సి ఉంటుంది. ఆ నివేదికను ఆధారం చేసుకుని జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు(జడ్జిమెంట్) తీసుకుంటారు. అయితే ప్రస్తుతం జిల్లాలోని నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులకు జిల్లా విద్యాశాఖాధికారే ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఏమైనా ఫిర్యాదులు వస్తే స్వయంగా డీఈఓ వెళ్లి ఎంక్వయిరీ చేసి, ఆ ఎంక్వయిరీపై జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సర్వీస్ రూల్స్ లేకపోవడమే
జిల్లాలో కీలకమైన ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీ గత కొన్నేళ్ల నుంచి నిలిచిపోయింది. అందుకు కారణం వారికి సంబంధించిన సర్వీస్ రూల్స్ లేకపోవడమే. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మధ్య ఆధిపత్య పోరు కూడా కీలకమైన ఇలాంటి పోస్టులకు విఘాతం కలిగిస్తోంది. సర్వీస్ రూల్స్‌కు సంబంధించి ఆ రెండు యాజమాన్యాలకు చెందినవారు ఒకరి తర్వాత ఒకరు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల విషయంలో నెలకొన్న రగడ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. అప్పటి ప్రభుత్వాల చేతులు దాటిపోయి చివరకు కోర్టుల వరకు వెళ్లడంతో కీలకమైన ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీపై ప్రభావం చూపుతోంది.
విద్యాశాఖ మంత్రి జోక్యం తప్పనిసరి
జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఇన్‌చార్జిలను నియమించినప్పటికీ వారు జీత భత్యాల బిల్లులకు సంబంధించిన విషయాలకే ఎక్కువగా పరిమితమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో, జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
విజిట్స్..ఇన్‌స్పెక్షన్స్
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలలను క్రమం తప్పకుండా విజిట్స్, ఇన్‌స్పెక్షన్స్ చేయాల్సి ఉంటుంది.
► ప్రాథమిక పాఠశాలలు మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో ఉండగా, ఉన్నత పాఠశాలల పనితీరును ఉప విద్యాశాఖాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది.
► ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో వసతులు సమకూరుతున్నాయా, వారికి పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించారా, మ«ధ్యాహ్న భోజనం సక్రమంగా అందుతుందా, విద్యార్థుల పాఠశాలలకు సక్రమంగా హాజరవుతున్నారా తదితరాలన్నింటిని ఉప విద్యాశాఖాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది.
► అంతేగాక ఉన్నత పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు çసకాలంలో పాఠశాలలకు హాజరవుతున్నారా, తరగతులు ఏవిధంగా చెబుతున్నారు, విద్యార్థులకు పాఠ్యాంశాలు ఎలా బోధిస్తున్నారు తదితర వాటిని కూడా ఉప విద్యాశాఖాధికారులు చూడాల్సి ఉంటుంది.
► ఉన్నత పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయాలను పరిశీలించి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక అందించాల్సి ఉంటుంది.
► ఇక ఉన్నత పాఠశాలలకు విడుదలవుతున్న నిధులు సక్రమంగా వినియోగిస్తున్నారా, నిధులు సరిపోక ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయాలను కూడా తెలుసుకుని జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించడం జరుగుతుంది. వీటితోపాటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన సెలవులు, ఇంక్రిమెంట్లను కూడా ఉప విద్యాశాఖాధికారులే చూడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment